తాటస్థ్యానికిది తరుణం కాదు!

ABN , First Publish Date - 2021-05-31T06:00:21+05:30 IST

సమాజం సంక్షోభంలో పడినప్పుడు- రొమాంటిక్‌ కవిత్వం రాసేవాళ్ళు కూడా అనివార్యంగా ప్రజల కష్టాలు, కన్నీళ్ల గురించి రాస్తారు. ప్రజాజీవితం సంక్షోభాల పాలైనప్పుడు, పాలకులు...

తాటస్థ్యానికిది తరుణం కాదు!

సమాజం సంక్షోభంలో పడినప్పుడు- రొమాంటిక్‌ కవిత్వం రాసేవాళ్ళు కూడా అనివార్యంగా ప్రజల కష్టాలు, కన్నీళ్ల గురించి రాస్తారు. ప్రజాజీవితం సంక్షోభాల పాలైనప్పుడు, పాలకులు ‘‘వస్త్ర హీన రాజా’’ లైనప్పుడు, ఆ రాజుల దాష్టీకం మీద కవులు మాట్లాడ తారు. ఘనీభవించిన కన్నీళ్ల గురించి కవిత్వం రాస్తారు. 


కోవిడ్‌ నేపథ్యంలో దేశంలో అమానవీయమైన పరిస్థితులు చూస్తున్నాం. ప్రజల ప్రాణాల కన్నా ‘సెంట్రల్‌ విస్టా’ పనులే ముఖ్యమైపోయిన పాలకులు ప్రజల ప్రాణాలను గాలికి వదిలేస్తుంటే కూడా, కొన్ని వందల వేల శవాలు పవిత్రమైన గంగానదిలో కొట్టుకుపోతుంటే కూడా రాయని, మాట్లాడని కవులు ఉన్నప్పుడు, రొమాంటిక్‌ పొయెట్రీ రాసుకునే ‘పరుల్‌ ఖక్ఖర్‌’ లాంటి వాళ్లు మరి పాలకులని నిరసిస్తూ కవిత్వం రాస్తారు. ఇక కవుల ‘తటస్థత’ అనేది ఎక్కువ కాలం నిలబడదు. ప్రేమ కవిత్వం, గజళ్ళు రాసుకునే కవులు కూడా ఈ తటస్థతని చేధించుకుని ముందుకు వస్తారు. 


భావకవిత్వం రాసుకుంటూ రాజ కీయ కవిత్వం వైపు రాని పరుల్‌ ఖక్ఖర్‌ అనే గుజరాతీ కవయిత్రి ‘శవ గంగా వాహిని’ అనే కవిత రాసి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చారు. ఆధునిక గుజరాతీ కవిత్వంలోకి ఆలస్యంగా వచ్చిన పరుల్‌ ఖక్ఖర్‌- ప్రేమ కవితలు, గజళ్ళు రాస్తూ గుజరాత్‌ సాహిత్య లోకంలో తనకంటూ ఒక ప్రముఖ స్థానాన్ని పొందారు. పిల్లలు తన మీద ఆధార పడని ఒక స్థితి వచ్చిన తర్వాత గుజరాత్‌ సృజన లోకంలో  ప్రవేశించి ప్రముఖ స్థానాన్ని పొందారు. ఇటీవల ‘ప్రయాగ రాజ్‌’లోని గంగానదిలో కొట్టుకుపోతున్న కొన్ని వేల శవాలను చూసి ఆమె కదిలిపోయారు. స్పందనగా రాసిన ‘శవ గంగా వాహిని’ కవిత రెగ్యులర్‌గా ఆమెను సోషల్‌ మీడియాలో ఫాలో అయ్యేవాళ్లని షాక్‌కు గురిచేసింది. ఆమె నుంచి ఎవరూ ఊహించని కవిత అది.


నిజానికి ఆమె ఇటువంటి కవిత్వానికి దూరంగా ఉండే వారు. ఈ తరహా కవిత్వానికి ఆమె పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదని గుజరాత్‌ లిటరరీ సర్కిల్స్‌లో ఒక విమర్శ కూడా ఉంది. అయితే దేశంలో ఇప్పుడు నెలకొన్న అమానవీయ పరిస్థితులు ఆమెను కలత పెట్టి ఆమె చేత ఈ కవిత రాయించాయి. 


కోవిడ్‌ వల్ల జనం పిట్టల్లా రాలుతున్నప్పుడు, స్మశానాలు హౌస్‌ఫుల్‌ అయిపోయి, శవాల దహనానికి వెయిటింగ్‌ లిస్ట్‌ బోర్డులు పెడుతున్నప్పుడు ఎవరు మాత్రం మానసికంగా డిస్టర్బ్‌ కారు? సరిగ్గా ఇటువంటి మానసిక అల్లకల్లోలం నెలకొన్న పరిస్థితుల నుంచే పరుల్‌ ఖక్ఖర్‌ ఈ కవిత రాశారు. దీన్ని ఒక రాజకీయ కవితగా, రాడికల్‌ కవితగా మనం పేర్కొనవచ్చు. 


ఈ కవితను ఆమె తన ఫేస్బుక్‌ పేజీలో అప్‌లోడ్‌ చేయగానే ఆమెపై పెద్దఎత్తున ట్రోలింగ్‌ మొదలైంది. ఆ కవితని తీసేయాలంటూ ఆమెపై పెద్ద ఎత్తున మానసిక దాడి జరిగింది. ఒక దశలో ఆమె ఫేస్బుక్‌ను లాక్‌ చేసుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడింది. ఆమెని అభిమానించే వాళ్ళు చాలామంది ఈ కవిత తరువాత ఆమెను దూరం పెట్టారు.


నిజానికి దేశంలో పెట్రేగిపోతున్న అసహనాన్ని నిరసిస్తూ 2015లో దేశవ్యాప్తంగా కవులు రచయితలు కళాకారులు సంతకాలు చేసి అప్పటి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి లేఖలు పంపారు. గుజరాత్‌ నుంచి సంతకాలు చేయడానికి పలువురు కవులు మొహం చాటేశారు. దేశంలో పెట్రేగిపోతున్న అసహనాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మౌఖికంగా చెప్పినప్పటికీ సంతకం పెట్టాల్సి వచ్చేటప్పటికీ వెనకాడారు. సత్యం వైపు నిలబడాల్సిన సందర్భంలోనే అసలైన కవులు, రచయితలు ఎవరనే నిజం వెల్లడవుతుంది. దేశంలో అమానవీయమైన పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు కవులు కళాకారులు నిరసన వ్యక్తం చేయడం అనేది ఒక అత్యవసర విషయం. అప్పట్లో పరుల్‌ ఖక్ఖర్‌ మౌనం వహించింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పాలకుల వైఫల్యం మీద ఆమె ఒక కవయిత్రిగా ఆవేదన వ్యక్తం చేసింది: 


శవ గంగా వాహిని

అంతా బాగుందని పీనుగులన్నీ 

ముక్తకంఠంతో ప్రకటించాయి.

అయ్యా.. మీ రామరాజ్యంలో గంగానదిలో 

మృతదేహాలమై ప్రవహిస్తున్నాము.


స్మశానాలన్నీ నిండిపోయాయి, 

కాష్టాలు కాల్చడానికి కట్టెల్లేవ్‌.

పాడెలు మోసీ మోసీ 

మా భుజాలు అలసిపోయాయి. 

ఎడతెగని దుఖంతో 

మా కన్నీళ్లు ఇంకిపోయాయి.

యమకింకరులు 

మా ఇండ్ల ముందు మృత్యుకేళీ ఆడుతున్నరు. 

అయ్యా.. మీ రామరాజ్యంలో గంగానదిలో 

మృతదేహాలమై ప్రవహిస్తున్నాము.


నిత్యం చితులు కాలుతున్నయ్‌. 

బాధపడని క్షణం కావాలి మాకిప్పుడు.

మా ఆడబిడ్డల గాజులు పగులుతున్నాయ్‌. 

రోదనలతో ప్రతీ ఇంట్లో హృదయాలు ముక్కలవుతున్నయి.

ఊర్లన్నీ తగలబడుతుంటే ఫిడేలు వాయిస్తున్న 

ఓ బిల్లా రంగాల్లారా...

మీ రామరాజ్యంలో గంగానదిలో 

మృతదేహాలమై ప్రవహిస్తున్నాము.


అయ్యా మీవి దివ్యమైన వస్ర్తాలు. మీ ప్రతిష్ట 

దేదీప్యమానంగా వెలిగిపోతోంది.

మీరు వజ్రం కాదు బండరాయి అన్న సత్యాన్ని 

జనం ఎప్పుడు తెలుసుకుంటారో?

ఎవరికైనా ధైర్యం ఉందా? ‘అయ్యగారు నగ్నంగా 

ఊరేగుతున్నారు’ అని చెప్పడానికి....

అయ్యా.. మీ రామరాజ్యంలో గంగానదిలో 

మృతదేహాలమై ప్రవహిస్తున్నాము.

(అనువాదం: సతీష్‌ మంజీర)


ఈ కవితని గుజరాత్‌లోని అనేక పత్రికలు పతాక శీర్షికల్లో వేశాయి. ఈ కవిత రాసినందుకు ఆమెపై కొన్ని పత్రికలు దుమ్మెత్తి పోశాయి. ఇక సాహిత్యకారుల ‘జడ్జిమెంట్‌’ గురించి చెప్పనవసరం లేదు. కవితలో సాహిత్య విలువలు లేవని తీర్పులు ఇవ్వడం మొదలెట్టారు. ఇటువంటి తీర్పులు ఇచ్చే వాళ్ళకి స్థానిక మీడియా పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చింది. ఇంత జరుగుతున్నా పరుల్‌ ఖక్ఖర్‌ తన కవితను వెనక్కి తీసుకోలేదు. వర్తమాన దుస్థితికి అద్దం పట్టే కవిత్వం రాసే సాహసం చేసే కవుల మీద ఇటువంటి మానసిక దాడులు తీవ్రతరమవుతున్నాయి. అదే సందర్భంలో సృజకారుల్లో తటస్థత అనేది కూడా ఎక్కువ కాలం ఉండబోదని కూడా పరుల్‌ ఖక్ఖర్‌ కవిత్వ ఉదంతం చాటింపు వేస్తోంది.

నూకతోటి రవికుమార్‌

98481 87416


Updated Date - 2021-05-31T06:00:21+05:30 IST