పెట్రోల్, డీజిల్‌పై... ఎక్సైజ్ ఆదాయం ఎంతంటే ?

ABN , First Publish Date - 2021-12-02T00:30:33+05:30 IST

పెట్రోల్, డీజిల్ పై 20220-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి పన్ను రూపేణా రూ. 3.7 లక్షల కోట్లు సమకూరింది. అంటే ఏడాదిలో దాదాపు రెండింతల ఆదాయం వచ్చింది.

పెట్రోల్, డీజిల్‌పై... ఎక్సైజ్ ఆదాయం ఎంతంటే ?

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ పై 20220-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి పన్ను రూపేణా  రూ. 3.7 లక్షల కోట్లు సమకూరింది. అంటే ఏడాదిలో దాదాపు రెండింతల ఆదాయం వచ్చింది. రాష్ట్రాల వాటా కింద రూ. 20 వేల కోట్లు పంపిణీ చేసింది. కిందటి(2019-20) ఆర్థిక సంవత్సరంలో ఈ సుంకాల ద్వారా వచ్చిన మొత్తం రూ. 1.78 లక్షల కోట్లు. అంటే 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండింతల కంటే ఎక్కువగా వచ్చింది.


భారీగా పెరిగి, ఆ తర్వాత తగ్గి...

కరోనా సమయంలో పన్నులు పెరగడం వసూళ్ల పెరుగుదలపై ప్రభావం చూపింది. ఎక్సైజ్ సుంకాన్ని పెంచడంతో 2021 ఆర్ధిక సంవత్సరంలో ఆదాయం రెండింతలైంది. ముందటేడు(2019 లో) ఎక్సైజ్ సుంకం లీటర్ పెట్రోల్ పై రూ. 19.88, డీజిల్ పైన రూ. 15.83 గా ఉన్నాయి. దీనిని గతేడాది రెండు విడతల్లో లీటర్ పెట్రోల్ పై రూ. 32.38 కు, డీజిల్ పై  రూ. 31.83 కు పెంచారు. మళ్ళీ గత బడ్జెట్‌లో దీనిని వరుసగా రూ. 32.90 కు, రూ. 31.80 కు సవరించారు. కాగా... రిటైల్ ధరలు భారీగా పెరిగినప్పటికీ, వినియోగదారులపై కేంద్ర ప్రభుత్వం గత నెల ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌ పెట్రోల్ పై రూ. 5, లీటర్ డీజిల్ పై రూ. 10 తగ్గించడంతో ఈ సుంకం పెట్రోల్ పై రూ. 27.90, డీజిల్ పై రూ. 21.80 కు తగ్గింది.


రాష్ట్రాలకు వాటా బేసిక్ పై... 

రాష్ట్రాలకు బేసిక్ ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చే ఆదాయంలో వాటా ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సుంకం లీటర్ పెట్రోల్ పై రూ. 1.40 గా ఉంది. పెట్రోల్ పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం కింద రూ. 11, రోడ్డు మౌలిక వసతుల సెస్ కింద రూ. 13, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్ కింద రూ. 2.50 వసూలు చేస్తున్నారు. డీజిల్ పైన బేసిక్ ఎక్సైజ్ సుంకం రూ. 1.80 కాగా, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం కింద రూ. 8, రోడ్డు మౌలిక వసతుల సెస్ కింద రూ. 4 తో పాటు వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి సెస్‌ను విధిస్తున్నారు. అయితే, ఆర్థికసంఘం సిఫారసుల నేపధ్యంలో కేవలం బేసిక్ ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఉంటుంది.


కేంద్రానికి, రాష్ట్రాలకు... 

2016-17 లో ఎక్సైజ్ సుంకం ద్వారా కేంద్రానికి రూ. 2.22 లక్షల కోట్లు, 2017-18 లో రూ. 2.25 లక్షల కోట్లు, 2018-19 లో రూ. 2.13 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ సుంకానికి అదనంగా రాష్ట్రాలు వ్యాట్ విధిస్తాయి. ఏప్రిల్ 2016-మార్చి 2021 మధ్య వివిధ రాష్ట్రాలకు వ్యాట్ ద్వారా రూ. 9.57 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. ఈ అయిదేళ్ల కాలంలో కేంద్రానికి రూ. 12.11 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. 

Updated Date - 2021-12-02T00:30:33+05:30 IST