ఇది మోదీ యుగం

ABN , First Publish Date - 2020-05-26T09:20:27+05:30 IST

నరేంద్రమోదీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఆరేళ్లు పూర్తయింది. ఈ నెల 30తో మోదీ రెండవ సారి అధికారం చేపట్టి కూడా ఏడాది పూర్తవుతుంది...

ఇది మోదీ యుగం

అధికారంలోకి వచ్చింది మొదలు నిర్మాణాత్మక, ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవడంతో పాటు దేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు, అంతర్జాతీయ సమాజంలో భారత్ స్థానాన్ని బలోపేతం చేసేందుకు అనితర సాధ్యమైన నాయకత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించారు. తత్కారణంగానే ఆయన పట్ల భారత ప్రజల అభిమానం దినదిన ప్రవర్థమానమయింది. ఇప్పుడు కరోనా కల్లోలంలో అస్తవ్యస్తమయిన దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించగల శక్తి మోదీకే ఉన్నది.


నరేంద్రమోదీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఆరేళ్లు పూర్తయింది. ఈ నెల 30తో మోదీ రెండవ సారి అధికారం చేపట్టి కూడా ఏడాది పూర్తవుతుంది. ఈ ఆరేళ్ల కాలాన్ని సమీక్షిస్తే రెండు విషయాలు స్పష్టంగా మనకు కనపడతాయి. ఒకటి- ఆరేళ్ల క్రితం మోదీ ప్రాభవం ఏ విధంగా ఉందో, ఇప్పుడూ అదే విధంగా చెక్కు చెదరకుండా ఉంది. దేశ ప్రజల మనసుల్లో మోదీ పట్ల అభిమానం రోజు రోజుకూ పెరిగిపోవడమే తప్ప తగ్గుతున్న దాఖలాలు కనపడడం లేదు. రెండు- ఆరేళ్ల క్రితం ఘోరంగా పరాజయం పొందిన ప్రతిపక్షాల పరిస్థితి ఇప్పుడు అంతకంటే దయనీయంగా తయారైంది. ఈ పరిణామం ఆషామాషీగా జరిగింది కాదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ నిర్మాణాత్మక, ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవడంతో పాటు దేశ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు, ప్రపంచ చిత్రపటంలో భారత్ స్థానాన్ని బలోపేతం చేసేందుకు అనితర సాధ్యమైన నాయకత్వాన్ని నరేంద్ర మోదీ అందించారు. తత్కారణంగానే ఆయన పట్ల భారత ప్రజల అభిమానం దినదిన ప్రవర్థమానమయింది. 


నరేంద్రమోదీ అధికారంలోకి రాకముందు అవినీతి భూయిష్టంగా, అస్తవ్యస్తంగా మారిన దేశ పరిపాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసేందుకు, తన పట్టులోకి తీసుకువచ్చేందుకు ఆయనకు ఎక్కువ కాలం పట్టలేదు. ప్రణాళికా సంఘం వంటి జడత్వం నిండిన యంత్రాంగాల్ని రద్దు చేసి దేశానికి దిశా నిర్దేశం చేసే విధానాలను రూపకల్పన చేసేందుకు నీతీ ఆయోగ్ వంటి సంస్థలను ఆయన ఏర్పాటు చేశారు. ఆర్థిక రంగంలో నిశ్శబ్ద విప్లవం సాధించిన అనేక చర్యలు తీసుకున్నారు. నల్లధనాన్ని అరికట్టేందుకు, డిజిటలీకరణను ప్రవేశపెట్టేందుకు పెద్ద నోట్ల రద్దు, దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని ప్రవేశపెట్టేందుకు జీఎస్టీ అమలు, నిరర్థక ఆస్తులు, మొండిబాకీలతో చచ్చుపడిన బ్యాంకింగ్ రంగాన్ని చైతన్యవంతం చేసేందుకు ఇన్ సాల్వెన్సీ బాంక్ రప్టసీ కోడ్, బ్యాంకులకు అప్పుల చెల్లింపును ఎగకొట్టి విదేశాలకు పారిపోయిన వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ఆక్ట్ వంటివి ఈ చర్యల్లో కొన్ని మాత్రమే.


ఇక మౌలిక సదుపాయాల రంగంలో మోదీ ప్రభుత్వం చేపట్టినన్ని చర్యలు మరే ప్రభుత్వమూ చేపట్టలేదు. జాతీయ రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయడం, బారత్ మాల, సాగర్ మాలా ప్రాజెక్టులు, ప్రాంతీయ విమానాశ్రయాల ఆధునికీకరణ, రైల్వేల ఆధునికీకరణ, విస్తరణ పెద్ద ఎత్తున జరిగాయి. భారత దేశాన్ని పరిశుభ్ర దేశంగా మార్చేందుకు చేపట్టిన స్వచ్ఛభారత్, జనధన్ యోజన క్రింద పేద ప్రజల బ్యాంకు ఖాతాల్లో దాదాపు. 2.8 లక్షల కోట్ల బదిలీ, లక్షలాది పేద మహిళలను ఆదుకునేందుకు ఉజ్జ్వల, అందరికీ ఇళ్లు, ఆదర్శ గ్రామాలు, ఆయుష్మాన్ భారత్, బేటీ పడావో, -బేటీ బచావో వంటి వినూత్న పథకాలు, దేశ వ్యాప్తంగా వంద నగరాలను అన్ని రకాల హంగులతో అభివృద్ది చేసే స్మార్ట్ సిటీల పథకం, మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు మొదలైనవి మొదటి ఐదేళ్లలోనే మోదీ పేరును చరిత్ర పుటల్లో బలంగా నమోదు చేశాయి.


వీటన్నిటితో పాటు దేశ ఆత్మగౌరవాన్ని ఇనుమడించే అనేక చర్యలు మోదీ తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి ప్రపంచ యోగాదినాన్ని ప్రకటించింది. అమెరికాతో పాటు ప్రపంచంలో అనేక దేశాల్లో పర్యటించి మోదీ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు. అమెరికాలోనూ, వివిధ దేశాలల్లోనూ భారతీయులు ఆయనకు అఖండ స్వాగతం పలికారు. మొట్టమొదటి సారి పాకిస్థాన్‌కు ఆయన గట్టిగా బుద్ది చెప్పి ప్రపంచ దేశాలు భారత్‌కు అండగా నిలిచేలా చూశారు. పుల్వామాలో పాక్ ప్రేరిత ఉగ్రవాదులు జరిపిన దాడులకు ప్రతీకార చర్యగా 2019 ఫిబ్రవరిలో ఆక్రమిత కశ్మీర్ లోని బాలాకోట్ పై చేసిన సర్జికల్ దాడులతో మోదీ కోట్లాది భారత ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.


మోదీ ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల ఫలితంగానే ఆయన 2019 మేలో గతంలో కంటే అత్యధిక మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చి దేశ రాజకీయ చరిత్రలో ఏకఛత్రాధిపత్యాన్ని నిలబెట్టుకున్న ఏకైక నాయకుడుగా నిలిచిపోయారు. రెండవ సారి అధికారంలోకి రాగానే మొదటి వందరోజుల్లోనే ఆయన తీసుకున్న అసాధారణమైన, సాహసోపేతమైన చర్యలు భారత దేశ అస్తిత్వానికీ, ఆత్మాభిమానానికీ ప్రతీకలుగా నిలిచిపోయాయి. కశ్మీర్ ను ఉగ్రవాద శిబిరంగా మార్చి పాక్ ప్రేరేపిత చర్యలకు ఇన్నాళ్లుగా దాసోహం ప్రకటించిన భారత ప్రభుత్వ విధానాలను మోదీ తిరగ రాశారు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆర్టికల్ 370, 35 ఏ అధికరణలను రద్దు చేయడం ద్వారా కశ్మీర్ భారత దేశంలో అంతర్భాగమన్న విషయం ప్రపంచ దేశాలకు స్పష్టంచేశారు. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ చట్టాన్ని ఆమోదింపజేసి త్రిపుల్ తలాఖ్ ను రద్దు చేయడం ద్వారా కోట్లాది ముస్లిం మహిళల జీవితాల్లో వెలుగురేఖల్ని ప్రసరింప జేశారు.


భారత దేశంలో మత ప్రాతిపదికగా లింగ వివక్షకు, అసమానతలకూ తావు లేదని, ఇక్కడ చట్టం ముందు అందరూ సమానులేనన్న విషయాన్నిస్పష్టం చేశారు. తద్వారా కాంగ్రెస్ పాటిస్తున్న మైనారిటీల బుజ్జగింపు విధానాలను బుట్టదాఖలు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించే చట్టం ద్వారా పేదరికంలో మగ్గుతున్న మధ్యతరగతి వర్గాల అభిమానాన్ని చూరగొన్నారు. కొన్ని దశాబ్దాలుగా రగులుతున్న రామజన్మభూమి వివాదం మోదీ హయాంలోనే దేశ సర్వోన్నత న్యాయస్థానం సానుకూలంగా పరిష్కరించింది. మరో కొద్ది నెలల్లోనే కోట్లాది భారతీయుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుడి జన్మ స్థలంలోనే ఒక భవ్యమైన మందిరం మన కళ్లముందు ఆవిష్కారం కానున్నది.


దేశంలో పరిస్థితులను పూర్తిగా అదుపులోకి తీసుకుని, ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం నుంచి భారత్‌ను కాపాడి, 5 ట్రిలియన్ డాలర్ల అభివృద్ది దిశగా అడుగులు వేస్తున్న తరుణంలోనే కరోనా విపత్తు ప్రపంచాన్ని చుట్టుముట్టింది. దీనితో రెండవసారి ఎన్నికైన మోదీ ప్రభుత్వం మొదటి ఏడాదే పెను సవాలును ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ కోట్లాది భారతీయులు మోదీపై పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శించారు. దేశమంతా ఆయన బాటలో నడిచింది. ఆయన చేసిన సూచనలను సంయమనంతో పాటించిన తీరు ఆయన పట్ల ప్రజాభిమానం చెక్కుచెదరలేదన్న విషయాన్ని స్పష్టం చేసింది.


ఇప్పుడు కరోనా విపత్తు నుంచి దేశాన్ని పరిరక్షించడమే కాదు, గత రెండు నెలలుగా స్తంభించిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థలో జవజీవాలు ఏర్పర్చి పట్టాలపై నడిపించాల్సిన బాధ్యత మోదీ భుజస్కంధాలపై పడింది. అత్యంత క్లిష్టమైన ఈ సమయంలో మన దేశాధినేతగా మోదీ ఉండడం మన అదృష్టమనే చెప్పాలి. అనుకున్న విధంగానే మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను కుదుపు కుదిపే చర్యల్ని తీసుకోవడం ప్రారంభించారు. కోట్లాది వలస కార్మికులకు జీవనోపాధిని పునరుద్ధరిస్తూనే, దెబ్బతిన్న వ్యవసాయ పారిశ్రామిక రంగాలు, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పారిశ్రామిక రంగానికి చేయూత నిచ్చే బృహత్తర కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. సంక్షోభాలను, సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడం మోదీకి కొత్త కాదు.


గుజరాత్‌లోని భుజ్‌లో పెను భూకంపం సంభవించినప్పుడు మోదీ దాన్ని సవాలుగా తీసుకుని బాధితులను ఆ విపత్తు నుంచి సత్వరమే గట్టెక్కించడమే కాక కనీవినీ ఎరుగని రీతిలో పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు కూడా దేశాన్ని పునర్నిర్మించగల శక్తి నరేంద్రమోదీకే ఉన్నది. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు మోదీ ప్రభుత్వం రూ.21లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడమే కాదు, దేశంలో అభివృద్ధికి బాటలు వేసే అనేక పాలనా సంస్కరణలను ప్రవేశపెట్టింది. అనతి కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుని తాత్కాలికంగా ఏర్పడ్డ అడ్డంకులను అధిగమిస్తుంది. ప్రపంచ సంపన్న దేశాల సరసన అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలబడుతుందనడంలో సందేహం లేదు.

వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2020-05-26T09:20:27+05:30 IST