Borrower's Death: లోన్ తీసుకున్న వ్యక్తి చెల్లించకుండానే చనిపోతే.. ఎవరు చెల్లించాలో తెలుసా..

ABN , First Publish Date - 2022-09-30T02:33:08+05:30 IST

బ్యాంకులు(banks) లేదా ఫైనాన్సియల్ సంస్థల నుంచి లోన్ తీసుకుని నిర్దేశిత కాలపరిమితిలోపు చెల్లించకపోతే సంబంధిత సంస్థలు చూస్తూ ఊరుకోవు.

Borrower's Death: లోన్ తీసుకున్న వ్యక్తి చెల్లించకుండానే చనిపోతే.. ఎవరు చెల్లించాలో తెలుసా..

బ్యాంకులు(banks) లేదా ఫైనాన్సియల్ సంస్థల నుంచి లోన్ తీసుకుని నిర్దేశిత కాలపరిమితిలోపు చెల్లించకపోతే సంబంధిత సంస్థలు చూస్తూ ఊరుకోవు. ముక్కుపిండి మరీ రుణగ్రహీత నుంచి రికవరీ చేస్తాయి. ఈ తరహా బ్యాంకు రికవరీ ఘటనలు బయట కనిపిస్తూనో.. వినిపిస్తూనో ఉంటాయి. మరి లోన్ తీసుకున్న వ్యక్తి (Loan borrower) మధ్యలోనే చనిపోతే?, ఎవరి నుంచి రికవరీ చేస్తారు? సహ-రుణగ్రహీత (co-borrower) నుంచా, హామీగా ఉన్న వ్యక్తి లేదా చట్టబద్ధ వారసుడా? వీరిలో ఎవరి నుంచి లోన్ రికవరీ చేస్తారనే అంశంపై ఎక్కువ మందికి అవగాహన ఉండకపోవచ్చు. ఎందుకంటే అరుదుగా జరిగే ఈ ఘటనల గురించి జనాలు వినుండకపోవచ్చు. మరి రుణగ్రహీత చనిపోతే బ్యాంకులు ఎవరి నుంచి లోన్ రికవరీ చేస్తారో తెలుసుకుందాం పదండి..


రుణగ్రహీత (Loan borrower) చనిపోతే ఎవరు బాధ్యత వహించాలనేది తీసుకున్న లోన్ రకం (type), హామీ(collaterals)లపై ఆధారపడి ఉంటుంది. హామీలేని వ్యక్తిగత లోన్(Personel loans) విషయంలో రుణగ్రహీత చనిపోతే బకాయి చెల్లించాలని వారసులు లేదా అతడి కుటుంబ సభ్యులను బ్యాంకులు అడగవు. ఎందుకంటే ఈ లోన్లపై ఎలాంటి హామీ ఉండకపోవడమే ఇందుకు కారణం. సంబంధిత రుణ బకాయిలను బ్యాంకులు మాఫీ చేస్తాయి. నిరర్ధక ఖాతా(NPA)గా పేర్కొంటాయి.


అయితే లోన్ సహ దరఖాస్తుదారు (co-applicant) లేదా సహ-సంతకదారు (co-signer) ఉన్నట్టయితే వాళ్లే బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు లోన్ల వంటి అన్‌సెక్యూర్డ్ లోన్స్(హామీలేనివి)కు ఇదే విధానం వర్తిస్తుంది. కాగా ఈ రోజుల్లో అన్‌సెక్యూర్డ్ లోన్స్‌కు సంబంధించి ప్రధాన రుణగ్రహీతల్లో అత్యధికులు బీమా (ఇన్సూరెన్స్)  తీసుకుంటున్నారు. లోన్ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కవర్ చేస్తోంది. రీపేమెంట్ పూర్తికాలానికి ఈ ఇన్సూరెన్స్ వ్యాలిడ్‌‌గా ఉంటుంది. కాబట్టి దురదృష్టవశాత్తూ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోయినా బకాయి మొత్తాన్ని ఇన్సూరెన్స్ నుంచి బ్యాంకులు రికవరీ చేసుకుంటున్నాయి. ఇలాంటి లోన్లు తీసుకునే సమయంలో ఇన్సూరెన్స్ కోసం రుణగ్రహీతలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 


గృహ, కారు రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతే..

మరోవైపు గృహరుణం తీసుకున్న వ్యక్తి రీపేంట్ చేయకముందే చనిపోతే.. లోన్ సహ-దరఖాస్తుదారుగా ఎవరైనా ఉన్నారా అని బ్యాంకు అధికారులు  తెలుసుకుంటారు. సహదరఖాస్తుదారు చెల్లించలేకపోతే.. కుటుంబ సభ్యులు, చట్టబద్ధ వారసులు లేదా గ్యారంటీ ఉన్న హామీదారుని బ్యాంకులు సంప్రదిస్తాయి. అందులో ఎవరైనా లోన్ రీపేమెంట్ బాధ్యత తీసుకుంటే హామీగా పెట్టిన ఆస్తిని (సెక్యూర్డ్ ప్రొపర్టీ) తిరిగి అప్పగిస్తాయి. ఒకవేళ రుణ చెల్లింపునకు ఎవరూ ముందుకు రాకపోతే లోన్ రికవరీ కోసం సంబంధిత ప్రోపర్టీని సీజ్ చేసి విక్రయిస్తారు. కాగా ప్రోపర్టీ సీజ్ చేసిన సమయంలో రుణగ్రహీత చట్టబద్ధ వారసులు బకాయి పునరుద్ధరణ కోసం బ్యాంకులను కోరే అవకాశం కూడా ఉంటుంది. ఇక కారు లోన్ తీసుకున్న వ్యక్తి రీపేమెంట్ చేయకముందు ఏదైనా కారణం వల్ల చనిపోతే.. ఆ వ్యక్తి చట్టబద్ధ వారసులు చెల్లించాల్సి ఉంటుందని  బ్యాంకులు కోరతాయి. చెల్లించేందుకు తిరస్కరిస్తే కారుని సీజ్ చేసి వేలంలో విక్రయిస్తారు. తద్వారా బ్యాంకు అధికారులు లోన్ రికవరీ చేస్తారు.

Updated Date - 2022-09-30T02:33:08+05:30 IST