ఈ రాజకీయ అనుబంధమేనాటిదో!

ABN , First Publish Date - 2020-12-06T05:42:02+05:30 IST

తమిళ రాజకీయాలకు, తమిళ సినీ నటులకు అవినాభావ సంబంధముంది. తమిళనాడు ముఖ్యమంత్రుల్లో ఎక్కువ మంది సినిమా నేపథ్యమున్నవారే! తాజాగా తలైవా రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రం చేస్తున్నానని స్పష్టం చేశారు.

ఈ రాజకీయ అనుబంధమేనాటిదో!

తమిళ రాజకీయాలకు, తమిళ సినీ నటులకు అవినాభావ సంబంధముంది. తమిళనాడు ముఖ్యమంత్రుల్లో ఎక్కువ మంది సినిమా నేపథ్యమున్నవారే! తాజాగా తలైవా రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రం చేస్తున్నానని స్పష్టం చేశారు. ఇప్పటికే మరో అగ్రనటుడు కమల్‌హాసన్‌ రాజకీయాల్లో చురుకుగానే ఉన్నారు. ఒకప్పుడు సినిమా రంగంలో ప్రత్యర్థులైన వీరిద్దరూ మరో సారి రాజకీయంగానూ పోటీ పడుబోతున్నారు. రజనీ రాకతో ఇప్పటి దాకాస్తబ్దుగా ఉన్న తమిళ రాజకీయం హఠాత్తుగా వేడెక్కింది. సినీ రంగ ప్రముఖులు ఎవరెవరో చూద్దాం..


 అన్నాదురై

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన ప్రముఖుల్లో తొలి వ్యక్తి అన్నాదురై. అనేక నాటకాలు మాత్రమే కాదు కొన్ని సినిమాలకు రచన కూడా చేశారు. తమిళ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ‘ద్రవిడ మున్నేట్ర కజగం’ (డి.ఎం.కె.) పార్టీని స్థాపించిన అన్నాదురై- ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఎంజీఆర్‌, కరుణానిధి  వంటి వారందరూ మొదట్లో ఆయన నేతృత్వంలో పనిచేసినవారే!


 కరుణానిధి

అన్నాదురై ప్రభావం కరుణానిధి మీద బాగా ఉండేది. డి.ఎం.కె. పార్టీ సభ్యుడైన కరుణానిధి తను రచన చేసిన ‘ప్రజాశక్తి’  వంటి చిత్రాల్లో ద్రవిడ పార్టీ భావజాలాన్ని వినిపించారు. అన్నాదురై వారసుడిగా పేరు సంపాదించుకొని- అన్నాదురై మరణానంతరం 1969లో తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అనేక ఉద్ధానపతనాలను చవిచూసిన కరుణానిధి- సినీ రంగంతో తన అనుబంధాన్ని కొనసాగించారు. జీవిత చరమాంకం దాకా రచనలు చేస్తూనే ఉన్నారు. 


ఎం.జి.రామచంద్రన్‌

మొహానికి రంగుపూసుకొని నటించేవారికి ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయనే విమర్శలను తట్టుకొని- తమిళనాడు ముఖ్యమంత్రి అయిన హీరో ఎంజీఆర్‌. మొదట్లో డి.ఎం.కె. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన ఆ తర్వాత పార్టీ పెద్ద తీరు నచ్చక బయటకు వచ్చేశారు. సొంతంగా అన్నాడీఎంకే పార్టీని పెట్టారు. ఆయన వేసిన పునాదులే ఇప్పటికీ ఆ పార్టీని నడిపిస్తున్నాయి. ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీ ఆయన పేరిటే ప్రచారం చేస్తూ ఉంటుంది. 


 జానకీ రామచంద్రన్‌

తొలుత జూనియర్‌ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో ప్రవేశించిన జానకి - ఆ తర్వాత హీరోయిన్‌ అయ్యారు. ఎంజీఆర్‌తో కలసి ‘మోహని’(1948) చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఆయనను వివాహం చేసుకున్నారు. ఎంజీఆర్‌ మరణానంతరం- ఆయనకు తానే వారసురాలునని ప్రకటించుకొని- ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే జయలలిత రాజకీయ చతురత ముందు జానకి నిలబడలేకపోయారు. 24 రోజులకే ఆమె పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. 


 శివాజీ గణేశన్‌

తమిళ తెరను ప్రభావితం చేసిన గొప్ప నటుల్లో శివాజీగణేశన్‌ ఒకరు. వైవిధ్యభరితమైన ఎన్నో  పాత్రలు పోషించిన ఆయన  ఒక దశలో డి.ఎం.కె. పార్టీలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి రాజ్యసభ ఎంపీ అయ్యారు. 1988లో సొంతంగా పార్టీ పెట్టి- 50 శాసనసభ స్థానాలకు పోటీ చేసి ఒక్క సీటు గెలవలేకపోయారు. 1989లో ఆయన జనతాదళ్‌ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహారించారు.  


 జయలలిత

తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా అనేక చిత్రాల్లో నటించిన జయలలిత ఎంజీఆర్‌ రాజకీయ వారసురాలిగా పేరుగాంచారు. అన్నాడీఎంకేకు నేతృత్వం వహించి, ఆరుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. విపరీతమైన బంఽధుప్రీతి, అవినీతి ఆరోపణలతో ఆమె రాజకీయ జీవితాన్ని దెబ్బతీశాయి. ‘అమ్మ’ పేరిట మొదలెట్టిన కార్యక్రమాలతో ఆమె తమిళప్రజలకు  ఆరాధ్యదైవమయ్యారు.


 విజయ్‌కాంత్

తమిళనాట కెప్టెన్‌గా పేరొందిన విజయ్‌కాంత్‌కు హీరోగానూ మంచి ఇమేజే ఉంది. ఆయన స్థాపించిన ‘దేశీయ మురుపొక్కు ద్రవిడ కజగం(డీఎండీకె) పార్టీ - 2009లో లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. 2011 శాసన సభ ఎన్నికల్లో 29 స్థానాలు మాత్రమే గెలిచింది. ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు విజయ్‌కాంత్‌. 


 కమల్‌హాసన్‌

విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ రెండేళ్ల క్రితం రాజకీయ రంగప్రవేశం చేశారు. 2018లో ‘మక్కల్‌ నీది మయ్యం’ పార్టీని ప్రారంభించారు. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించారు కూడా! 

రజనీ రాజకీయ రంగ ప్రవేశం నిశ్చయం కావటంతో.. వీరిద్దరి మధ్య ఎలాంటి ఈక్వేషన్లు ఉంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


 శరత్‌కుమార్‌

తమిళహీరో, రాధిక భర్త శరత్‌కుమార్‌ కూడా చాలా కాలం క్రితమే రాజకీయాల్లోకి వచ్చారు. 2007లో ‘ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి’ పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. 2011లో ఏఐఏడిఎంకె’ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో గెలిచారు. 


 ఖుష్బూ

ఒకప్పటి అందాల నటి ఖుష్బూ కూడా రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ఆమె తాజాగా బీజేపీలో చేరారు. ఈ సారి బీజేపీ తరపున ప్రచారం చేయటానికి సిద్ధమవుతున్నారు. 

Updated Date - 2020-12-06T05:42:02+05:30 IST