Abn logo
Oct 19 2021 @ 16:28PM

మహాభారతంలో ఆశ్చర్యకర ఘటన.. కురుక్షేత్ర యుద్ధం ముగియగానే కృష్ణార్జునుల రథం మంటల్లో ఎందుకు కాలిపోయిందంటే..

కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు.. అర్జుని రథసారధిగా వ్యవహరిస్తాడు. ముందుండి నడిపించి పాండవులకు విజయాన్ని అందిస్తాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు సారధిగా ఉన్న రథం.. యుద్ధం అనంతరం మంటల్లో కాలిపోయిందంటే అందరికీ ఆశ్చర్యం కలుగకమానదు. అయిదే ఇది నిజం. యుద్ధం అనంతరం పాండవులంతా చూస్తుండగా.. ధగధగ మంటూ మంటలు అంటుకుని, అందులో రథం కాలిపోతుంది. అయితే అంతకు ముందు శ్రీకృష్ణుడు ఇచ్చిన సూచనలతో అర్జునుడు.. ఆ ప్రమాదం నుంచి బయటపడతాడు. అనంతరం రథం అలా మంటల్లో కాలిపోవడానికి కారణమేంటో శ్రీకృష్ణుడు వివరిస్తాడు.

  కురుక్షేత్ర యుద్ధం ముగియగానే విజయ సంకేతంగా కృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, ధర్మరాజు అనంతవిజయాన్ని, భీముడు పౌండ్రకాన్ని, నకుల సహదేవులు సుఘోష, మణిపుష్పకాల్ని పూరించారు. రథిక శ్రేష్ఠులంతా మహోల్లాసభరితులై వారిని అనుసరించారు. సాత్యకితో పాటు పాండవేయులంతా కౌరవసేనానివేశంలోకి ప్రవేశించారు. ధృష్టద్యుమ్నుడు, శిఖండి తదితరులు, ద్రౌపది తనూజులుతో పాటు, మిగిలిన రాజులంతా తమ తమ శిబిరాల్లోనే విశ్రమించేందుకు సిద్ధపడి ధర్మరాజును సమీపించారు. ‘‘ఈ రాత్రి మా మా శిబిరాల్లోనే మేమంతా విశ్రమిస్తాం. రేపు ఉదయం మిమ్మల్ని కలుస్తాం. అప్పుడంతా హస్తినాపురానికి బయల్దేరొచ్చు’’ అన్నారు. ‘‘సరే’’ అని సెలవిచ్చాడు ధర్మరాజు.

వారలా నిష్క్రమించగానే కౌరవ శిబిరంలో దుర్యోధనుని నివాస భవనానికి చేరుకున్నారు పాండవేయులు. పాండవేయులంతా ఒకొక్కరే రథాలు దిగి భూతలి మీద అడుగిడుతున్నారు. అర్జునుడు వంతు వచ్చింది. అతను రథం దిగబోతుంటే వారించాడు కృష్ణుడు. ‘‘ఏంటి బావా అభ్యంతరం’’ అడిగాడు అర్జునుడు. ‘‘ముందు నువ్వు దిగడం కాదు, గాండీవం, అక్షయతూణీరాల్ని దించి, తర్వాత నువ్వు దిగు. నీ తర్వాత నేను దిగుతాను’’ అన్నాడు కృష్ణుడు.‘‘సరే బావా’’ అన్నాడు అర్జునుడు. అక్షయతూణీరాల్ని, గాండీవాన్నీ దించి తర్వాతనే అర్జునుడు దిగాడు. ‘‘ఆలస్యం దేనికి? నువ్వూ దిగు బావా’’ అన్నాడు అర్జునుడు. ‘‘దిగుతున్నా’’ అని, పగ్గాలు ఒకటొకటే మడిచి, జాగ్రత్తగా పక్క నుంచి, ఒక్కదుటన కిందికి దూకాడు కృష్ణుడు.

కృష్ణుడలా కిందికి దూకిన మరుక్షణం జెండా మీది హనుమంతుడితో పాటూ భూతగణం అంతా తొలగి అదృశ్యమయింది. వారు అదృశ్యమవడమే ఆలస్యం. రథం భగ్గున మండిపోయింది. గుర్రాలతో పాటు రథం దగ్ధమవుతోంటే అర్జునునికేదీ అంతు చిక్కలేదు. ఆశ్చర్యంగా చూస్తూ నిలుచున్నాడు. ధర్మరాజాదులు కూడా అలాగే చేష్టలుడిగి చూడసాగారు. శ్రీకృష్ణునికి నమస్కరిస్తూ అర్జునుడు అడిగాడిలా. ‘‘ఏంటిది బావా? ఒక్కసారిగా ఏంటీ మంటలు అని అడుగుతారు. అందుకు శ్రీకృష్ణుడు.. ‘‘మంటలెందుకంటే...భీష్మ ద్రోణ కర్ణుల శస్త్రాస్త్ర జ్వాలలు రథాన్ని అంటిపెట్టుకుని ఎప్పణ్ణుంచో ఉన్నాయి. వాటిని అదిమిపెడుతూ ఇన్నాళ్ళూ నిన్ను నేను కాపాడుకుంటూ వచ్చాను. యుద్ధం ముగిసింది. ఇక ఆ మహాగ్ని జ్వాలలను ఆపడం క్షంతవ్యం కాదు. అందుకే వదిలేశాను’’ అని నవ్వాడు కృష్ణుడు.

 తేరుకున్న ధర్మరాజాదులను చూసి వారిని సమీపించాడు.‘‘ధర్మనందనా! అర్జునుని నాకప్పిగిస్తూ ఏమన్నావో గుర్తుందా? కంటికి రెప్పలా కాపాడమన్నావు. కాపాడాను. దాని ఫలితమే ఈ అఖండవిజయం’’ అన్నాడు కృష్ణుడు.‘‘తె లుసు మహానుభావా! నీ తోడ్పాటే లేకుంటే భీష్మ ద్రోణాదుల దివ్యాస్త్రాల నుండి మేము బతికి బట్టకట్టడం అసాధ్యం. శ్రీకృష్ణుడు మీ పక్కనున్నాడు. మిమ్మల్ని విజయం వరించి తీరుతుందన్నారు వ్యాసులు వారు. వారన్న మాట అక్షర సత్యమైంది’’ అన్నాడు ధర్మరాజు.


‘‘హస్తినాపురికి ముందుగా నువ్వే వెళ్ళాలి కృష్ణా! ఆ తర్వాతే మేమంతా’’.. అని శ్రీకృష్ణుడితో ధర్మరాజు ఎందుకు అన్నాడో తెలుసా..

ప్రత్యేకంమరిన్ని...