గోర్కీ ‘అమ్మ’ని పోలిన ఈ అమ్మ!

ABN , First Publish Date - 2020-09-17T06:40:08+05:30 IST

‘కులభేదాల’ ఈ వికృత సమాజంలో, ‘వేటపాలెం’ గ్రామంలో, ఒక నిరు పేద కుటుంబంలో, 1920లో, తొలి పిల్లగా పుట్టి పెరిగిన చిన్నది, ఈ అమ్మ!...

గోర్కీ ‘అమ్మ’ని పోలిన ఈ అమ్మ!

ఒక సారి వెంకాయమ్మని కోర్టులో జడ్జీ, ‘‘నక్సలైట్లతో ఎందుకు తిరుగు తున్నావు?’’ అని కేకలేస్తే, వెంకాయమ్మ కన్నీళ్ళు పెట్టుకుంది. ‘‘అలా అనకయ్యా! ఆళ్ళు మంచి కుర్రోళ్ళు! బీదల కోసం పని చేస్తారయ్యా! బీదల కష్టాలు పోవాలనే, వాళ్ళు అంటారయ్యా! శానా మంచోళ్ళయ్యా!’’ అంది. ఒక నక్సలైటు పార్టీలో ప్రజా సంఘాలు వుండాలా, వద్దా? అని చర్చలు జరిగినప్పుడు, వెంకాయమ్మ, ‘‘అయ్యో! ప్రజా సంగాలే లేకపోతే, ఎవరెలాగ నేర్చుకుంటారయ్యా?’’ అని ప్రజా సంఘాలెన్నో కావాలనే చెప్పింది. ఎక్కడ జనాలు ఏ గొడవ పడుతున్నారని తెలిసినా, అటు వెళ్ళి, నిలబడుతుంది. వాళ్ళు చెప్పేదేమిటో వింటుంది. తనకు తోచినట్టు, తగువులు లేకుండా, ఫలానా రకంగా చేసుకోలేరా- అని బోధించడానికి చూస్తుంది.


‘కులభేదాల’ ఈ వికృత సమాజంలో, ‘వేటపాలెం’ గ్రామంలో, ఒక నిరు పేద కుటుంబంలో, 1920లో, తొలి పిల్లగా పుట్టి పెరిగిన చిన్నది, ఈ అమ్మ! 


ఈ దేశంలో, ఆ నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పేదలా-ధనికులా అనే తేడాలు లేకుండానే, వీధుల్లో ఎక్కడంటే అక్కడ చేరే జనాల్లోకి, వెంకమ్మ తండ్రి ఉత్సాహంగా పోతూ, తన మూడేళ్ళ కూతుర్ని భుజాన్న ఎత్తుకుని తీసుకుపోతూ వుండే వాడు. 


జనాలు కూడా చిన్నారి వెంకమ్మని ముద్దు చేస్తూ, ‘‘ఇంగిలీసోళ్ళు మన దేశాన్ని వొదిలి పారిపోయేలాగ చెయ్యాలని వొచ్చావా ఎంకమ్మా?’’ అని వెంకమ్మని పలకరిస్తూ, ఎత్తుకుని దించేవాళ్ళు. 


వెంకమ్మ పదేళ్ళ పిల్లప్పుడు, 1930లో, వాళ్ళ గ్రామంలో కూడా ‘ఉప్పు సత్యాగ్రహం’ వంటిది ప్రారంభమై, పోలీసులు గుంపులు గుంపులుగా దిగితే, జనాల్లో కొందరు అటు పోకుండా తప్పుకున్నారు. వెంకమ్మ తండ్రి కూడా ఇంట్లోంచి కదల్లేదు. వెంకమ్మ కాస్సేపు తండ్రి వాటం చూసి, వీధి లోకి పోతోన్న జనం వెంట పరిగెత్తింది. 


ఇంటికి రాగానే అయ్య కోపంగా, ‘‘పెంకి ముండా! పోలీసులు బాదితే ఏమయ్యేదానివి?’’ అని అరిస్తే, వెంకమ్మ తెల్లబోయింది. ‘‘నువ్వే చెప్పావుగా దేశం కోసం ఎల్లాలని?’’ అంది. 


ఆడ పిల్లల ఎదుగుదలల్ని గురించి పెద్ద వాళ్ళు చెప్పుకునే ‘పెళ్ళీడు’ వచ్చేసింది వెంకమ్మకి పదమూడేళ్ళకే. అదే జరిగిపోయింది వెంకమ్మకి, ముప్పయ్యేళ్ళ పెళ్ళి కొడుకుతో. 


కూలి పనులికి పోతూ వస్తూ వుంటే, మధ్య మధ్య వీధుల్లో జనాల సభలు కనపడితే మొగుణ్ణి వదిలేసి అటు పరిగెత్తి, ఆ గుంపుల్లో కలిసి పోయేది. వెంకమ్మ వెనకాలే భర్త కూడా అటు పరిగెత్తి, ‘‘ఏయ్, ఎంకీ! ఇవతలికి రాయే’’ అని అరిచేవాడు రౌద్రంగా. వెంకమ్మకి వెనక్కి రాక తప్పేది కాదు. ఆ అరిచేవాడు భర్త కదా? 


వెంకమ్మకి పోలీసుల భయం ఎప్పుడూ లేనట్టే, మొగుడి భయం ఆర్నెల్లలో అయినా అలవాటవలేదు. ఆ మర్నాడే ఒక వీధి సభ లోకి పోయి కూర్చుంది. ‘‘జయ్‌ సొతంత్రం, జయ్ సొతంత్రం’’ అంటున్నారు. తన్మయంగా వింటున్న వెంకమ్మ వీపు మీద పెద్ద చరుపు పడింది. వెంకమ్మ ఉలిక్కి పడి వెనక్కి చూస్తే, పధ్నాలుగేళ్ళ భార్యామణికి, ముప్పయ్యేళ్ళ భర్త, కోపంతో వొణికి పోతూ కనపడ్డాడు. 


ఆ భర్త, తాగేసి, తినేసి, నిద్రకి పడ్డాక, వెంకమ్మ తన కోకలూ, రైకలూ, నాలుగూ, గోనె సంచిలో కుక్కి, అర్ధరాత్రి ఆ కొంప దాటి బైటికి పరుగు తీసింది, పుట్టి పెరిగిన వేటపాలానికి. 


తెల్లారే పాటికి ఇంటి కొచ్చి పడిపోయి, అంతా చెప్పింది. తల్లి భోరున ఏడుస్తూ కూతుర్ని తెగ తిట్టింది. ‘‘ఆడు నిన్నింక తీసికెల్తాడా?’’ అంటే, ‘‘నేనింక ఎల్తానా?’’ అంది వెంకమ్మ. సరిగ్గా అదే జరిగింది. వెంకమ్మ, తల్లీ, తండ్రీ బతికున్నప్పుడే చెప్పేసింది, ‘‘నాకు మొగుడొద్దూ; పిల్లలొద్దూ! దేశం కోసం వుంటా నేను’’ అని.


‘‘వెంకమ్మది ఒంటరి బతుకే’’ అని ఎవరైనా అంటే, వెంకమ్మ లెక్క చేసేది కాదు. ‘‘నాకు దేశం అంతా తోడు లేదా?’’ అనేది. కూలి పనులకి పోయి, కూలి డబ్బులు తెచ్చుకుని, తన బతుకు తను బతుకుతూ, వారం పది రోజులకో సభ కన్నా తిరిగేది. 


వెంకమ్మకి యాభై యేళ్ళు దాటాయి. సభలు తగ్గ లేదు. కానీ, చిన్నప్పుడు తిరిగిన సభలన్నీ మారి పోతున్నట్టు కనపడుతున్నాయి. సభల్లో ఉపన్యాసాలన్నీ మారి పోయాయి. స్వతంత్రం ఏ నాడో వచ్చేసిందన్నారు కొందరు. అయినా, అది స్వతంత్రమే కాదంటున్నారు మరి కొందరు. కొత్త ఉపన్యాసాలు వింటోన్న కొద్దీ, వెంకమ్మకి, ‘కమ్యూనిజం’, ‘సోషలిజం’ అనే మాటలు బాగా నచ్చడం మొదలైంది. జనాల్లో కొందరు ధనవంతులుగా వుంటే, కొందరు పేదోళ్ళుగా ఎందుకు వున్నారు? అనే మాట నిరు పేద వెంకమ్మకి నచ్చింది. 


వెంకమ్మ, ‘‘నేను కమ్యూనిస్టుని’’ అనడం మొదలు పెట్టేసింది. ఆ మాట చెప్పుకోటానికి భయ పడేది కాదు. తర్వాత కొన్నేళ్ళకి, ‘‘నేను నక్సలైట్ ని’’ అనేది. 


ఇంక వెంకమ్మకి, ఒక వేపు కూలి పనులూ, ఇంకో వేపు కమ్యూనిస్టు సభలూ! ఆ మాటలన్నీ చెప్పే కుర్రాళ్ళనీ, అమ్మాయిల్నీ, తన పాకలో కూర్చో బెట్టుకుని, వాళ్ళ మాటలన్నీ వింటూ, వాళ్ళు ఏదో ఒక పుస్తకం చదివి పెడుతోంటే వినేది.


అంతా విని, ‘‘దేశాన్ని మార్చెయ్యాలి. మార్చెయ్యకుండా చచ్చి పోకూడదు’’ అనేది. ఆ మాటలు, ఇరుగు పొరుగుల దగ్గిర కూడా అనేది. ‘‘దేశాన్ని ఎలా మార్చాలి? తుపాకుల్తోనా? తప్పు కాదా?’’ అంటారు వాళ్ళు. 


‘‘ఏం తప్పు? తప్పయితే ప్రభుత్వం దగ్గిర తుపాకు లెందుకున్నాయి? మన మీద పేల్చటానికేగా?’’ అనేది. 


వెంకమ్మ పేరు క్రమంగా ‘వెంకాయమ్మ’గా మారింది. వెంకాయమ్మ ఎవరితో మాట్లాడినా, ‘కామ్రేడ్!’ అని మొదలు పెట్టేది. ఒకటో తరగతి వాచకం అయినా చదవని వెంకాయమ్మ, వీధి సభల్లో నిలబడి, ‘దేశాన్ని మార్చాలి. తుపాకుల్తో మార్చాలి’ అని ఉత్సాహంగా మాట్లాడేది. 


వెంకాయమ్మ ఏ పార్టీ లోనూ మెంబరు కాదు. ‌


‌ఏ పార్టీ, ఏ సభ చేసినా వెళ్ళేది. ‘బూర్జువా’లంటే, తెలుసుకుంది. ‘దోపిడీదారు’లంటే తెలుసుకుంది. 


‘‘నేను నక్సలైట్ ని’’ అని బహిరంగంగా ప్రకటించే వెంకాయమ్మ వెనక, పోలీసులు పడడం మొదలైంది. పోలీసులు, వెంకాయమ్మ పాక ముందుకు వచ్చి,  ‘‘మీ ఇంట్లో వున్న కుర్రాళ్ళు ఎవరు?’’ అని అడిగితే, వెంకాయమ్మ నిర్భయంగా, ‘‘వాళ్ళు నా పిల్లలు’’ అంటుంది. 


‘‘నీకు పిల్లలే లేరు కదా?’’ అంటారు పోలీసులు. 


‘‘ఎందుకు లేరు? ప్రజల కోసం పని చేసే వాళ్ళందరూ నా పిల్లలే. మీరు కూడా పేద ప్రజల కోసమే పని చెయ్యండి. అప్పుడు మీరూ నా పిల్లలే’’ అనేది వెంకాయమ్మ. 


కొన్ని సార్లు, పోలీసులు నవ్వి వెళ్ళి పోయేవారు. 


కానీ, ఒక సారి వెంకాయమ్మ, ఉద్యమ కారులైన పది మంది అమ్మాయిల్తో, అబ్బాయిల్తోకలిసి అరెస్టయింది. 


జైల్లో, ఒక ఆడ అధికారి, ఒక ఆడ ఖైదీతో నిర్లక్ష్యంగా, తిడుతూ మాట్లాడుతోంటే, ఆ దగ్గిర్లోనే వున్న వెంకాయమ్మ, ఆ జైలు అధికారిని, నిర్భయంగా విమర్శించింది. జైలులో వున్న ఇతర ఖైదీలు, వెంకాయమ్మతో ‘‘జైలు అధికారితో అంత ధైర్యంగా ఎలా మాట్లాడ గలిగావు?’’ అని అడిగితే, వెంకాయమ్మ నవ్వి, ‘‘ఏం? అడగవలిసిన మాట అడగడానికి భయం ఎందుకు? ఏం చేస్తారు? మహా అయితే చంపేస్తారు. అంతే కదా? మనం ఎలాగా చావుకి సిద్ధం గానే వున్నాంగా?’’ అంది. అప్పుడే కాదు. ఎప్పుడూ, ‘‘చావుకి భయం ఎందుకు? పోలీసోళ్ళు అంత కన్నా ఏం చేస్తారు?’’ అంటూ వుంటుంది. 


వెంకాయమ్మ చాలా సార్లు జైళ్ళలో పడింది. ఒక సారి, జైలు అధికారి, ఆమెని, ‘‘కమ్యూనిజం అంటావు. భూమిని మీరేం చేస్తారు? అందరికీ పంచేస్తారా?’’ అని అడిగాడు. 


వెంకాయమ్మ చప్పున, ‘‘పంచడం కాదయ్యా! అందరూ కలిసి పని చేస్తారు. పంటలు పండితే అందరూ తింటారు. ఒకడు ఏ పనీ ముట్టకపోతే, రెండో మనిషి వొళ్ళు విరుచుకుని పనులు చేస్తూ వుంటే, ఎట్టా వుంటదయ్యా?’’ అంది వెంకాయమ్మ. జైలరు మొదట వెంకాయమ్మ వాదనకి తెల్లబోయాడు గానీ, తర్వాత నవ్వాడు. 


‘‘నేను నక్సలైట్‌ని’’ అని పోలీసులతో కూడా చెప్పుకుంటుంది గానీ, ఏ పార్టీలో గొడవ పడుతున్నారన్నా అక్కడికి పరిగెత్తుతుంది. 


మాలలు, మాదిగల వంటలు తినరని విన్నప్పుడు అటు పరిగెత్తింది. ‘‘మనందరం ఒకటే కదమ్మా? మనం కష్ట జీవులం. మనల్ని మనమే దూరం చేసుకుంటామా? మనందరం కలిసి వుండక పోతే, పెద్ద కులాలతో మనం ఎలా పోరాడతాం?’’ అంటుంది. 


ఒక సారి వెంకాయమ్మని కోర్టులో జడ్జీ, ‘‘నక్సలైట్లతో ఎందుకు తిరుగు తున్నావు?’’ అని కేకలేస్తే, వెంకాయమ్మ కన్నీళ్ళు పెట్టుకుంది. ‘‘అలా అనకయ్యా! ఆళ్ళు మంచి కుర్రోళ్ళు! బీదల కోసం పని చేస్తారయ్యా! బీదల కష్టాలు పోవాలనే, వాళ్ళు అంటారయ్యా! శానా మంచోళ్ళయ్యా!’’ అంది. 


ఒక నక్సలైటు పార్టీలో ప్రజా సంఘాలు వుండాలా, వద్దా? అని చర్చలు జరిగినప్పుడు, వెంకాయమ్మ, ‘‘అయ్యో! ప్రజా సంగాలే లేకపోతే, ఎవరెలాగ నేర్చుకుంటారయ్యా?’’ అని ప్రజా సంఘాలెన్నో కావాలనే చెప్పింది. 


ఎక్కడ జనాలు ఏ గొడవ పడుతున్నారని తెలిసినా, అటు వెళ్ళి, నిలబడుతుంది. చేనేత పనుల వాళ్ళ దగ్గిరికీ, అగరు బత్తీల వాళ్ళ దగ్గిరికీ, అగ్గి పెట్టెల పనివాళ్ళూ, బీడీల పని వాళ్ళూ, జీడి పప్పుల వాళ్ళూ, బంజరు భూముల్లో గుడిసెలు కట్టుకునే వాళ్ళూ, కూరగాయల దుకాణాల వాళ్ళూ, ఆఖరికి అడుక్కునే వాళ్ళ తగువుల దగ్గిరికి కూడా వెళ్ళి కూర్చుంటుంది. వాళ్ళు చెప్పేదేమిటో వింటుంది. తనకు తోచినట్టు, తగువులు లేకుండా, ఫలానా రకంగా చేసుకోలేరా - అని బోధించడానికి చూస్తుంది. 


ఒక మతి స్తిమితం లేని పదేళ్ళ పిల్ల వాడు, తల్లి పోయి, వీధుల్లో పడి ఏడుస్తూ తిరగడం చూసింది ఒక సారి వెంకాయమ్మ. ఆ పిల్ల వాడి చేతిలో అరిటి పండు పెట్టి, వాణ్ణి, ‘‘కామ్రేడ్‌’’ అని పిలుస్తూ, కావిలించుకుంది. వాణ్ణి ఇంటికి తీసుకొచ్చి, వాడికి క్షవరం చేయించి, వేడి నీళ్ళతో తోమి తోమి స్నానం చేయించింది. తన కోసం వండుకున్న తిండి అంతా పెట్టి, తను పడుకునే చాప మీద పడుకోబెట్టి, దుప్పటి కప్పింది. ఆ తర్వాత తను మళ్ళీ వండుకుంది. ఆ పసివాడు ఇక వెంకాయమ్మని వదల్లేదు. 


అలాగే, ఒక గజ్జి కుర్రాణ్ణి కూడా ఇంటికి తెచ్చి, వాణ్ణి శుభ్రం చేసి, మందులు సంపాదించి, రాత్రింబవళ్ళూ వాణ్ణి, ‘కామ్రేడ్‌, కామ్రేడ్‌’ అని పిలుస్తూ, వాడు పనులు చేసుకుంటూ బతికే వాణ్ణిగా చేసింది. 


వెంకాయమ్మ 90 ఏళ్ళ వయసులో 2010లో చనిపోయింది. ‘వెంకాయమ్మ’ అంటే, ఏమిటో తెలియాలంటే, ‘వేటపాలెం వెంకాయమ్మ’ అనే పుస్తకం చదవాలి. వెంకాయమ్మ, పుస్తకాల్లో, కధల్లో, పాత్ర కాదు. నిజం మనిషి. ఈ అమ్మ మీద చిన్న పుస్తకం రాసిన వ్యక్తి, వెంకాయమ్మని తన చిన్నతనం నించీ తెలిసిన నల్లూరి కాంతి. ఈమె ఒక టీచరు. 


వెంకాయమ్మ గురించి కాంతి రాసిన పుస్తకం చదువుతోంటే, ‘వెంకాయమ్మ, ఇలా చేసి వుంటుంది. ఇలా మాట్లాడి కూడా వుంటుంది’ అని నాకు అనిపించినట్టుగా, ఆ పుస్తకంలో లేని కొన్ని విషయాల్ని నా ఊహలలో వాటిని కూడా ఈ వ్యాసంలో రాశాను. కానీ, వెంకాయమ్మ, పోలీసుల తోటీ, జడ్జీల తోటీ మాట్లాడిన విషయాలన్నీ కాంతి రాసిన పుస్తకంలో వున్న నిజం సంగతులే. 


 ఆ పుస్తకం చదువుతోంటే నాకు, వెంకాయమ్మని గోర్కీ ‘అమ్మ’ని పోలిన అమ్మగా భావించాలి అనిపించింది. 

రంగనాయకమ్మ

Updated Date - 2020-09-17T06:40:08+05:30 IST