ఈ నిరక్ష్యం.. ప్రాణాంతకం

ABN , First Publish Date - 2020-03-26T05:30:00+05:30 IST

పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు, ధర్మరాజును పరీక్షించడానికి యమధర్మరాజు యక్షుని రూపంలో వచ్చి యక్ష ప్రశ్నలు వేస్తాడు. వాటిలో ఒకటి.. ‘ఏది ఆశ్చర్యం’ అని. ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం ...

ఈ నిరక్ష్యం.. ప్రాణాంతకం

వేల కోట్లు ఖర్చు చేస్తూ కూడా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ఇంతగా వేడుకుంటున్నారంటే పరిస్థితి తీవ్రతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. మన తక్షణ కర్తవ్యం కరోనా విస్తరించకుండా అడ్డుకోవడమే. అప్పుడు కేసులు, మరణాలు తగ్గడమే కాదు.. భయానక పరిస్థితి కూడా అదుపులోకి వస్తుంది. కరోనాను అడ్డుకునే శక్తి కేవలం మనకు మాత్రమే ఉంది. ప్రధాని మోదీ చెప్పినట్లు, మనకు మనమే ఇంటి గుమ్మం దగ్గర లక్ష్మణ రేఖను గీసుకుని ఇంట్లోనే ఉండడమే దీనికి తరుణోపాయం. 


పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు, ధర్మరాజును పరీక్షించడానికి యమధర్మరాజు యక్షుని రూపంలో వచ్చి యక్ష ప్రశ్నలు వేస్తాడు. వాటిలో ఒకటి.. ‘ఏది ఆశ్చర్యం’ అని. ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూకూడా, మనిషి తాను మాత్రం భూమి మీద శాశ్వతంగా ఉండిపోతానని భావించడం అని ధర్మరాజు సమాధానం చెబుతాడు. దు:ఖం అంటే ఏమిటి అని ప్రశ్నిస్తే.. అజ్ఞానమని తేల్చి చెబుతాడు. కరోనా కరాళ నాట్యం చేస్తున్న ప్రస్తుత విపత్కర సమయంలో కొంతమంది తీరు చూస్తుంటే ఈ ప్రశ్నలు గుర్తుకొస్తున్నాయి. ఇటలీ, ఇరాన్, స్పెయిన్, అమెరికా తదితర దేశాల్లో ప్రతిరోజూ పదుల సంఖ్యలో ప్రజలు కరోనాకు బలి అవుతున్నారు. వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేవలం నిర్లక్ష్యమే ఇటలీలో మరణాలకు కారణమనే చేదు నిజాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేస్తున్నారు. అయినా, కొంతమంది మనకెందుకొస్తుందిలే అనే నిర్లక్ష్యంలో ఉన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో అలక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వాలు పదే పదే చెప్పినా పట్టించుకోవడం లేదు. కరోనా విస్తరణను అడ్డుకోవడానికి ప్రధానమంత్రి 14 గంటల జనతాకర్ఫ్యూకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మోదీ పిలుపు అందుకున్నారు. జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు. సాయంత్రం ఐదు గంటలకు ఇళ్ల బయటకు వచ్చి అద్భుతమైన రీతిలో సంఘీభావం పలికారు. కానీ, కొన్ని ప్రాంతాల్లో ఆ తర్వాత మళ్లీ మామూలైపోయింది. ఈ నిర్లక్ష్యం ప్రాణాంతకం.


కరోనా వైరస్ చైనాలో పుట్టింది. అక్కడ ఇప్పటికే తగ్గిపోయింది. ఇప్పుడు ఇతర దేశాల్లో విస్తరిస్తోంది. అందుకే, విదేశాలకు వెళ్లి వచ్చిన వారికే ఈ వ్యాధి వస్తోంది. దాంతో, మిగిలిన వారిలో నాకెందుకొస్తదిలే అనే నిర్లక్ష్యం కనిపిస్తోంది. నిజమే, కానీ, జగిత్యాల జిల్లాలో మారుమూల పల్లెలో ఉన్న పిలగాడికి కరోనా ఎందుకు వచ్చింది? కొత్తగూడెం పట్టణంలో ఓ కాలనీలో ఉండే అమ్మాయికి కరోనా ఎందుకు వచ్చింది? ఇటీవలి కాలంలో విదేశాలకు వెళ్లని సికింద్రాబాద్‌లోని ఓ అమ్మకు ఎందుకు వచ్చింది? ఆమె కొడుకు కరోనా బారిన ఎందుకు పడ్డాడు? ఈ ప్రశ్నలకు జవాబులు చాలా ఆసక్తికరం. విదేశాలకు వెళ్లి వచ్చిన వారికే కరోనా పరిమితం అయిపోతే అసలు సమస్యే ఉండదు. కానీ, ఇప్పుడది విస్తరించడమే ప్రమాదకరంగా మారింది. ఇందుకు కారణం లేకపోలేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి ఇంట్లో నుంచి ఒకరు అమెరికాలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. అమెరికా మాత్రమే కాదు, నెదర్లాండ్స్, ఫిన్‌లాండ్, దక్షిణాఫ్రికా ఇలా మన తెలుగు ప్రజలు లేని దేశమే లేదంటే అతిశయోక్తి లేదు. అక్కడి నుంచి వాళ్ల రాకపోకలూ అంతే సర్వ సాధారణం. మార్చి ఒకటో తేదీ నుంచి కేవలం 20 రోజుల్లోనే వివిధ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి 20 వేల మందికిపైగా వచ్చారు. అంటే, రోజుకు వెయ్యి మంది అన్నమాట. పాలమూరులోని ఓ పల్లెకు విదేశాల నుంచి ఓ వ్యక్తి వచ్చాడని అనుకుందాం. విదేశాల నుంచి వచ్చినందుకు అతను ఓ దావత్ ఇస్తాడు. దోస్తులను పిలుస్తాడు. బంధువుల పెళ్లికి వెళతాడు. హోటళ్లకు వెళతాడు. నిజానికి, కరోనా సోకిన ఐదు రోజుల వరకూ దాని లక్షణాలు బయట పడవు. దాంతో, తనకు కరోనా లేదని యధేచ్ఛగా తిరిగేస్తాడు. ఐదు రోజుల తర్వాత అతనిలో పాజిటివ్ బయట పడుతుంది. ఆస్పత్రిలో చేరతాడు. కానీ, అప్పటికే అతని నుంచి కొన్ని వందల మందికి వైరస్ సోకి ఉంటుంది. ఎందుకంటే, విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వచ్చిందనుకోండి. అది మొదటి దశ మాత్రమే. ఆ వైరస్ అతనికి మాత్రమే పరిమితమవుతుంది. అతని నుంచి అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సోకితే.. దానిని రెండో దశ అంటారు. ఈ దశలో తెలియకుండానే కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి ఇతరులకు సోకుతుంది. ఇదే మూడో దశ. ఈ దశలోకి ప్రవేశిస్తే కరోనాను అడ్డుకోవడం కష్టసాధ్యమే. అందుకే, ఈ దశలోకి రాకుండా చూసుకోవాలి.


వైద్య ఆరోగ్య రంగంలో అగ్ర భాగాన ఉండే దేశం ఇటలీ. అత్యాధునిక వైద్య సదుపాయాలు దాని సొంతం. ఇటలీలో ప్రతి 1000 మందికి 3.2 ఆస్పత్రి బెడ్లు ఉంటే.. మన దేశంలో వాటి సంఖ్య కేవలం 0.5 బెడ్లు. వెంటిలేటర్ల పరిస్థితి కూడా ఇంతే. అటువంటి ఇటలీ కరోనా ధాటికి అతలాకుతలం అయిపోయింది. యూరప్‌కే తలమానికంగా నిలిచిన అటువంటి దేశంలో ఇప్పుడు రోజూ వందల సంఖ్యలో కరోనా మరణాలు. కరోనా పుట్టిన చైనాలో ఇప్పటి వరకూ మరణించిన వారు 3,281 మంది మాత్రమే. కానీ, మంగళవారం వరకూ ఇటలీలో అంతకు రెట్టింపు మంది బలయ్యారు. ఇందుకు కారణం ప్రజల నిర్లక్ష్యమే. కరోనా తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం అక్కడి ప్రజలపై ఆంక్షలు విధించింది. అయినా, ప్రజలు పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు ఇటలీ కొంప ముంచింది. ఆ దేశంలో కరోనా నాలుగో దశకు చేరుకుంది. అందుకే, ప్రతిరోజూ వందల మంది చనిపోతున్నారు. అక్కడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే.. 80 ఏళ్లు దాటిన వారికి అక్కడ వైద్యం చేయడం లేదు. యువతకు చికిత్స చేయడమే ప్రాధాన్యమని ప్రభుత్వమే చెప్పేస్తోంది. రోగులకు అనుగుణంగా వైద్య పరికరాలు లేకపోవడమే ఇందుకు కారణం.


ఆరు కోట్ల జనాభా ఉన్న ఇటలీలో ఇప్పటి వరకూ దాదాపు 70 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 32 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో దాదాపు 60 వేల కేసులు నమోదయ్యాయి. కానీ, చైనా సరిహద్దుగా కలిగిన 130 కోట్ల భారతదేశంలో కరోనా కేసులు ఇప్పటి వరకూ దాదాపు 600 మాత్రమే. ప్రాణాంతక కరోనాను ఇప్పటికే కట్టడి చేయడం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ పటిమకు ప్రత్యక్ష నిదర్శనం. కరోనా వ్యాప్తిని గుర్తించిన వెంటనే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే కాదు.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ ప్రారంభించారు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం విధించారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలనూ అప్రమత్తం చేశారు. అయినా, విదేశాల నుంచి వచ్చిన వారితో ఇప్పటికీ మనకు ముప్పు పొంచి ఉంది. తమకు వైరస్ సోకిందన్న విషయం తెలియని వారంతా ఇప్పటేకే ప్రజల్లోకి వెళ్లి ఉంటారు. వారి ద్వారా మరికొందరికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందుకే, కరోనా వైరస్ మరింతమందికి వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడానికి ప్రధాని మోదీ దేశమంతా లాక్ డౌన్ విధించారు. నిజానికి, వేల కోట్ల ఆదాయాన్ని వదులుకుని లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే, ప్రధాన మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రెండు చేతులతో దండం పెట్టి ప్రార్థిస్తున్నానని, దయచేసి ఇంట్లోంచి బయటకు రావద్దని ప్రజలను కోరారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రజలు అచ్చు ఇదే పిలుపు ఇచ్చారు. వచ్చే ఆదాయాన్ని వదులుకుని, వేల కోట్లు ఖర్చు చేస్తూ కూడా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ఇంతగా వేడుకుంటున్నారంటే పరిస్థితి తీవ్రతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. కొన్ని వైరస్ లు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతాయి. మరికొన్ని చాలా నెమ్మదిగా విస్తరిస్తాయి. మొదటి కోవలోకి వచ్చే కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం దానిని విస్తరించకుండా అడ్డుకోవడమే. అప్పుడు కేసులు, మరణాలు తగ్గడమే కాదు.. భయానక పరిస్థితి కూడా అదుపులోకి వస్తుంది. కరోనా విస్తరణ నెమ్మదిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనాను అడ్డుకునే శక్తి కేవలం మనకు మాత్రమే ఉంది. ప్రధాని మోదీ చెప్పినట్లు, మనకు మనమే ఇంటి గుమ్మం దగ్గర లక్ష్మణ రేఖను గీసుకుని ఇంట్లోనే ఉండడమే దీనికి తరుణోపాయం. కలరా వచ్చింది. మశూచి వచ్చింది. గత్తర, పోలియో వంటి మహమ్మారులు వచ్చాయి. అటువంటి సందర్భాల్లో మనం బెదిరిపోలేదు. సంయమనంతో, సమష్టి కృషితో వాటిని సమర్థంగా అడ్డుకున్నాం. వాటి బారి నుంచి మనం బయట పడడమే కాదు.. ప్రపంచ దేశాలకు కూడా ఆదర్శంగా నిలిచాం. ఇప్పుడు కూడా అటువంటి మరో అవకాశం మన ముంగిట నిలిచింది. కరోనా వైరస్ 197 దేశాలకు విస్తరిస్తే.. అగ్ర రాజ్యమైన అమెరికా సహా అత్యధిక దేశాలు విలవిలలాడుతున్నాయి. ఈ గత్తర నుంచి ఎలా బయట పడాలో అర్థం కాక అయోమయంలో పడిపోయాయి. ఇప్పటికే మనం ఈ కరోనాను కొంత కట్టడి చేయగలిగాం. ఇప్పుడు మనమంతా చేయీ చేయీ కలుపుదాం. సమష్ఠిగా సంకల్పం చెప్పుకొందాం. ఇంట్లోనే ఉందాం. కరోనాను అంతం చేద్దాం.


జి. కిషన్‌ రెడ్డి

(కేంద్ర హోంశాఖ సహాయమంత్రి)


Updated Date - 2020-03-26T05:30:00+05:30 IST