Abn logo
Jul 15 2021 @ 03:55AM

బుల్లి ఒలంపియన్.. బంగారు బైల్స్

  • టోక్యో బరిలో మెరికల్లాంటి అథ్లెట్లు
  • ఒలింపిక్స్‌ 8 రోజుల్లో


ఒలింపిక్స్‌.. ప్రపంచ దృష్టిని ఆకర్షించే ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనాలనేది ప్రతి అథ్లెట్‌ జీవితకాల స్వప్నం. విశ్వవేదికపై అత్యుత్తమ ప్రదర్శనతో పతకాలు నెగ్గాలనే లక్ష్యంతో.. ఏళ్ల తరబడి శ్రమిస్తుంటారు. వారి కల నెరవేరే సమయం ఆసన్నమైంది. కరోనా మహమ్మారి కారణంగా.. వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ ఈ నెల 23న ఆరంభంకానున్నాయి. గత ఒలింపిక్స్‌లో పసిడి పంట పండించిన జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌  సరికొత్త రికార్డులు సృష్టించడానికి రెడీకాగా.. బ్రిటన్‌కు చెందిన 13 ఏళ్ల టీనేజర్‌ స్కై బ్రౌన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కెన్యా మారథాన్‌ హీరో కిప్‌చోగ్‌, వివాదాస్పద టెన్నిస్‌ స్టార్‌ ఒసాక కూడా బరిలో ఉన్నారు. తొలిసారి ప్రవేశపెట్టిన స్కేట్‌ బోర్డు, క్లైంబింగ్‌, కరాటే, సర్ఫింగ్‌ లాంటి సాహస క్రీడలు యువతను మరింతగా ఆకట్టుకొనే అవకాశం ఉంది. విశ్వక్రీడల్లో తమ అద్భుత విన్యాసాలతో కట్టిపడేసే మెరికల్లాంటి అథ్లెట్లపై ఓ లుక్కేద్దాం...రండి.




(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)


సిమోన్‌ బైల్స్‌ (జిమ్నాస్టిక్స్‌-అమెరికా)

అమెరికా జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ బరిలో ఉందంటే.. మిగిలిన వారు రెండు, మూడు స్థానాల గురించి మాత్రమే ఆలోచించాలి. రియో ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు, ఓ కాంస్యం సాధించిన 24 ఏళ్ల బైల్స్‌.. టోక్యోలో సరికొత్త రికార్డులు సృష్టించనుందని భావిస్తున్నారు. ఈసారి ఆమె ఐదు బంగారు పతకాలతో ముగిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన ట్రయల్స్‌లో బైల్స్‌ సరికొత్త విన్యాసాలతో ప్రత్యర్థులకు ముందుగానే గట్టి హెచ్చరికలు పంపింది. అతి క్లిష్టమైన ఫీట్లతో దండయాత్రకు సిద్ధమైంది. 


స్కై బ్రౌన్‌  (స్కేట్‌బోర్డు-బ్రిటన్‌)

టోక్యో క్రీడలకే ప్రత్యేక ఆకర్షణ.. 13 ఏళ్ల ఒలింపియన్‌ స్కై బ్రౌన్‌. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న పిన్న వయసు బ్రిటన్‌ అథ్లెట్‌ కూడా. స్కేట్‌ బోర్డింగ్‌లో బ్రౌన్‌ బరిలోకి దిగనుంది. స్కేట్‌బోర్డుతోపాటు సర్ఫింగ్‌ను ఎంతో ఇష్టపడే బ్రౌన్‌.. మెగా ఈవెంట్‌లో స్వర్ణమే తన లక్ష్యమని చెబుతోంది. గతేడాది ఆరంభంలో తీవ్రంగా గాయపడిన బ్రౌన్‌.. వేగంగా కోలుకొని పోటీలకు సిద్ధమైంది. ఫీట్‌ చేస్తుండగా కిందపడి పోవడంతో తల, చేతికి బలమైన గాయలయ్యాయి. కానీ, అవేమీ ఆమె సంకల్పాన్ని అడ్డుకోలేక పోయాయి. 

           

అలిసన్‌ ఫెలిక్స్‌ (స్ర్పింటర్‌-అమెరికా)

గతంలో అమ్మాయిగా పతకాలు కొల్లగొట్టిన అమెరికా స్ర్పింటర్‌  ఫెలిక్స్‌.. అమ్మగా బరిలోకి దిగనుంది. 200 మీ, 400 మీ, 4గీ100, 4గీ400 విభాగాల్లో ఫెలిక్స్‌ ఒలింపిక్స్‌ పతకాలను సొంతం చేసుకుంది. 2004 ఏథెన్స్‌ క్రీడల్లో రజతం సాధించిన అలిసన్‌, బీజింగ్‌లో స్వర్ణం, రజతం; లండన్‌లో మూడు స్వర్ణాలు; 2016 రియో ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు, ఓ రజతం నెగ్గింది. ఇప్పుడు టోక్యో క్రీడల్లో 400 మీ, 4గీ400 మీ. రిలేలో ఆమె పోటీ పడనుంది.


టెడ్డీ రీనర్‌ (జూడో-ఫ్రాన్స్‌)

ఫ్రాన్స్‌కు చెందిన రీనర్‌.. పదిసార్లు జూడో వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచాడు. 2012, 2016 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించాడు. ముచ్చటగా మూడోసారి ఒలింపిక్‌ పసిడిపట్టు పట్టాలనుకుంటున్నాడు. 



నవోమి ఒసాక  (టెన్ని్‌స-జపాన్‌) 

తొలి ఒలింపిక్స్‌ ఆడుతున్న జపాన్‌ ప్లేయర్‌ నవోమి ఒసాక.. ఎంతో ఉత్సాహంతో ఉంది. పైగా తను పుట్టినగడ్డ కావడంతో  ఎలాగైనా  పసిడి పతకంతో మెరవాలనే పట్టుదలతో ఉంది. మానసిక పరమైన సమస్యలతో ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న ఒసాక.. వింబుల్డన్‌కు కూడా దూరమైంది. అయితే, విశ్వక్రీడల్లో గొప్ప ప్రదర్శన చేయగలననే ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 


నోవా లైల్స్‌  (అథ్లెటిక్స్‌-అమెరికా)

భవిష్యత్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ను ఏలే అథ్లెట్లలో అమెరికాకు చెందిన నోవా లైల్స్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇతను బోల్ట్‌ తరహాలోనే ఎంతో సరదాగా ఉండే అథ్లెట్‌ కూడా. ఇక అతడు వేసుకొనే సాక్స్‌లు ఎప్పుడూ ప్రత్యేకమే. 200 మీ, 4గీ100 మీలో లైల్స్‌ బరిలోకి దిగనున్నాడు. 


ఎలియుడ్‌ కిప్‌చోగ్‌ (మారథాన్‌-కెన్యా)

కెన్యాకు చెందిన లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ కిప్‌చోగ్‌. బెర్లిన్‌ మారథాన్‌లో వరల్డ్‌ రికార్డు టైమింగ్‌ను నమోదు చేశాడు. రియో ఒలింపిక్స్‌లో పసిడి సాధించాడు. మారథాన్‌ డిఫెండింగ్‌ చాంప్‌గా బరిలోకి దిగతున్న కిప్‌చోగ్‌.. మరోసారి స్వర్ణంతో చరిత్ర సృష్టించాలనుకుంటున్నాడు. 





స్టెఫానీ గిల్మోర్‌  (సర్ఫింగ్‌-ఆస్ట్రేలియా)

ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన సర్ఫింగ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన వరల్డ్‌ చాంపియన్‌ సర్ఫర్‌ గిల్మోర్‌ పసిడి కాంతులీనాలనే పట్టుదలతో ఉంది. 2000లో ఆసీస్‌ స్ర్పింటర్‌ కేథీ ఫ్రీమన్‌ స్వర్ణం సాధించినప్పటి నుంచి తాను కూడా విశ్వక్రీడల్లో పాల్గొని పతకం నెగ్గాలనేది ఆమె కల.