ఈ పురోహితుడు మాకొద్దు

ABN , First Publish Date - 2021-12-02T08:21:37+05:30 IST

ఈ పురోహితుడు మాకొద్దు అంటూ ఆ ఊర్లోని ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్‌ చేశారు. గ్రామ సభ నిర్వహించి మరీ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

ఈ పురోహితుడు మాకొద్దు

  • పెళ్లికి తులం బంగారం.. ఇరువైపులా 25వేల చొప్పున డిమాండ్‌
  • గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకూ అంతే
  • అడిగినంత సంభావన ఇవ్వకపోతే శాపనార్థాలు
  • గ్రామంలో వద్దంటూ తీర్మానం.. ఎవ్వరూ పిలవొద్దంటూ ప్రతిజ్ఞ


నారాయణరావుపేట, డిసెంబరు 1: ఈ పురోహితుడు మాకొద్దు అంటూ ఆ ఊర్లోని ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్‌ చేశారు. గ్రామ సభ నిర్వహించి మరీ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బంజేరుపల్లిలో గ్రామస్థులంతా బుధవారం హనుమాన్‌ ఆలయం వద్ద చేరారు. ‘కట్నం (సంభావన) పేరుతో పురోహితుడు చేస్తున్న దోపిడీని సహించలేకపోతున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి, గృహప్రవేశాలు తదితర శుభాకార్యాల కోసం పురోహితుడి నుంచి ఎదుర్కొంటున్న వేధింపులను ఒక్కొక్కరుగా ఏకరువుపెట్టారు. పెళ్లి చేయాలంటే తులం బంగారంతో పాటు వఽధూవరుల కుటుంబాల నుంచి రూ.20-25 వేల చొప్పున డిమాండ్‌ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహ ప్రవేశం కార్యక్రమం నిర్వహించాలంటే సంభావనగా అర తులం బంగారం ఇవ్వాలని వేధిస్తున్నాడని మండిపడ్డారు.


ఆర్థిక స్థోమత లేని నిరుపేద కుటుంబాలనూ వదలడం లేదని ఆరోపించారు. అడిగినంత సంభావన ఇవ్వని పక్షంలో కార్యక్రమానికి రావడం లేదని.. పైగా తనను కాదని గ్రామంలో పౌరోహిత్యం ఎవరు చేస్తారో చూస్తానంటూ హెచ్చరిస్తున్నాడని ఆరోపించారు. అడిగినంత సంభావన ఇవ్వకపోతే శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్తున్నాడని, కొన్ని సమయాల్లో అశుభం జరిగితే తన శాపనార్థాలతోనే అలా జరిగిందంటూ అందరికీ చెప్పుకొంటూ తమను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. ఇలాంటి పురోహితుడు తమ గ్రామానికి అవసరం లేదంటూ గ్రామ పెద్దలంతా కలిసి తీర్మానం చేశారు. అనంతరం ఆ పురోహితుడిని కార్యక్రమాలకు  ఎవ్వరూ ఆహ్వానించవద్దంటూ గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

Updated Date - 2021-12-02T08:21:37+05:30 IST