ఈ త్రైమాసికం ఊపు... స్టాక్ దూకుడు...

ABN , First Publish Date - 2022-01-25T21:42:49+05:30 IST

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి... ఎస్‌బీఐ కార్డ్స్ మంచి ఫలితాలను సాధించడంతో... కంపెనీ షేర్లకు మార్కెట్‌ డిమాండ్ పెరిగింది. మంగళవారం ట్రేడింగ్‌లో ఈ షేర్లు దూసుకెళ్లాయి. మధ్యాహ్నం 12 గం. సమయానికి దాదాపు మూడున్నర శాతం పెరిగి రూ. 843 వద్ద ఉన్నాయి.

ఈ త్రైమాసికం ఊపు... స్టాక్ దూకుడు...

హైదరాబాద్/ముంబై : డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి... ఎస్‌బీఐ కార్డ్స్ మంచి ఫలితాలను సాధించడంతో... కంపెనీ షేర్లకు మార్కెట్‌ డిమాండ్ పెరిగింది. మంగళవారం ట్రేడింగ్‌లో ఈ షేర్లు దూసుకెళ్లాయి. మధ్యాహ్నం 12 గం. సమయానికి దాదాపు మూడున్నర శాతం పెరిగి రూ. 843 వద్ద ఉన్నాయి. ఇంట్రాడే గరిష్టం రూ. 854.85, కనిష్టం రూ. 781.20 గా ఉన్నాయి. పండుగ సీజన్‌లో కార్డ్‌ స్పెండింగ్స్‌ పెరగడం ఈ స్టాక్‌కు ఊతమిచ్చింది. ప్రత్యేకించి... ఫీజులు, సర్వీసుల ద్వారా వచ్చిన మొత్తాలు పెరగడంతో ఆదాయంలో పెరుగుదల కనిపించింది. ఆదాయం 24 శాతం వార్షిక వృద్ధితో రూ. 3,140 కోట్లకు చేరింది. ఫలితంగా, నికర లాభం వార్షిక ప్రాతిపదికన 84 శాతం పెరిగింది. డిసెంబరు 31 తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి కంపెనీ రూ. 8,285 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.  గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం ఎక్కువ. ఇదే సమయంలో నికర లాభం కూడా 28 శాతం పెరిగి, రూ. 1,035 కోట్లకు చేరుకుంది. 


కంపెనీ ఆస్తుల లాభదాయకతను అంచనా వేసే కీలక సూచిక అయిన 'సగటు ఆస్తులపై రాబడి' గతేడాది ఇదే కాలంలోని 3.3 శాతంతో పోలిస్తే, డిసెంబరు త్రైమాసికంలో 5 శాతంగా ఉంది. క్రెడిట్ వ్యయాలకు ముందు ఆదాయాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలోని రూ. 931 కోట్లతో పోలిస్తే, ఇప్పుడు రూ. 213 కోట్లు, లేదా 23 శాతం పెరిగి, రూ. 1144 కోట్లకు చేరుకున్నాయి. మంచి ఫలితాల నేపధ్యంలో ఎస్‌బీఐ కార్డ్స్ స్టాక్‌పై, బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ‘బయ్’ కాల్‌ను కొనసాగించింది. ప్రస్తుత మార్కెట్ ధర ఇంకా 32 శాతం పెరుగుతుందన్న అంచనాతో, రూ. 1,120 ప్రైస్‌ టార్గెట్‌ ఇచ్చింది. 


మొత్తంమీద ఎస్‌బీఐ కార్డ్స్ అంచనాలకు తగ్గట్లుగా రాణించింది. కార్డ్‌ వ్యయాల్లో 47 శాతం వృద్ధి కనిపించింది. రిటైల్, కార్పొరేట్ వ్యయాలు... వార్షిక ప్రాతిపదికన 36 శాతం, 93 శాతం మేర పెరిగాయి.  కాగా... 2022–24 సంవత్సరాలకు సంబంధించి 51 శాతం ఎర్నింగ్స్‌ సీఏజీఆర్‌ను అందజేస్తుందన్న అంచనాలున్నాయి. 

Updated Date - 2022-01-25T21:42:49+05:30 IST