ఈ పునర్వ్యవస్థీకరణ పాఠశాలల మూసివేతకే!

ABN , First Publish Date - 2021-06-17T09:28:56+05:30 IST

రాష్ట్రపాఠశాల విద్యా శాఖ మే 31న ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. ‘జాతీయ విద్యావిధానం 2020’ ప్రకారం పాఠశాల విద్యను పునర్వ్యవస్థీకరించడానికి సూచనలతో...

ఈ పునర్వ్యవస్థీకరణ పాఠశాలల మూసివేతకే!

రాష్ట్రపాఠశాల విద్యా శాఖ మే 31న ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. ‘జాతీయ విద్యావిధానం 2020’ ప్రకారం పాఠశాల విద్యను పునర్వ్యవస్థీకరించడానికి సూచనలతో ఈ సర్క్యులర్‌ విడుదలైంది. ‘జాతీయ విద్యావిధానం 2020’ మీద బలమైన విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానంలో విద్యావ్యాపారీకరణ, కాషాయీకరణ, అధికార కేంద్రీకరణ, ఉపాధ్యాయుల నియామకాలలోనూ పదోన్నతులలోనూ నియమబద్ధ విధానాలకు స్వస్తి పలకడం, సామాజిక న్యాయానికి నీళ్ళు వదలడం... మొదలైనవి ప్రధానమైన విషయాలు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో ప్రతిపాదిస్తున్న చర్యలలో ఈ ప్రమాదాలు వెంటనే వ్యక్తం కావడం లేదు. ఈ సర్క్యులర్‌లో 10.2 విధానాన్ని 5+3+3+4 గా మార్చడంతోపాటు ప్రాథమిక పాఠశాలల స్థాయిని తగ్గించడం, ఉపాధ్యాయ పోస్టుల కుదింపు ప్రధానాండంగా కనిపిస్తున్నాయి. ఈ సర్య్యులర్‌పై తగినంత చర్చ జరగకపోతే త్వరలో ఇదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగంలో కూడా 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉన్న 12 (5+5+2) సంవత్సరాల పాఠశాల విద్యకు మూడు సంవత్సరాల పూర్వప్రాథమిక విద్యను కలిపి 15 (5+3+3+4) సంవత్సరాల పాఠశాల విద్య అందించడానికి చేసిన ప్రతిపాదన పైకి మంచిదిగానే కనిపిస్తుంది. అయితే ఆ క్రమంలో జరిగే పాఠశాలల పునర్వ్యవస్థీకరణతో ప్రాథమిక విద్య గందరగోళానికి గురయ్యే ప్రమాదం కనిపిస్తున్నది.  


మన రాష్ట్రంలో ప్రస్తుతం 1 నుంచి 5 తరగతుల వరకు ప్రాథమిక పాఠశాలలు, 1 నుంచి 8వ తరగతి వరకు ప్రాథమికోన్నత పాఠశాలలు, 6 నుంచి 10 వరకు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 11, 12 తరగతులను ఇంటర్‌ విద్యగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలో కలపాలని ప్రతిపాదిస్తున్నది. ఇది జరిగితే ప్రాథమిక పాఠశాలలు ఫౌండేషన్‌ పాఠశాలలుగా మారిపోతాయి. అక్కడ రెండవ తరగతి వరకే విద్య అందుబాటులో ఉంటుంది. అంటే 3, 4, 5 తరగతుల విద్యార్థులు తమ నివాసానికి ఒక కిలోమీటరు సామీప్యంలో ఉండే ప్రాథమిక పాఠశాలలను విడిచిపెట్టి మూడు కిలోమీటర్ల దూర పరిమితిలో ఉండే ప్రాథమికోన్నత పాఠశాలలకు వెళ్ళాలన్న మాట. ఈ తరగతుల బాలలు అంత దూరం నడిచి వెళ్ళగలరా? ప్రభుత్వం వాహనాలు పెడుతుందా? ఈ ప్రతిపాదన అన్నింటికంటే ప్రమాదకరమైనది. ఈ పునర్వ్యవస్థీకరణను సాంకేతికంగా చెప్పాలంటే ప్రాథమిక పాఠశాలల స్థాయిని ఫౌండేషన్‌ కోర్సు పాఠశాలలుగా తగ్గించటం అని చెప్పాలి. సారాంశంగా చెప్పాలంటే ఇది సుమారు 34 వేల ప్రాథమిక పాఠశాలలను మూసివేయటమని చెప్పాలి. ఒక్క పాఠశాలను కూడా మూసివేసేది లేదని చెప్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పదులవేల ప్రాథమిక పాఠశాలలను మూసివేయడానికే ఈ పునర్వవస్థీకరణ పథకం వేసిందా అనిపిస్తున్నది. ఈ ప్రతిపాదన అమలు జరిగితే ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుక ఉంచబడిన వర్గాల బాలబాలికలు ప్రాథమిక విద్యకు కూడా దూరం అవుతారు. మరొక్క మాట ఇక్కడ చెప్పుకోవాలి. ప్రాథమిక పాఠశాలను ఈ విధంగా రెండు ముక్కలు చేయాలని ‘జాతీయ విద్యా విధానం 2020’లో పేర్కొనలేదు. బాల బాలికలకు పూర్వ ప్రాథమిక విద్య నుంచి ఇంటర్‌ వరకు మొత్తం 15 సంవత్సరాల విద్య అందించాలన్నదే జాతీయ విద్యా విధానానికి ప్రధానమైన విషయం. భౌతికంగా పాఠశాలలను వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలుగా నిర్వహించుకోవచ్చని జాతీయ విద్యా విధానం పేర్కొంది. వారు చెప్పిన 5+3+3+4 విధానం అనే విభజన పాఠ్య ప్రణాళికకు సంబంధించినది మాత్రమే గాని పాఠశాలల భౌతిక వ్యవస్థీకరణకు సంబంధించినది కాదు.


ఈ ప్రతిపాదనలో భాగంగా 1, 2 తరగతులు ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతాయి. ఆ పాఠశాలకు ఒక యస్‌.జి.టి టీచర్‌ను కేటాయిస్తారు. అదే పాఠశాలలో ఒక సంవత్సరం నిడివి గల ‘పాఠశాల సంసిద్ధత కోర్సు’ పెడతారు. ఈ కోర్సు పూర్తిగా కొత్తది. దీనిని ఫౌండేషన్‌ కోర్సు అంటారు. అయితే 1, 2 తరగతులకు ముందు ప్రవేశపెడుతున్న ఈ కోర్సుకు ప్రత్యేకంగా మానవ వనరులను కేటాయిస్తామని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అంటే అర్హతలు గల ఉపాధ్యాయ పోస్టును కేటాయించరని అర్థం చేసుకోవాలి. వీలయిన చోట్ల అంగన్‌ వాడీలను లేదా పూర్వప్రాథమిక తరగతులను ఇదే పాఠశాల భవనంలో గాని లేదా ఆవరణలో గాని చేరుస్తారు. పూర్వ ప్రాథమిక (పి.పి-1, పి.పి-2) తరగతులు సదరు పాఠశాల ఆవరణలో ఉన్నా లేకపోయినా మొత్తం ఐదు తరగతులను కలిపి ఫౌండేషనల్‌ స్కూలు అంటారు. ప్రాథమిక పాఠశాలను 1 నుంచి 5 వతరగతి వరకు యథాతథంగా ఉంచి పాఠశాల సంసిద్ధత కోర్సును అందులోనే ప్రవేశపెట్టి, వీలయిన చోట్ల పూర్వ ప్రాథమిక తరగతులను కూడా అదే పాఠశాలలలో నిర్వహిస్తే, విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని 20:1ని అభివృద్ధిచేసి ఒక ప్రధానోపాధ్యాయుడిని నియమిస్తే ఈ పాఠశాలలు మెరుగైన ప్రమాణాలను సాధించగలుగుతాయి.


ఈ ప్రతిపాదనల ప్రకారం 3, 4, 5 తరగతులను దగ్గరలో ఉన్న ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలో కలిపితే ప్రాథమికోన్నత పాఠశాలలలో 3 నుంచి 8వ తరగతి వరకు ఉంటాయి. వీటిలో విద్యార్థి నమోదు 150 దాటితే వాటికి ఉన్నత పాఠశాలలుగా స్థాయోన్నతి కల్పిస్తామని ప్రభుత్వం చెపుతుంది. అయితే అంత నమోదు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు సుమారు లేవని చెప్పవచ్చు. మరొక విషయమేమంటే తగినంత నమోదు, అవసరమైన వనరులు కలిగి ఉన్న మండలానికి ఒకటి, రెండు ఉన్నత పాఠశాలలలో 11, 12 తరగతులు ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఇది మంచి ప్రతిపాదనే. అయితే వనరులు కల్పించడం మాత్రమే కాక 11, 12 తరగతులు బోధించడానికి పి.జి.టి లను రెగ్యులర్‌ ప్రాతిపదికన నియమించాలి. కాంట్రాక్ట్‌ అధ్యాపకులను నియమించే ఆలోచన చేస్తే ప్రయోజనం శూన్యం.


ప్రభుత్వ ప్రతిపాదనలో మరొక ముఖ్యమైన విషయం ఉపాధ్యాయుల పునః కేటాయింపు. ఇప్పుడు పాఠశాలల పునర్వ్యవస్థీకరణ రూపంలో వచ్చిన ఈ ప్రతిపాదనలు ఉపాధ్యాయులను మిగులుగా చూపించే అవకాశం ఉంది. సరాసరిన మూడు ప్రాథమిక పాఠశాలలలో ఉన్న 3, 4, 5 తరగతుల బాలబాలికలను ఒక ప్రాథమికోన్నత లేక ఒక ఉన్నత పాఠశాలలో కలిపివేసే అవకాశం ఉంది. మూడు ప్రాథమిక పాఠశాలలలో కనీసం ఆరుగురు ఉపాధ్యాయులు ఉంటారు. ఇందులో ముగ్గురు ఉపాధ్యాయులను అదే పాఠశాలలో ఫౌండేషన్‌ కోర్సు కొరకు కేటాయిస్తారు. మిగిలిన ముగ్గురు ఉపాధ్యాయులను విలీనం చేసుకున్న ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలకు అవే తరగతులను నిర్వహించడానికి కేటాయిస్తారనే హామీ ఏమీ లేదు. విలీనం చేసుకున్న ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రాథమిక విభాగంలో ఇప్పటికే ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటారు. విలీనం తరువాత బాలల నమోదు 60 దాటితే మూడవ పోస్టు ఇస్తారు. అంటే మూడు ప్రాథమిక పాఠశాలల స్థాయిని కుదించడం ద్వారా మిగిలిన మూడు పోస్టులలో ఒకరిని మాత్రమే విలీనం చేసుకున్న ప్రాథమికోన్నత పాఠశాలకు కేటాయిస్తారు. అంటే మూడు ప్రాథమిక పాఠశాలలను ఫౌండేషన్‌ పాఠశాలలుగా కుదిస్తే రెండు ఉపాధ్యాయ పోస్టులు మిగులుతాయి. ఎంత కనీసంగా లెక్కవేసినా 34 వేల ప్రాథమిక పాఠశాలల స్థాయిని కుదించినప్పుడు 15 వేల పోస్టులు మిగులు తేలుతాయి. బాలబాలికలకు విద్య దూరం అవుతుంది. ప్రభుత్వానికి పోస్టులు మిగులుతాయి.


మొత్తానికి జాతీయ విద్యావిధానం అమలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తున్నది. సుమారు 34 వేల ప్రాథమిక పాఠశాలలను ఫౌండేషన్‌ పాఠశాలలుగా కుదించడం, బాలబాలికలకు 3, 4, 5 తరగతులను దూరం చేయడం, ఉన్నత పాఠశాలలలో మాధ్యమాన్ని ఎంచుకునే అవకాశాన్ని కూడా రద్దుచేయడం, పదుల వేల ఉపాధ్యాయుల పోస్టులను మిగులు తేల్చడం, రాబోయే మూడు సంవత్సరాలు కూడా డి.యస్‌.సి వేయకుండా కాలయాపన చేయడం, ఈ పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రధాన లక్షణాలుగా కనిపిస్తున్నాయి. 

రమేష్‌ పట్నాయక్‌

కన్వీనర్‌, ఆంధ్రప్రదేశ్‌ విద్యా పరిరక్షణ కమిటి

అధ్యక్షవర్గ సభ్యులు, అఖిలభారత విద్యాహక్కు వేదిక

Updated Date - 2021-06-17T09:28:56+05:30 IST