కొడుకా లేక ఉద్యోగమా? ఆవేదన చెందుతున్న అమెరికా మహిళ

ABN , First Publish Date - 2020-07-31T01:00:33+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి.

కొడుకా లేక ఉద్యోగమా? ఆవేదన చెందుతున్న అమెరికా మహిళ

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. అమెరికాలో నిత్యం 60 నుంచి 70 వేల కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి చెందుతున్నప్పటికి దేశవ్యాప్తంగా అనేక వ్యాపార కార్యకలాపాలు ఇప్పటికే పూర్తిగా మొదలయ్యాయి. అయితే స్కూళ్లు మాత్రం ఇప్పటికీ మూతపడే ఉన్నాయి. ఒకపక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా వ్యాప్తంగా స్కూళ్లు తెరవాలంటూ రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరోపక్క ఈ సమయంలో స్కూళ్లు తెరవడం ప్రమాదమంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనప్పటికి సెప్టెంబర్ చివరి నుంచి దేశంలో స్కూళ్లను తెరిచే అవకాశం కనపడుతోంది. దేశాన్ని కరోనా కుదిపేస్తున్న ఈ సమయంలో సహజంగా తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లను పంపడానికి ఇష్టపడరు. 


అయితే తమ పిల్లలు స్కూళ్లకు వెళ్తే తప్ప తాము ఉద్యోగానికి వెళ్లలేమని చెబుతున్న తల్లిదండ్రులు కూడా అమెరికాలో చాలా మందే ఉన్నారు. టినా కారల్ అనే మహిళ తన ఆరేళ్ల కొడుకుతో కలిసి జీవిస్తోంది. ఆమె ఫ్రంట్‌లైన్ వర్కర్ కావడంతో.. కరోనా సమయంలోనూ ఉద్యోగం చేయాల్సి వస్తోంది. మరోపక్క కరోనా నేపథ్యంలో తన ఆరేళ్ల కొడుకు గత కొద్ది నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాడు. తాను ఉద్యోగానికి వెళ్తే తన కొడుకును చూసుకోవడానికి ఎవరూ ఉండటం లేదని టినా కారల్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అమెరికాలో వెంటనే స్కూళ్లను తెరవాలని.. లేదంటే తాను కొడుకు కోసం ఉద్యోగాన్ని కాని ఉద్యోగం కోసం కొడుకును కాని వదులుకోవాల్సి వస్తుందని కన్నీటి పర్యంతమైంది. తాను ఏమీ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నానని.. స్కూళ్లు తెరిస్తే కొడుకును స్కూలుకు పంపి.. తాను ఉద్యోగం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని టినా చెబుతోంది. ఉద్యోగం లేకపోతే తాను, తన కొడుకు బతకడం కష్టమని.. ఇదే సమయంలో కొడుకును ఒంటరిగా వదిలి తాను ఉద్యోగం చేయలేనని టినా తెలిపింది. అమెరికాలో టినా మాదిరిగానే చాలా మంది స్కూళ్లను తెరవాలని పట్టుబడుతున్నారు. కాగా.. అమెరికాలో ఇప్పటివరకు 45 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. లక్షా 50 వేల మందికి పైగా కరోనా బారిన పడి మరణించారు.

Updated Date - 2020-07-31T01:00:33+05:30 IST