Abn logo
Oct 13 2021 @ 01:05AM

ఈసారి 9.5 శాతం వృద్ధి

ఐఎంఎఫ్‌ అంచనా 

వాషింగ్టన్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో భారత జీడీపీ వృద్ధి రేటు 9.5 శాతానికి పెరగవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) లో మాత్రం 8.5 శాతానికి పరిమితం కావచ్చని తాజా నివేదికలో పేర్కొంది. కరోనా సంక్షోభ ప్రభావంతో గత ఏడా ది వృద్ధి రేటు మైనస్‌ 7.3 శాతానికి పతనమైన విషయం తెలిసిందే. జూలైలో విడుదల చేసిన రిపోర్టు పోల్చితే, ఐఎంఎఫ్‌ అంచనాలను యథాతథంగా కొనసాగించింది. ఏప్రిల్‌ నివేదికతో పోల్చితే మాత్రం ఈ ఏడాదికి వృద్ధి అంచనా 3 శాతం, వచ్చే ఏడాదికి 1.60 శాతం తగ్గింది. ‘‘భారత్‌పై కరోనా రెండో దశ వ్యాప్తి తీవ్ర ప్రభావం చూపడంతో జూలైలో వృద్ధి అంచనాలను తగ్గించడం జరిగింది. ఈసారి అంచనాలను సవరించాల్సిన అవసరం రాలేద’’ని ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ అన్నారు.


ఐఎంఎఫ్‌, ప్రపంచ వార్షిక సదస్సులో విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం..ఈ ఏడాది ప్రపంచ జీడీపీ వృద్ధి 5.9 శాతంగా, 2022లో 4.9 శాతంగా నమోదు కావచ్చు. అగ్రరాజ్యం అమెరికా వృద్ధి రేటు 2021లో 6 శాతం, 2022లో 5.2 శాతంగా ఉండవచ్చని అంచనా. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవ స్థ చైనా జీడీపీ వృద్ధి ఈసారి 8 శాతం, వచ్చే ఏడాది 5.6 శాతంగా ఉండవచ్చని ఐఎంఎఫ్‌ అంటోంది. 


టీకా పంపిణీలో భారత్‌ భేష్‌: దేశ ప్రజలకు టీకా పంపిణీ కార్యక్రమంలో భారత్‌ పనితీరు బాగుందని ఐఎంఎఫ్‌ కితాబిచ్చింది.  ఆర్థిక సేవల మార్కెట్‌, కరోనా సంక్షోభానికి సంబంధించి భారత్‌లో ఇప్పటికే పలు సవాళ్లు ఎదుర్కొంటోంది. అయితే, కరోనా టీకా పంపిణీ రేటు విషయంలో పనితీరు బాగుతుంది. ఆర్థిక పునరుద్ధరణకు తప్పక దోహదపడగలదని గీతా గోపీనాథ్‌ అన్నారు.