మామిడి నిగనిగ.. ధరలు భగభగ

ABN , First Publish Date - 2020-05-23T09:11:37+05:30 IST

నోరూరించే బంగినపల్లి మామిడి పండ్లకు మార్కెట్‌లో ఎంత పేరుందో... రాజధాని శివారులోని పూడూరు బేనిషాన్‌కు అంతే పేరుందనడం అతిశయోక్తి కాదు.

మామిడి నిగనిగ.. ధరలు భగభగ

ఈసారి తగ్గిన మామిడి పండ్ల ఉత్పత్తులు 

సామాన్యులకు అందనంత దూరంలో ధరలు


పరిగి: నోరూరించే బంగినపల్లి మామిడి పండ్లకు మార్కెట్‌లో ఎంత పేరుందో... రాజధాని శివారులోని పూడూరు బేనిషాన్‌కు అంతే పేరుందనడం అతిశయోక్తి కాదు. సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే పండ్లలో ప్రధానమైనది మామిడి పండు. వేసవిలో నోరూరించే మామిడి పండ్లను తినేందుకు ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతారు. 


వికారాబాద్‌ జిల్లాలోని 18 మండలాల్లో మామిడి పండ్ల విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. పదేళ్ల నుంచి జిల్లాలో మామిడి తోటల సాగు పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం పరిగి, వికారాబాద్‌, తాండూరు మార్కెట్లలో మామిడి పండ్ల విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా పూడూరులో పండించిన పండ్లను హైదారాబాద్‌తోపాటు రంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మార్కెట్‌లలో తరలిస్తుంటారు. 


ఈసారి మామిడి పూత వచ్చే సమయంలో కాలం కలిసిరాలేదు. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా మామిడి నేలపాలై తీవ్ర నష్టం జరిగింది. దీంతో ఆశించిన విధంగా పండ్ల దిగుమతి లేక ధరలు భగ్గుమంటున్నాయి. ఒక్క పూడూరు మండలంలో రెండు వేల ఎకరాల్లో మామిడి సాగు ఉండగా, మిగతా మండలాల్లో మరో ఐదు వేలకుపైగా ఎకరాల్లో తోటలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ మామిడి పండ్ల వ్యాపారం కోట్లలో జరుగుతుంది. 


మామిడి పండ్లకు కేరాఫ్‌ పూడూరు

వికారాబాద్‌ జిల్లాలో మామిడిపండ్లకు పూడూరు మండలమే కేరా్‌ఫగా నిలుస్తున్నది. ఇందులో ముఖ్యంగా రాకంచర్లలో మామిడి తోటలో అనేక రకాల పండ్లు లభ్యమవుతాయి. ఈ తోట ప్రభుత్వ ఆధీనంలో ఉంది. టెండర్‌ వేసి అమ్మడం జరుగుతున్నది. ఈ తోటల ద్వారా ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. రాకంచర్ల తోట నుంచి మామిడి పండ్లను హైదారాబాద్‌తోపాటు, ఇతర రాష్ట్రాలకూ తరలిస్తారు. పూడూరు మండలం రాకంచర్ల అన్ని రకాల మామడి పండ్లు లభ్యమవుతాయి.


మార్కెట్‌లో ధరలిలా..

ఈ ఏడాది రకాలను బట్టి మామిడి పండ్లు కిలో రూ.80-రూ.130 ధర పలుకుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల మామిడి పండ్లు లభిస్తున్నాయి. వాటిలో హిమాయత్‌ మామిడి పండ్లు కిలో ధర రూ. 130, కేసరి-రూ.80, గోవా- రూ.80, మహిముద- రూ.80,  పంచదార-రూ.80, బేనిషాన్‌-రూ.80, ఆవూస్‌- రూ.80, పెద్దరసాలు-రూ.80, చిన్నరసాలు-రూ.80, సపేద-రూ.70, జాంగీర్‌-రూ.70, దశరి మహిముద-రూ.70, చెరకు రసాలు-రూ.70, మల్గోబా- రూ.70, మంజీర- రూ.70, మలెక-రూ.70, లంగ్ద-రూ.70, తోటాపరి-రూ.60 చొప్పున అమ్ముతున్నారు.


రసాయనాలు వాడిన పండ్లను తినొద్దు

మామిడికాయలను కూడా పండ్లుగా మారుస్తున్నారు. అలాగే  పండ్లు మంచికలర్‌ రావడానికి కార్పెట్‌తోపాటు, ఇతర రసాయనాలు వాడుతున్నారు. ఇలాంటి పండ్లను తినడం వల్ల వేసవిలో విరేచనాలకు గురవుతారు. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాఽధులకు దారితీయొచ్చు. 

-డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, సివిల్‌ ఆస్పత్రి, పరిగి


Updated Date - 2020-05-23T09:11:37+05:30 IST