ఈ ‘యూటర్న్‌’ మంచిదే!

ABN , First Publish Date - 2021-06-09T06:55:16+05:30 IST

దేశ రాజకీయాలు పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయనను ప్రశ్నించకుండా రాజకీయ విశ్లేషణ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి...

ఈ ‘యూటర్న్‌’ మంచిదే!

దేశ రాజకీయాలు పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయనను ప్రశ్నించకుండా రాజకీయ విశ్లేషణ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ‘తనదైన అనుభూతి తనది గాన, తలచిన రామునే తలచెద నేను’ అని కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అన్నట్లు మోదీని తలుచుకోకుండా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడలేం. ఈ దేశంలో గత కొన్నేళ్లుగా ఏ పరిణామం సంభవించినా, ఏ విధాన రూపకల్పన జరిగినా అందుకు తానే కారకుడినన్న పరిస్థితిని మోదీ కల్పించారనడంలో అతిశయోక్తి లేదు. గతంలో జాతీయ విద్యావిధానం గురించి చర్చకు వచ్చినప్పుడు నాడు మానవ వనరుల మంత్రిగా ఉన్న పీవీ నరసింహారావు పేరు ప్రస్తావనకు వచ్చేది. పీవీ హయాంలో ఆర్థిక సంస్కరణల గురించి చర్చించినప్పుడు మన్మోహన్ సింగ్ పేరు ప్రస్తావనకు రాకుండా ఆ పర్వం పూర్తి కాదని ఎవరికైనా తెలుసు. కాని ఇవాళ పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన నిర్ణయమైనా, జాతీయ విద్యావిధానమైనా, జాతీయ వాక్సిన్ విధానమైనా, సాగు చట్టాలైనా, ఆఖరుకు సిబిఎస్ఇ పరీక్షల రద్దు గురించి నిర్ణయమైనా నరేంద్ర మోదీ తప్ప మరెవరూ కనపడడం లేదు. అంతటా మోదీ ప్రత్యక్షం కావడంతో ఇవాళ ఈ దేశంలో కీలక మంత్రిత్వ శాఖలు ఎవరు నిర్వహిస్తున్నారన్నదానికి ప్రాధాన్యత లేకుండా పోయింది.


అయితే ప్రజాస్వామ్యంలో నాయకుడు అవసరమైన మోతాదు కంటే ఎక్కువగా ప్రత్యక్షమైతే, అన్ని నిర్ణయాలూ ఆయనే తీసుకుంటే అన్ని సమస్యలకూ కూడా తానే కారకుడు కాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు అశేష జనావళికి సర్వరోగ నివారిణిగా, కొందరికి దేవదూతగా కూడా కనపడిన నరేంద్రమోదీ గత కొద్ది రోజులుగా తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారనడంలో సందేహం లేదు. స్వాభావికంగా నరేంద్రమోదీకి ఏ రాహుల్ గాంధీ ట్వీట్లకో, ముఖ్యమంత్రుల లేఖలకో ప్రతిస్పందించి వెనుకడుగు వేసే తత్వం లేదు. ఆరు నెలలకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు తీవ్ర నిరసన చేస్తున్నా చలించని మోదీ ప్రతిపక్షాల చీపురుపుల్లలకు చలిస్తారని ఎవరూ భావించలేరు. కాని ఉన్నట్లుండి జాతీయ వాక్సిన్ విధానంపై పూర్తిగా యూ టర్న్ తీసుకుని దేశమంతా తాను ఉచితంగా వాక్సిన్ పంపిణీ చేస్తానని ప్రధానమంత్రి ప్రకటించేసరికి ఆయన విమర్శకులు కొంత ఆశ్చర్యపడక తప్పలేదు.


ఒకటా,రెండా, గత కొద్ది రోజులుగా మోదీ ఎన్ని ఎదురుగాలులు ఎదుర్కొన్నారని? కరోనా రెండో ప్రభంజనం ఒకవైపు, బెంగాల్ ఎన్నికల్లో పరాభవం మరో వైపు ఆయనను కుదిపివేశాయనడంలో అతిశయోక్తి లేదు. ఆక్సిజన్ లేక సంభవించిన వేలాది మరణాలు, శవాలు నిండిపోయిన ఆసుపత్రులు, శ్మశానాల చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల పతాక శీర్షికలు, కవర్ పేజీ కథనాల్లో భాగమయ్యాయి. నిజానికి వీటన్నిటికీ కేవలం మోదీయే పూర్తిగా కారణం కాకపోవచ్చు. అయితే మోదీ తాను సర్వశక్తిమంతుడినని, తానే కర్త, కర్మ, క్రియ అని భ్రమ కల్పించారు కదా.తత్ఫలితంగానే ఆ ఘోరాలకు కూడా మోదీయే కారకుడనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం, తీవ్ర నిరుద్యోగం, చమురు ధరలతో సహా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటడం, ప్రతిఘటనా స్వరాలు పెరగడం మోదీ వ్యతిరేక వాతావరణాన్ని తీవ్రతరం చేశాయి. పులిమీద పుట్రలా అన్నట్లు వాక్సిన్ విధానంపై సుప్రీం కోర్టు నిప్పులు చెరగడం, సంఘ్ పరివార్ పెద్దలు సైతం జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం, దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండడం మోదీని ఆత్మరక్షణలో పడవేశాయి. ఉత్తర ప్రదేశ్‌లో తన స్వంత నియోజకవర్గమైన వారణాసిలో కూడా స్థానిక ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత కనపడడం మోదీని పునరాలోచనలో పడేసి ఉంటుంది.


కాని ప్రజల వ్యతిరేకత, వేడి తగలడం ఒక ఎత్తు అయితే ఆ వేడిని పసిగట్టి ప్రభుత్వానికి రాజ్యాంగ బాధ్యతను గుర్తు చేయడానికి సుప్రీంకోర్టు నడుం కట్టడం మరో ఎత్తు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వి రమణ బాధ్యతలు చేపట్టాక వాక్సిన్ విధానం పై కోర్టు తనంతట తాను విచారణ చేపట్టడమే కాక జస్టిస్ వై.వీ చంద్రచూడ్ బెంచ్‌కు దాన్ని అప్పగించింది. కోర్టులు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకూడదని, కార్యనిర్వాహక శాఖ పరిధిలో తలదూర్చకూడదని గట్టిగా వాదించిన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి రాజ్యాంగ బాధ్యతలను సుప్రీంకోర్టు గుర్తు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోకూడదన్న మాట నిజమే కాని ప్రజల రాజ్యాంగ హక్కులకు, రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగితే కోర్టులు మౌన ప్రేక్షక పాత్ర వహించవని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం ఎమర్జెన్సీ తర్వాత దేశ ప్రజాస్వామిక చరిత్రలో జరిగిన ముఖ్యమైన పరిణామం. 


సుప్రీంకోర్టు ఇంత తీవ్రంగా స్పందిస్తుందని మోదీ ప్రభుత్వం తొలుత ఊహించినట్లు కనపడలేదు. లేకపోతే వాక్సిన్ ధరలను మార్కెట్ శక్తులే నిర్ణయించాలని ధైర్యంగా సర్కార్ తరపున న్యాయవాది వాదించేవారు కాదు. వాక్సిన్ పంపిణీలో అసమానతలు ఏర్పడతాయన్న విమర్శలు సరైనవి కావని, తమ వాక్సిన్ విధానం సవ్యమైనదని సమర్థించుకునేది కాదు.కాని సుప్రీంకోర్టు మోదీ ప్రభుత్వ వ్యాపార ధోరణిని పూర్తిగా ఎండగట్టింది. వాక్సిన్ ఉత్పత్తిదారులనుంచి వచ్చే సమస్యలను వివరించకుండా రాష్ట్రాలే వాక్సిన్‌ను కొనుక్కోవాలని, గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాలని వదిలివేయడం వెనుక దురుద్దేశాన్ని బహిర్గతం చేసింది. 18–44 సంవత్సరాల మధ్య వయస్సు వారికి ఇచ్చేందుకు వాక్సిన్ లేకపోవడంతో అనేక కేంద్రాలు మూతపడినా వాక్సిన్ కార్యక్రమం అద్భుతంగా జరుగుతున్నట్లు నమ్మించేందుకు జరిగిన బూటకపు యత్నాలను ప్రశ్నించింది. ప్రైవేట్ రంగానికి చెందిన బడా సంస్థలు అత్యధిక వాక్సిన్ సరఫరాను చేజిక్కించుకుంటున్నాయని వచ్చిన విమర్శలను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం, వాక్సిన్ కొరత ఏర్పడడంతో అనేక వాక్సిన్ కేంద్రాలు మూతపడడం వెనుక కారణాలను ఆరా తీసింది. డోసుకు రూ. 150కి ఇచ్చి 50 శాతం వాక్సిన్ లను కొనుకున్న కేంద్రం అదే సౌకర్యం రాష్ట్రాలకు ఎందుకు కల్పించలేదు? 18–44 సంవత్సరాల మధ్య వయస్సు గలవారికి వాక్సిన్ అనుమతిస్తే భారీ ఎత్తున డిమాండ్ పెరుగుతుందని తెలిసినప్పటికీ కేంద్రం ఆ డిమాండ్ భారాన్ని రాష్ట్టాలపై ఎందుకు మోపారు? రాష్ట్రాల పట్ల వివక్ష పాటించేందుకు, యూరోపియన్ యూనియన్, అమెరికాలో కంటే ఎక్కువ ధరలకు వాక్సిన్ ను అమ్ముకునేందుకు ప్రైవేట్ కంపెనీలను ఎందుకు అనుమతించారు? ప్రజలు వేల సంఖ్యలో చనిపోతుండగా, వారి ప్రాణాలతో వ్యాపారం చేసి లాభాలు గడించేందుకు ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు తోడ్పడ్డారు? అధిక ధరలకు పేదలు,బహుజనులు టీకాలను ఎలా తీసుకోగలుగుతారు? కేంద్రం తన కోటాకు చెల్లించిన ధరలకే రాష్ట్రాలు,ప్రైవేట్ ఆసుపత్రులు కొనుగోలు చేసేందుకు ఎందుకు వీలు కల్పించలేదు? ప్రైవేట్ అసుపత్రులు పెద్ద సంఖ్యలో టీకాలను పట్టణాల్లో అమ్ముకోగలిగినప్పుడు గ్రామీణ ప్రాంతాలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అన్న ప్రశ్నల పరంపరలు సుప్రీం విచారణ సందర్భంగా చర్చలోకి వచ్చాయి. అసలు బడ్జెట్ లో కేటాయించిన రూ. 35వేల కోట్ల లెక్క చెప్పండి అని కోర్టు అడిగేదాక వచ్చింది.


దేశం అంటే రాష్ట్రాల సమాఖ్య అని, ఆ విషయం గుర్తించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం రాజ్యాంగ అరాచకం కాదా అని ఇటీవలి కాలంలో ప్రభుత్వాన్ని ఏ న్యాయమూర్తీ ప్రశ్నించలేదు. కాని ఆ పని జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ చేసింది. రాజ్యాంగంలోని అధికరణలు 14, 21 క్రింద ప్రసాదించిన సమానత్వ హక్కు, జీవించే హక్కులను ఉల్లంఘించినట్లవుతుందని తెలిపింది. నిజానికి కోర్టు వేసిన ప్రశ్నలు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు వేయాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వాధినేతలు పలువురు తమ వ్యక్తిగత ప్రయోజనాలకోసం మోదీని ప్రశ్నించలేక భీరువుల్లా వ్యవహరిస్తున్నారు.ప్రజలనుంచి వ్యతిరేకత వెల్లువెత్తడంతో పాటు సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు వేసినందుకే మోదీ తన స్వభావానికి భిన్నంగా రెండునెలల క్రితం ప్రకటించిన వాక్సిన్ విధానాన్ని ఆయన వెనక్కు తీసుకుని దేశమంతా కేంద్రమే ఉచితంగా వాక్సిన్ అందిస్తుందని ప్రకటించారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా డోసుకు రూ.150కి మించి చార్జి చేయకూడదని ఆంక్షలు విధించారు. ముందే భారత రాజ్యాంగాన్ని, అందులో పేర్కొన్న సమాఖ్య స్ఫూర్తిని, ప్రజల హక్కులను స్ఫురణకు తీసుకుని ఉంటే మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా, వ్యవహరించి ఉండేది కాదు. కాని అలా చేయాలంటే ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన చర్చలు, సంప్రదింపులకు ఆస్కారం కలిగించాలి. దేశానికి సంబంధించిన ఎటువంటి కీలక నిర్ణయమైనా కేబినెట్ లోనూ, పార్టీలోనూ, పార్లమెంట్ లోనూ, ముఖ్యమంత్రులతోను చర్చించిన తర్వాతే తీసుకోగలగాలి. మోదీ ‘యూ టర్న్’ ఇక్కడితో ఆగకూడదు. పార్లమెంట్‌లో పెద్దగా చర్చ లేకుండా, స్థాయీసంఘాలకు నివేదించకుండా చేసిన సాగు చట్టాలు, ఇతర కీలక చట్టాల విషయంలో కూడా ఆయన పునరాలోచన చేయాలి. ప్రతిపక్ష నేతలను, ఇతర ప్రత్యర్థులను వేధించడం ద్వారా, ప్రలోభపెట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలన్న ఆలోచనను మార్చుకోవాలి. ఒక భయకంపిత వాతావరణానికి స్వస్తి చెప్పాలి. నిజానికి ఈ దేశంలో మెజారిటీ ప్రజలు రెండు సార్లు మోదీని ఎన్నుకున్నారు. కనుక ఆరోగ్యకరమైన, ప్రజాస్వామ్యయుతమైన వాతావరణాన్ని ఏర్పర్చేందుకు మోదీకే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇప్పటివరకూ అవలంబించిన అనేక విధానాలనుంచి మోదీ ‘యూ టర్న్’ తీసుకోకపోతే ఆయనకు ఓటు వేసిన ప్రజలే ‘యూ టర్న్’ తీసుకునే అవకాశం ఉంది. అందుకు తగిన వాతావరణం క్రమంగా ఏర్పడుతోంది.


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Updated Date - 2021-06-09T06:55:16+05:30 IST