ఈ ఏడాదే ఐపీఎల్‌!

ABN , First Publish Date - 2020-06-12T09:18:00+05:30 IST

ఎట్టకేలకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నిర్వహణపై కదలిక కనిపిస్తోంది. కరోనా మహమ్మారితో ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వస్తున్న...

ఈ ఏడాదే ఐపీఎల్‌!

 టీ20 ప్రపంచకప్‌ నిర్వహణపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఎటూ తేల్చకపోవడంతో, ఇక బీసీసీఐ.. ఐపీఎల్‌పై కసరత్తు ఆరంభించింది. కచ్చితంగా ఈ ఏడాది లీగ్‌ను జరుపుతామన్న విశ్వాసంతో ఉంది. దీనికి తగ్గట్టుగానే అధ్యక్షుడు గంగూలీ కూడా తమ కార్యాచరణను ప్రారంభిస్తున్నట్టు చెప్పాడు. అంతేకాకుండా ఖాళీ స్టేడియాల్లోనైనా ఆడించేందుకు సిద్ధమేనని స్పష్టం చేశాడు. దీంతో మరోసారి క్రికెట్‌ అభిమానుల్లో ఐపీఎల్‌పై ఆశలు చిగురిస్తున్నాయి..

అన్ని అంశాలూ పరిశీలిస్తున్నాం

అవసరమైతే ఖాళీ స్టేడియాల్లోనే.. 

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ

న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) నిర్వహణపై కదలిక కనిపిస్తోంది. కరోనా మహమ్మారితో ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వస్తున్న ఈ మెగా లీగ్‌ ప్రయత్నాలను బోర్డు వేగవంతం చేసింది. అటు టీ20 ప్రపంచకప్‌ నిర్వహణపై ఐసీసీ తాత్సారం చేస్తోంది. బుధవారం ఈ వ్యవహారంపై స్పష్టత వస్తుందనుకున్నా రెండోసారీ నిరాశే ఎదురైంది. వచ్చే నెలలో తు ది నిర్ణయం కోసం ఐసీసీ బోర్డు మరోసారి సమావేశం కానుంది. దీంతో పొట్టి వరల్డ్‌క్‌పతో సంబంధం లేకుండా ముందుకెళ్లాలని దాదా భావిస్తున్నాడు. అవసరమైతే ప్రేక్షకులు లేకుండానే లీగ్‌ను కొనసాగించేందుకు వెనుకాడబోమని చెప్పాడు. ఈ నేపథ్యంలో గంగూలీ ఆయా రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు ఈ-మెయిల్స్‌ పంపాడు. ‘ఈ ఏడాది ఐపీఎల్‌ జరిపేందుకు అన్ని అవకాశాలను బీసీసీఐ పరిశీలిస్తోంది. అభిమానులు, ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు, బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సర్స్‌ ఇలా అందరూ లీగ్‌ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తప్పదనుకుంటే ఖాళీ స్టేడియాల్లోనైనా మ్యాచ్‌లను నిర్వహిస్తాం. అటు విదేశీ ఆటగాళ్లు కూడా ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు. మేం కూడా నిర్వహణపై ఆశాభావంతోనే ఉన్నాం. రాబోయే రెండు వారాల్లో భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తాం’ అని గంగూలీ తెలిపాడు. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 29 నుంచి జరగాల్సిన లీగ్‌ కరోనాతో ఏప్రిల్‌ 15కు వాయిదా పడినా ఆ తర్వాత కూడా పరిస్థితులు అనుకూలించలేదు. కాసుల పంట పండించే ఈ లీగ్‌ ఒకవేళ రద్దయితే బోర్డుకు కనీసం రూ.4 వేల కోట్ల నష్టం వస్తుంది.

దేశవాళీ పోటీలపై..: వచ్చే సీజన్‌ నుంచి దేశవాళీ క్రికెట్‌ను ఆరంభించేందుకు కూడా బీసీసీఐ సుముఖంగా ఉంది. కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు  స్టాండర్డ్‌ ఆపరేషన్స్‌ ప్రొసీజర్స్‌ (ఎస్‌ఓపీ) పేరిట అన్ని రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు బోర్డు గైడ్‌లైన్స్‌ పంపించనుంది. దీన్ని అనుసరించి ఆయా రాష్ట్రాల్లో క్రికెట్‌ కార్యకలాపాలు ఆరంభమవుతాయని గంగూలీ పేర్కొన్నాడు.

పూర్తి స్థాయి లీగ్‌ కావాలి: కేకేఆర్‌ సీఈవో

ఐపీఎల్‌ను హడావిడిగా జరిపితే అంగీకరించేది లేదని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పష్టం చేసింది. ‘ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో కోతతో పాటు స్వదేశీ ఆటగాళ్లతోనే ఆడించే ఆలోచన మానుకోవాలి. ఈ లీగ్‌లో విదేశీ క్రికెటర్లు కూడా కీలక పాత్ర పోషిస్తారనే విషయం మర్చిపోరాదు’ అని కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్‌ గుర్తుచేశాడు.


సెప్టెంబరు-అక్టోబరులో అవకాశం..

ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో ఐపీఎల్‌-13వ సీజన్‌ జరిగే అవకాశం ఉందని లీగ్‌ పాలకమండలి చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ తెలిపాడు. అయితే అంతకన్నా ముందు టీ20 ప్రపంచక్‌పపై ఐసీసీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నాడు. ‘ఐసీసీ అధికారిక ప్రకటన తర్వాత మేం ఐపీఎల్‌ షెడ్యూల్‌పై చర్చిస్తాం. మేమైతే సెప్టెంబరు-అక్టోబరు విండోను సిద్ధంగా ఉంచాం. అయితే సెప్టెంబరులో వర్షాలతో ఇబ్బంది ఉంటుంది కాబట్టి వేదికల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ లీగ్‌ను విదేశాలకు తరలించాల్సి వస్తే అందుకూ సిద్ధమే. అయితే ఎక్కడ జరిగినా మ్యాచ్‌లు మాత్రం రెండు, మూడు స్టేడియాలకే  పరిమితమవుతాయి’ అని పటేల్‌ వివరించాడు.

Updated Date - 2020-06-12T09:18:00+05:30 IST