క్రికెట్‌కు తిసారా పెరీరా గుడ్‌బై

ABN , First Publish Date - 2021-05-04T01:49:57+05:30 IST

శ్రీలంక క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ తిషారా పెరీరా అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు..

క్రికెట్‌కు తిసారా పెరీరా గుడ్‌బై

కొలంబో: శ్రీలంక క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ తిషారా పెరీరా అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డుకు కూడా తెలియజేశానని, తన రిటైర్మెంట్‌కు సంబంధించి లేఖ ద్వారా తెలియజేశానని అన్నాడు. ఇన్నేళ్లపాటు జాతీయ జట్టుకు ఆడడం గౌరవంగా భావిస్తున్నానని, ఇన్నేళ్ల ఆటలో ఎన్నో గొప్ప జ్ఞాపకాలు తనకు మిగిలాయని పెరీరా చెప్పుకొచ్చాడు. 'శ్రీలంకకు నేను ప్రాతినిథ్యం వహించడాన్ని గొప్పగా భావిస్తున్నాను. ఓవరాల్‌గా 7 క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో శ్రీలంక తరఫున ఆడాను. 2014లో టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడిగా ఉన్నాను. ఇది నా జీవితంలో ఒక గొప్ప ఘనత' అని ఎస్‌ఎల్‌సీకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. 


పెరీరా తొలిసారి 2009లో టీమిండియాతో జరిగిన వన్డే మ్యాచ్‌తో జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. అలాగే టీ20ల్లో 2010లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో తొలిసారిగా బరిలోకి దిగగా.. అన్నిటికంటే ఆలస్యంగా టెస్టుల్లో 2011లో ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్ ఆడాడు. కానీ టెస్టుల్లో పెరీరా అంతగా రాణించలేకపోయాడు. కెరీర్ మొత్తంలో 6 టెస్టులు మాత్రమే పెరీరా ఆడాడంటే అతడి టెస్ట్ కెరీర్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం 166 వన్డేలు, 84 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. 


అయితే ఇక తిసారా పెరీరా శ్రీలంకకు ఆటగాళ్లలోని మేటి ఆల్ రౌండర్ అని చెప్పాలి. వన్డే ఫార్మాట్‌లో 2,338 పరుగులు చేసిన పెరీరా.. 175 వికెట్లు కూడా సాధించాడు. అలాగే టీ20ల్లో 1204 పరుగులు చేసి 51 వికెట్లు పడగొట్టాడు. 

Updated Date - 2021-05-04T01:49:57+05:30 IST