‘భారతి సిమెంట్స్‌’ డైరెక్టర్‌వి అక్రమాస్తులే!

ABN , First Publish Date - 2021-04-21T10:01:27+05:30 IST

ఏపీ సీఎం జగన్‌ సన్నిహితుడు, భారతి సిమెంట్స్‌ డైరెక్టర్‌ జెల్లా జగన్మోహన్‌రెడ్డికి సంబంధించి.. జప్తుచేసిన ఆస్తులను రిలీజ్‌ చేయాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలపై ఈడీ దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌లో వాదనలు ముగిశాయి.

‘భారతి సిమెంట్స్‌’  డైరెక్టర్‌వి అక్రమాస్తులే!

  • -జప్తు చేసిన వాటిని రిలీజ్‌ చేయొద్దు
  • -జెల్లా జగన్మోహన్‌రెడ్డి ఆస్తులపై ఈడీ వాదనలు
  • -తీర్పును రిజర్వ్‌ చేసిన తెలంగాణ హైకోర్టు 


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం జగన్‌ సన్నిహితుడు, భారతి సిమెంట్స్‌ డైరెక్టర్‌ జెల్లా జగన్మోహన్‌రెడ్డికి సంబంధించి.. జప్తుచేసిన ఆస్తులను రిలీజ్‌ చేయాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలపై ఈడీ దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌లో వాదనలు ముగిశాయి. జెల్లా జగన్మోహన్‌రెడ్డికి చెందిన ల్యాంకో హిల్స్‌లోని ఫ్లాట్‌, కడప జిల్లా కోడూరు మండలంలోని 27 ఎకరాల ఆస్తులను ఈడీ జప్తుచేసింది. ఈడీ చర్యలపై జెల్లా ఢిల్లీలోని ఈడీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిని విచారించిన ట్రైబ్యునల్‌ భారతి సిమెంట్స్‌ చెందిన రూ.150 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను హామీగా పెట్టుకుని జప్తుచేసిన ఆస్తులను రిలీజ్‌ చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాలపై ఈడీ తెలంగాణ హైకోర్టులో అప్పీల్‌ చేసింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ. రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం మరోసారి విచారించింది.


ఈడీ తరఫున అదనపు సోలిసిటర్‌ జనరల్‌ టి. సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు. అక్రమాస్తుల కేసుల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న ఏపీ సీఎం జగన్‌కి పిటిషనర్‌ సన్నిహితుడని, పలు కంపెనీల్లో డైరెక్టర్‌గా వ్యవహరించారని తెలిపారు. భారతి సిమెంట్స్‌లో పిటిషనర్‌కు 2వేల షేర్లు ఉండగా మరో 8వేల షేర్లను రూ.10 చొప్పున కొనుగోలు చేశారన్నారు. అనంతరం, వాటిని రూ.661.12 చొప్పున ఒక ఫ్రెంచ్‌ కంపెనీకి విక్రయించారన్నారు. 2009 నుంచి 2015 వరకు వేతనాల రూపంలో రూ.7.19 కోట్లు పొందినట్లు తెలిపారు. ఇవన్నీ అక్రమమార్గంలో పొందిన ఆస్తులేనని వివరించారు. పిటిషనర్‌ జెల్లా తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వేతనం ద్వారా ఆర్జించిన సొమ్మును నేరపూరితమైనదిగా చెప్పడం సరికాదన్నారు. పిటిషనర్‌ కొనుగోలు చేసిన ఫ్లాటుకు ఇప్పటికీ బ్యాంకు వాయిదాలు చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ ఫ్లాటుకు ఈడీ నెలకు రూ.25 వేలు అద్దె చెల్లించాలని డిమాండ్‌ చేయడం సరికాదన్నారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు సదరు ఆస్తుల జోలికి పోబోమని, వాటిని రిలీజ్‌ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యాల్లో ఇరుపక్షాల వాదనలు విన్న డివిజన్‌ బెంచ్‌ తీర్పును రిజర్వ్‌ వేసింది. 

Updated Date - 2021-04-21T10:01:27+05:30 IST