ఆ కల్యాణ వైభోగ చిహ్నాలే...భోగీ, సంక్రాంతి!

ABN , First Publish Date - 2021-01-08T06:01:23+05:30 IST

శ్రీరంగనాథుడిని వివాహం చేసుకోవాలన్న కోరికతో నెలరోజులు శ్రీ (ధనుర్మాస) వ్రతాన్ని గోదాదేవి ఆచరించింది.

ఆ కల్యాణ వైభోగ చిహ్నాలే...భోగీ, సంక్రాంతి!

‘అచంచలమైన భక్తి, విశ్వాసాలతో చేసే ఆరాధనే పరమాత్మను చేరుకొనే పరమపథం’ అని నిరూపించిన మహా భక్తురాలు ఆండాళ్‌. ఆమె అచంచల చిత్తంతో నెలరోజులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి, రోజుకో పాశురాన్ని కూర్చి...  ముప్ఫై పాశురాలను మాలగా కట్టి శ్రీరంగనాథుడి గళసీమలో అలంకరించింది. ఆ స్వామిలో ఐక్యమై, దివ్య మూర్తిగా పూజలందుకుంటోంది. ధనుర్మాసం చివరిరోజున, భోగీ పండుగ నాడు నిర్వహించే గోదా-రంగనాథుల కల్యాణ ఘట్టం గోదాదేవి అపూర్వమైన భక్తి ప్రపత్తులకూ, వాటి ద్వారా ఆమె నెరవేర్చుకున్న ఆశయానికీ చిహ్నం.


శ్రీరంగనాథుడిని వివాహం చేసుకోవాలన్న కోరికతో నెలరోజులు శ్రీ (ధనుర్మాస) వ్రతాన్ని గోదాదేవి ఆచరించింది. తమిళనాడులోని విల్లిపుత్తూరును శ్రీకృష్ణుడు ఆడిపాడిన వ్రేపల్లెగా సంభావించుకుంది. తన స్నేహితురాళ్ళను గోపికలుగా భావించి మేలుకొలుపుతూ... వ్రతానికి రారమ్మని పిలుస్తూ, రోజుకో పాశురాన్ని ఆలపిస్తూ నెలరోజుల పాటు వ్రతాన్ని సాగించింది.


ఆ ధనుర్మాసం చివరిలో, వ్రత పరిసమాప్తి దగ్గరవుతూండగా... శ్రీరంగ క్షేత్రానికి వచ్చి, తనకూ, గోదాదేవికీ వివాహం జరిపించాల్సిందిగా ఆమె తండ్రి విష్ణుచిత్తుణ్ణి శ్రీరంగనాథుడు ఆజ్ఞాపించాడు. స్వామి ఆదేశం మేరకు... గోదాదేవిని నవ వధువుగా అలంకరించి, బంధుమిత్రాదులు వెంటరాగా,  ముత్యాల పల్లకిలో ఆమెను శ్రీరంగానికి విష్ణుచిత్తుడు తీసుకువచ్చాడు.


మరోవైపు సకల దేవతలూ శ్రీరంగనాథుడి చెంతకు తమతమ వాహనాలతో తరలివచ్చారు. విష్ణుచిత్తుడు షోడశోపచారాలతో గోదాదేవిని శ్రీరంగనాథుడికి కన్యాదానం చేశాడు. బ్రహ్మాది దేవతలు ఆ దంపతులను ఆశీర్వదించారు. ఈ వైవాహిక ఘట్టం పూర్తయిన తరువాత... శ్రీరంగనాథుడిలో గోదాదేవి ఐక్యమయింది. ఇది పరమాత్మలో జీవాత్మ లీనమైన అపూర్వమైన ఘట్టం. భోగాలన్నిటిలో అత్యున్నతమైనది... భగవంతుడి అనుగ్రహం.


అలాంటి అనుగ్రహాన్ని గోదాదేవి పొందిన ఆ రోజు ‘భోగీ పండుగ’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ మరునాడే మకర సంక్రమణం. మహా పర్వదినం. ‘మోక్షం’ అనే క్రాంతి జీవాత్మకు సంప్రాప్తమైంది కాబట్టి అది సంక్రాంతి. ధనుర్మాసం ముప్ఫై రోజులూ గోదాదేవికి గోవులు సహకరించాయి. కాబట్టి వాటికి కృతజ్ఞతగా... ఆ తదుపరి రోజును కనుమగా... పశువుల పండుగగా జరుపుకోవడం అత్యున్నతమైన ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తోంది. గోదాదేవి ఆలపించిన పాశురాలే ‘తిరుప్పావె’ౖగా ప్రసిద్ధి చెందాయి. 




గోదాదేవి ఆండాళ్‌ ఎలా అయింది?

విష్ణుచిత్తుడు తనకు పూలవనంలో దొరికిన పాపకు ‘కోదై’ (పూమాల) అని నామకరణం చేశాడు. ‘కోదై’ క్రమేణా ‘గోదా’గా వాడుకలోకి వచ్చింది. మరి ఆమెకు ‘ఆండాళ్‌’ అనే పేరు ఎలా వచ్చింది? దీని వెనుక ఒక కథ ఉంది. పెరుమాళ్‌కు (భగవంతుడికి) సమర్పించడానికి అల్లిన తిరుమాలికలను ఆమె తన కురుల్లో ముడుచుకోవడం ఒక రోజు విష్ణుచిత్తుడి కంట పడింది. అది అపచారంగా భావించిన ఆయన ఆ రోజు దేవుడికి పూలమాల సమర్పించలేదు.


ఆ రాత్రి విష్ణుచిత్తుడి కలలో స్వామి కనిపించి, గోదా తన తలలో ముడిచి ఇచ్చిన పుల దండలే తనకు ప్రీతిపాత్రమైనవని చెబుతాడు. అప్పుడు విష్ణుచిత్తుడు తన కుమార్తె గొప్పతనాన్ని గ్రహించి పులకించిపోతూ... ‘ఎన్నె ఆండాళ్‌’... ‘ఎన్నె ఆండాళ్‌’ అంటూ ప్రశంసించాడు. అంటే ‘నన్నేలిన తల్లీ! నన్నేలిన తల్లీ!’ అని అర్థం. అప్పటి నుంచి ఆమెకు ‘ఆండాళ్‌’ అనే పేరు స్థిరపడింది.


కరమున చిలుక...

ఆండాళ్‌ చిత్రాన్ని పరిశీలిస్తే... ఆమె చేతిలో ఒక చిలుక ఉంది. ఆ చిలుక కథ ఏమిటంటే... ఆండాళ్‌ రచించిన కృతుల్లో ‘నాచ్చియార్‌ తిరుమొళి’ ఒకటి. అందులో, శ్రీరంగనాథుడి తన ప్రేమ సందేశాన్ని కోకిలతో ఆండాళ్‌ పంపిస్తుంది. తన చిలుకను చెలికాడైన స్వామికి బహూకరిస్తానని మాట ఇస్తుంది. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకోవడానికి ఆండాళ్‌ ఎడమ చేతిపై ఒక చిలుక ఉంచుతారు.


శ్రీరంగనాథుని దేవేరి అయిన ఆండాళ్‌ చేతిపై ఉంచే ఈ చిలుకను ఒక కుటుంబం వారు ప్రత్యేకంగా... కొన్ని తరాలుగా చేస్తున్నారు. ప్రతిరోజూ ఓ చిలుకను ఆమె చేతిపై అలంకరిస్తారు. ఆ చిలుకను మరుసటిరోజు భక్తులకు ఇస్తారు. ఆ చిలుక దొరకడం పరమానుగ్రహంగా భక్తులు భావిస్తారు.


భోగాలన్నిటిలో అత్యున్నతమైనది... భగవంతుడి అనుగ్రహం. అలాంటి అనుగ్రహాన్ని గోదాదేవి పొందిన ఆ రోజు ‘భోగీ పండుగ’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ మరునాడే మకర సంక్రమణం. మహా పర్వదినం. ‘మోక్షం’ అనే క్రాంతి జీవాత్మకు సంప్రాప్తమైంది కాబట్టి అది సంక్రాంతి. 

 ఆచార్య శ్రీవత్స

Updated Date - 2021-01-08T06:01:23+05:30 IST