Abn logo
Jan 14 2021 @ 12:38PM

ఆ నలుగురు ఎక్కడెక్కడివారో, కానీ పేర్లు ఒకటే, అందరూ కలిసికట్టుగా...

న్యూఢిల్లీ : ఒకర్ని పోలిన వ్యక్తులు మరికొందరు అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటారు. అయితే పేర్లు, ఆసక్తులు సమానంగా ఉన్నవాళ్ళు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన లక్షణాలు ఉన్న నలుగురు కలిసికట్టుగా మ్యూజిక్ బ్యాండ్ ఏర్పాటు చేశారు. వీరంతా వేర్వేరు దేశాలకు చెందినవారు. బాల్టిమోర్‌కు చెందిన మ్యుజీషియన్ పాల్ ఓ’సులివన్ మదిలో మెదిలిన వినూత్న ఆలోచన వినోదాన్ని పంచే సంగీత బృందాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. 


బాల్టిమోర్‌కు చెందిన పాల్ ఓ’సులివన్ అదే పేరు, చివరి పేరు, తనతో సమానమైన ఆసక్తిగల మరో ముగ్గుర్ని ఒకచోటకు చేర్చడంలో విజయవంతమయ్యారు. అంతేకాదు ఈ నలుగురు కలిసి విడుదల చేసిన తొలి సింగిల్ ట్రాక్ బ్రహ్మాండమైన విజయం సాధించింది. పాల్ ఓ’సులివన్ మీడియాతో మాట్లాడుతూ, ఇదంతా చాలా సరదాగా జరిగిందన్నారు. ఓ రోజు తాను తన ఫేస్‌బుక్ ఫ్రెండ్ లిస్ట్‌లో అందరూ పాల్ ఓ’సులివన్లను చేర్చానని చెప్పారు. ఆ తర్వాత చాలా మంది పాల్ ఓ’సులివన్లు తన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశారన్నారు. వీరిలో కొందరు మ్యుజీషియన్లని తనకు తెలిసిందన్నారు. దీంతో వేర్వేరు దేశాల్లో ఉన్న పాల్ ఓ’సులివన్లతో సంప్రదించానని చెప్పారు. వీరిలో ముగ్గురు తనతోపాటు మ్యూజికల్ బ్యాండ్‌ను ఏర్పాటు చేయడానికి అంగీకరించారని చెప్పారు. తమ బ్యాండ్‌కు పాల్ ఓ’సులివన్ బ్యాండ్ అని పేరు పెట్టామన్నారు. విజయవంతంగా బ్యాండ్‌ను నడుపుతున్నామని హర్షం వ్యక్తం చేశారు. బ్రిటన్‌లోని మాంఛెస్టర్, అమెరికాలోని పెన్సిల్వేనియా, బాల్టిమోర్, నెదర్లాండ్స్‌లోని రొట్టెర్‌డామ్‌లకు చెందిన పాల్ ఓ’సులివన్లు విడుదల చేసిన తొలి ట్రాక్‌కు జనాదరణ లభించిందన్నారు. 

 


Advertisement
Advertisement