Abn logo
Sep 22 2021 @ 15:23PM

జమ్మూ కశ్మీర్ ప్రయోగశాలనా? ముఫ్తీ ఫైర్

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ విషయంలో కేంద్ర అవలంబిస్తున్న వైఖరిపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్ ఏమైనా ప్రయోగశాల అనుకుంటున్నారా అంటూ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గతంలో పని చేసిన ప్రధానమంత్రులు దేశాన్ని ఏకం చేయడం కోసం పని చేస్తే ప్రధాని మోదీ దేశాన్ని విభజించే విధంగా పాలిస్తున్నారని ఆమె విమర్శించారు.


బుధవారం శ్రీనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఫ్తీ మాట్లాడుతూ ‘‘జమ్మూ కశ్మీర్ వారికి ప్రయోగశాలలా మారింది. వారి కుటిల రాజకీయ ప్రయోగాలన్నీ ఇక్కడే చేస్తున్నారు. జవహార్‌లాల్ నెహ్రూ, అటల్ బిహారి వాజ్‌పేయి లాంటి ప్రధానమంత్రులు జమ్మూ కశ్మీర్‌ కోసం ఎంతో పని చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఇక్కడి ప్రజల్ని హిందూ, ముస్లింల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రాన్ని విడదీస్తోంది. వీళ్ల ఈ దేశ జనాభాను కొన్ని పేర్లతో విడదీస్తున్నారు. విధ్వేషం చూపుతున్నారు. ముస్లింలు అయితే పాకిస్తానీ, సిక్కులు అయితే ఖలిస్తానీలు అని ముద్ర వేస్తున్నారు. ఆ పార్టీ వాళ్లు మాత్రమే హిందుస్తానీలు అని చెప్పుకుంటున్నారు. ఈ దేశం అందరిదీ. మేమూ భారతీయులమే’’ అని అన్నారు.