ఆ భూములు మా ప్రాణం

ABN , First Publish Date - 2020-07-11T09:29:16+05:30 IST

‘వంశపారంపర్యంగా సంక్రమించిన భూములవి, వాటినే నమ్ముకుని జీవిస్తున్నాం, మా భూములే మాకు ప్రాణం, గ్రీన్‌ఫీల్డ్‌ అలైన్‌మెంట్‌ను మార్చండి’ అంటూ రైతులు కన్నీటి

ఆ భూములు మా ప్రాణం

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకు ఇచ్చేదిలేదు 

అలైన్‌మెంట్‌ మార్చండి 

హైవే భూసేకరణ సమావేశంలో రైతుల ఆవేదన


ఖమ్మం కలెక్టరేట్‌/ సత్తుపల్లి/వేంసూరు/వైరా, జూలై 10: ‘వంశపారంపర్యంగా సంక్రమించిన భూములవి, వాటినే నమ్ముకుని జీవిస్తున్నాం, మా భూములే మాకు ప్రాణం, గ్రీన్‌ఫీల్డ్‌ అలైన్‌మెంట్‌ను మార్చండి’  అంటూ  రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. జాతీయ రహదారి కోసం తమ భూములను ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. శుక్రవారం ఖమ్మంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణ కోసం చింతకాని మండలం బస్వాపురం, రెవెన్యూ పరిధిలోని రాఘవాపురం, బస్వాపురం, రామకృష్ణాపురం, అల్లీపురం గ్రామస్థులతో జిల్లా అదనపు కలెక్టర్‌ ఎన్‌.మధుసూదన్‌, జాతీయ రహదారి అధికారి జానకిరాం, ఆర్డీవో రవీంద్రనాథ్‌ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఖమ్మం నుంచి దేవరపల్లికి 90 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రభుత్వం భూమిని సేకరించాలని నిర్ణయించిందని, ఈ నేపథ్యంలో ఖమ్మం రూరల్‌ మండలం తల్లంపాడు నుంచి పెనుబల్లి మండలం వరకు 12 మండలాల్లో 54 గ్రామాలకు చెందిన 1,114 మంది రైతుల నుంచి భూమిని సేకరించాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు వివరించారు. అయితే ఆయా గ్రామాల రైతులు రహదారికి తమ విలువైన భూములను ఇచ్చేది లేదన్నారు.


అదనపు కలెక్టర్‌ ఎన్‌ మధుసూదన్‌ మాట్లాడుతూ భూసేకరణ కోసం నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇచ్చేందుకు  కలెక్టర్‌ ఆధ్వర్యంలో యంత్రాంగం కృషిచేస్తుందన్నారు. జాతీయ రహదారి అధికారి  జానకీ రామ్‌ మాట్లాడుతూ రహదారికి మూడు ప్రతిపాదనలు పంపగా, ప్రస్తుతం సర్వే  చేయాలనుకుంటున్న అలైన్‌మెంట్‌ను ఖరారు ఖరారయిందన్నారు. రైతుల పక్షాన నిర్వాసిత రైతు దొబ్బల వెంగళరావు  మాట్లాడుతూ రైతులు కోల్పోతున్న భూమికి బదులుగా భూమిని ఇవ్వాలని, లేకుంటే కొత్త కలెక్టరేట్‌కు సేకరించిన భూమికి ఇచ్చిన పరిహారం మాదిరిగా ఎకరానికి రూ.కోటి చొప్పున ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు తిరుమలాచార్యులు, భూసేకరణ విభాగం డీటీ రంజిత్‌కుమార్‌, వహీద్‌ తదితరులు పాల్గొన్నారు. 


హైవేకోసం 1,101ఎకరాల భూసేకరణ సర్వే

గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి కోసం నియోజకవర్గంలో 1101ఎకరాల భూసేకరణ సర్వే చేస్తున్నట్లు కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ తెలిపారు. శుక్రవారం వేంసూరు, సత్తుపల్లి మండలాల్లో రెవెన్యూ, ఎన్‌హెచ్‌, సింగరేణి ఆధ్వర్యంలో జాయింట్‌ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వేంసూరు మండలంలోని లింగపాలెం, సత్తుపల్లి మండలంలోని సదాశివునిపేట, తుంబూరు గ్రామాల్లో అధికారులు సర్వే నిర్వహించి హద్దులు గుర్తించి జెండా కర్రలు పాతారు. మొత్తం 56.2కిలోమీటర్ల రహదారికోసం 60మీటర్ల చొప్పున రహదారిని గుర్తించగా రైతుల సమక్షంలో సర్వే చేపట్టారు.


మార్కెట్‌ ధర చెల్లించాలి

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే భూనిర్వాసితులకు ప్రభుత్వం నూతన కలెక్టర్‌ భూసేకరణ ధరలో మాదిరిగా సగం ధరనైనా నష్టపరిహారాన్ని చెల్లించాలని అందుకు జిల్లా మంత్రి పువ్వాడ జోక్యం చేసుకోవాలని రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు విజ్ఞప్తి చేశారు. మండలంలోని సోమవరం, గండగలపాడు, సిరిపురంగ్రామాల్లో గ్రీన్‌ఫీల్డ్‌హైవే రోడ్డు నిర్మాణంలో కోల్పోతున్న భూములను బాధిత రైతులతోకలిసి శుక్రవారం రాంబాబు పరిశీలించారు.  

Updated Date - 2020-07-11T09:29:16+05:30 IST