గొంతు నొక్కుతున్నారనేవాళ్లంతా గట్టిగా మాట్లాడేవాళ్లే : కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2021-12-05T01:31:27+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం

గొంతు నొక్కుతున్నారనేవాళ్లంతా గట్టిగా మాట్లాడేవాళ్లే : కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విమర్శకుల నోళ్ళు మూయిస్తోందని వస్తున్న ఆరోపణలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. అత్యధికంగా, చాలా గట్టిగా మాట్లాడేవాళ్లే  వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉల్లంఘన జరుగుతోందని ఎక్కువగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన శనివారం మాట్లాడారు. 


భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో వినిపించే నినాదాలు, ప్రభుత్వం అసమ్మతి గళాలను అణచివేస్తోందనే ఆరోణలు, ప్రతిపక్షాల అభిప్రాయాన్ని ప్రభుత్వం వినడం లేదనే ఆరోపణలు... ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, అత్యధికంగా, గట్టిగా మాట్లాడేవారి నుంచేనని కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అత్యధికంగా మాట్లాడేది వారేనని, అలాంటపుడు గొంతు నొక్కడం అనేది ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఎవరి గళం అణచివేతకు గురైందని అడిగారు. టీవీలు, వార్తాపత్రికలు, సామాజిక మాధ్యమాలలో చాలా ఎక్కువగా మాట్లాడేవాళ్ళు వీళ్ళేనని చెప్పారు. అలా మాట్లాడుతూనే, తమ భావాలను వ్యక్తం చేయనివ్వడం లేదని ఆరోపిస్తున్నారన్నారు. 


రాజ్యాంగం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చూపుతున్నంత విశ్వాసం, గౌరవాలను మరే ప్రధాన మంత్రి ప్రదర్శించలేదన్నారు. అయినప్పటికీ కొందరు ఇటువంటి ఆరోపణలను చేస్తున్నారని చెప్పారు. ఇది చాలా దురదృష్టకరమని తెలిపారు. అరాచకం వ్యాపించాలని కోరుకునేవారు, ప్రజాస్వామిక సిద్ధాంతాలు, రాజ్యాంగం పట్ల నమ్మకం లేనివారు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. 


మన దేశాన్ని బలహీనపరచాలని మన దేశంలో ఉన్న కొందరు, కొన్ని బయటి శక్తులు ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలుసునని చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వ అభిప్రాయం కాదని, ఇది జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు వామపక్ష తీవ్రవాదంపై చర్యల గురించి అప్పటి కేంద్ర మంత్రులు పి చిదంబరం, శివరాజ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలనుబట్టి తెలుసుకోవచ్చునన్నారు. దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నవారి గురించి సమాజం జాగృతంకావాలన్నారు. ప్రభుత్వం కన్నా సమాజానికి ఇది చాలా ముఖ్యమని చెప్పారు. 


Updated Date - 2021-12-05T01:31:27+05:30 IST