భారీ నష్టాల నుండి లాభాల్లోకొచ్చినా...

ABN , First Publish Date - 2021-05-04T00:17:56+05:30 IST

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూసి, చివరకు కాస్త కోలుకొని స్వల్ప నష్టాల్లో ముగిసాయి.

భారీ నష్టాల నుండి లాభాల్లోకొచ్చినా...

ముంబై : స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూసి, చివరకు కాస్త కోలుకొని స్వల్ప నష్టాల్లో ముగిసాయి. సోమవారం చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు నేపధ్యంలో లాభాల్లో ట్రేడ్ అయింది. అయితే ఎక్కువ సేపు నిలవలేదు. ఈ క్రమంలో స్వల్ప నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు కరోనా భయాలు సూచీలపై ప్రభావం చూపాయి.  కాగా కీలక రంగాల్లో కనిష్ఠాల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీలు చివరలో పుంజుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్ల మేర నష్టాల నుండి కోలుకుంది. 


భారీ నష్టాల నుండి స్వల్ప నష్టాల్లోకి... 

సెన్సెక్స్ ఈ రోజు 48,356.01 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,863.23 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,028.07 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 63.84 (0.13%) పాయింట్లు నష్టపోయి 48,718.52 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఓ సమయంలో దాదాపు 800 పాయింట్లు నష్టపోయింది. ఇక చివరి గంటలో కాస్త పుంజుకొని 80 పాయింట్లు లాభపడింది. అయితే  అంతలోనే నష్టాల్లోకి వెళ్లినప్పటికీ స్వల్పంగా 63 పాయింట్ల నష్టంతోనే ముగిసింది. ఇక నిఫ్టీ మాత్రం అతి స్వల్ప లాభాల్లో ముగిసింది. నిఫ్టీ 14,481.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,673.85 వద్ద గరిష్టాన్ని, 14,416.25 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. 


కాగా అదానీ పోర్ట్స్ 4.29 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 4.12 శాతం, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 3.22 శాతం, టాటా స్టీల్ 2.97 శాతం, హెచ్‌యూఎల్ 2.30 శాతం లాభపడ్డాయి. ఇక టైటాన్ కంపెనీ 4.54 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంకు 2.28 శాతం, రిలయన్స్ 1.78 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.70 శాతం, బీపీసీఎల్ 1.38 శాతం నష్టపోయాయి. ఇక మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నాయి. 


Updated Date - 2021-05-04T00:17:56+05:30 IST