పనిచేయని వాక్సిన్‌కు వేల కోట్ల వ్యయమా!

ABN , First Publish Date - 2022-01-20T05:48:10+05:30 IST

ప్రజలందరూ కరోనా వాక్సిన్‌ రెండు డోసులు తీసుకోవాలి. అవకాశం ఉన్నవారు బూస్టర్‌ డోస్‌ తీసుకోవడం మంచిదే. అందరూ మాస్క్‌లు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి...

పనిచేయని వాక్సిన్‌కు వేల కోట్ల వ్యయమా!

ప్రజలందరూ కరోనా వాక్సిన్‌ రెండు డోసులు తీసుకోవాలి. అవకాశం ఉన్నవారు బూస్టర్‌ డోస్‌ తీసుకోవడం మంచిదే. అందరూ మాస్క్‌లు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి... అయినా రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా(ఒమైక్రాన్‌) సోకదని గ్యారంటీ లేదు! ఇలా పరస్పర విరుద్ధంగా ఉన్న ప్రభుత్వ ప్రచారం, వైద్యనిపుణుల మాటలు నవ్వు తెప్పిస్తున్నాయి.


ప్రస్తుతం కరోనా వైరస్‌ రూపాంతరమైన ఒమైక్రాన్‌తో యూరోప్‌ దేశాలు గడగడలాడుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌, జర్మనీ తదితర దేశాలలో ఒమైక్రాన్‌ సోకిన వారిలో 90 శాతం మంది రెండు డోసుల వాక్సిన్‌ తీసుకున్నవారే. ఆ మాటకు వస్తే బూస్టర్‌ డోస్‌ తీసుకున్నవారు కూడా ఒమైక్రాన్‌ బారిన పడుతున్నారు. వాక్సిన్‌ తీసుకున్నప్పటికీ వ్యాధి వస్తుందని చెబుతున్నప్పుడు వాక్సిన్‌ ఎందుకు వేసుకోవాలి? ఎవరి ప్రయోజనాల కోసం ఈ ఉపయోగపడని వాక్సిన్‌ వేస్తున్నారు? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారత ప్రభుత్వం కరోనా వాక్సిన్‌ నిమిత్తం బడ్జెట్‌లో 35 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఇప్పటి వరకు 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఏ మాత్రం రోగ నివారణ చేయలేని ఈ వాక్సిన్‌ నిమిత్తం వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారో అర్థం కావడం లేదు.


కరోనా రాకుండా నివారించలేని వాక్సిన్‌ను అసలు వాక్సిన్‌ అని ఎందుకు అంటారో బోధపడడం లేదు. వ్యాధి రాకుండా నివారించే ఔషధాన్ని వాక్సిన్‌ అంటారు. మసూచి, కోరింత దగ్గు, పోలియో వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రజలు వాక్సిన్ తీసుకుంటున్నారు. ఆయా వ్యాధులను సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నారు. కరోనా వాక్సిన్‌ తీసుకున్నప్పటికీ వ్యాధి నివారించలేకపోతున్నప్పుడు అది వాక్సిన్‌ ఎలా అవుతుంది? ప్రభుత్వాల తీరు తెన్నులు, ఔషధ కంపెనీల తీరు చూస్తుంటే వాక్సిన్‌ అనే పదానికి అర్థం మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.


కరోనా వైరస్‌, ఒమైక్రాన్‌ గురించిన వార్తలు, చేస్తున్న చికిత్స, వేస్తున్న వాక్సిన్‌లో ఏది నిజమో ఏది అబద్ధమో అర్ధం కాకుండా ఉంది. ప్రజలు మాత్రం సెకండ్‌వేవ్‌లో లక్షలకు లక్షలు కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధారపోశారు. అయినా చాలామందికి ప్రాణం దక్కలేదు. కేన్సర్‌కు కొంతమేరకైనా మందులు ఉన్నాయి, ఎయిడ్స్‌కు మందులు ఉన్నాయి. క్షయ వ్యాదికి మందులు ఉన్నాయి. కాని ఇప్పటివరకు కరోనాకు మాత్రం మందు లేదు. చికిత్స విషయానికి వస్తే కరోనా వైరస్‌ను గుర్తించి దాదాపు రెండు సంవత్సరాలు దాటుతున్నప్పటికీ వైరస్‌ను నివారించకలిగిన ఔషధాన్ని నేటికీ రూపొందించడం సాధ్యపడలేదు. అయితే చికిత్స పేరిట మాత్రం ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. గతంలో మానవాళిని ఇబ్బంది పెట్టిన సార్స్‌, ఇతర వైరస్‌ల నివారణకు వాడిన మందులనే అటుఇటుగా చేసి వాడుతున్నారు. అందులోనూ నిన్న వాడిన మందులు ఈ రోజు పనికి రావంటారు. ఈ రోజు చేసే చికిత్స రేపటికి మారిపోయిందని చెబుతున్నారు. కరోనా వైరస్‌ ప్రధానంగా ఊపిరితిత్తులు, కాలేయంపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. రెండో వేవ్‌లో మరణాలలో 90 శాతం శ్వాస అందక చనిపోయినవారే. ఆగమేఘాల మీద కరోనా వాక్సిన్‌ తయారు చేసిన ఫార్మసీ కంపెనీలు ఊపిరితిత్తులకు కరోనా సోకకుండా, సోకినా వైరస్‌ నాశనం చేసే విధంగా మందులు కనిపెట్టకపోవడం ఆశ్చర్యంతో పాటు అనుమానాన్ని కలిగిస్తోంది.


అనుమానం ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా మృతి చెందినవారి కంటే ఇతరత్రా కారణాల వల్ల చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఉదాహరణకు 2019లో కేన్సర్‌ కారణంగా 2.3 కోట్ల మంది మరణించారు. మలేరియాకు 1.5 కోట్ల మంది గురికాగా వారిలో 20 వేల మంది మరణించారు. గుండె సంబంధ కారణాల వల్ల ఏడాదికి 26 లక్షల మంది చనిపోతున్నారు. ప్రతి ఏడాది క్షయవ్యాధితో మరణిస్తున్న వారి సంఖ్య కూడా లక్షల్లో ఉంది. ఇంకా మద్యం తాగడం, కిడ్నీ సమస్యల కారణంగా చనిపోయేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. గత రెండేళ్లలో 3.7 కోట్ల మంది కరోనా వ్యాధికి గురికాగా వారిలో మరణించిన వారి సంఖ్య 4.86 లక్షలు మాత్రమే. అయినా ఇతర వ్యాధుల విషయంలో జరగని హడావిడి, ప్రచారం కరోనాకు చేస్తున్నారు. ప్రమాదకరంగా జరుగుతున్న ప్రచారానికి భయపడే చాలామంది మృత్యువాత పడుతున్నారు. అంతేకాకుండా తయారీకి 25 రూపాయలైనా ఖర్చు కాని వాక్సిన్‌ను వందలకు అమ్ముకుంటూ వేల కోట్లు సంపాదించుకుంటున్న కంపెనీలు ఉద్దేశ్యపూర్వకంగానే నివారణ, చికిత్సకు అవసరమైన ఔషధాలు తయారు చేయడం లేదేమోననే సందేహాలు పలువురిని తొలుస్తున్నాయి.


ఇదంతా చూస్తుంటే కొన్ని ఔషధ కంపెనీలు తమ ఆదాయం కోసం ఉద్దేశపూర్వకంగా కరోనా వైరస్‌ను వదిలాయని, మందులు, వాక్సిన్ల పేరిట మెడికల్‌ మాఫియా ఆడుతున్న నాటకం ఇదని సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్న వాదనలు నిజమని నమ్మాల్సి వచ్చేట్టుగా ఉంది. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నప్పటికీ ఔషధాలు, చికిత్స, వాక్సిన్ల విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పష్టమైన విధానంతో వ్యవహరించకపోవడం, అసలు ఔషధమే కనిపెట్టని కరోనా చికిత్సకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నప్పటికీ అవి ఉదారంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కరోనా(ఒమైక్రాన్‌) విషయంలో కచ్చితమైన విధానాన్ని ప్రకటించి తమ ప్రాణాలకు భరోసా ఇవ్వాలనే ప్రజల అభిమతాన్ని గుర్తెరిగి వ్యవహరించాలి.

అన్నవరపు బ్రహ్మయ్య

Updated Date - 2022-01-20T05:48:10+05:30 IST