పబ్లిక్ ఇష్యూల ద్వారా వేల కోట్లు... డజను కంపెనీల వాటా ఎంతంటే...

ABN , First Publish Date - 2020-11-30T00:28:41+05:30 IST

కరోనా వైరస్ మిగిల్చిన కష్టకాలంలోనూ షేర్ మార్కెట్ కళకళలాడింది. వేల కోట్ల రూపాయల సమీకరణను నమోదు చేసుకుంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ)ల్లో నాలుగు సెక్టార్లకు కంపెనీలు రికార్డు స్థాయిలో నిధులను సేకరించాయి.

పబ్లిక్ ఇష్యూల ద్వారా వేల కోట్లు... డజను కంపెనీల వాటా ఎంతంటే...

ముంబై : కరోనా వైరస్ మిగిల్చిన కష్టకాలంలోనూ షేర్ మార్కెట్ కళకళలాడింది. వేల కోట్ల రూపాయల సమీకరణను నమోదు చేసుకుంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ)ల్లో నాలుగు సెక్టార్లకు కంపెనీలు రికార్డు స్థాయిలో నిధులను సేకరించాయి. ఫార్మా, టెలికమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసుల రంగానికి చెందిన కంపెనీల పంట పండింది. కరోనా ప్రభావం లేని 2019 తో పోల్చుకుంటే.. ఈ ఏడాది ఐపీఓల ద్వారా సేకరించిన నగదు భారీగా నమోదు కావడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 


రూ. 25 వేల కోట్ల సేకరణ...

ఈ ఏడాది నవంబరు నాటికి సుమారు 25 వేల కోట్ల రూపాయలు ఐపీఓల ద్వారా సేకరించాయి ఆయా సెక్టార్లకు సంబంధించిన కంపెనీలు. డిసెంబర్ 2 వ తేదీన ఐపీఓను జారీ చేయడం ద్వారా బర్గర్ కింగ్ మీకరించుకోవాలనుకున్న 810 కోట్ల మొత్తాన్ని ఇందులో చేర్చలేదు. ఇది అదనం. ఇక 2019 లో ఇదే కాలానికి సమీకరించిన నిధులతో పోల్చుకుంటే... ఈ మొత్తం రూ.  12,362 కోట్ల మేరకు  అధికం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా... దేశీయ షేర్ మార్కెట్ సత్తాను మరోసారి చాటింది. 2018 తో పోల్చుకుంటే... తాజాగా నమోదైన విలువ బాగా తగ్గినట్టే. ఇక 2018 లో 24 కంపెనీలు ఐపీఓల రూపంలో రూ. 30,959 కోట్లను సేకరించాయి.

సత్తా చాటిన కంపెనీలు ఇవే...

ఈ ఏడాది ఐపీఓలను జారీ చేయడం ద్వారా అత్యధికంగా నిధులను సేకరించిన కంపెనీల జాబితాలో ఎస్‌బీఐ(భారతీయ స్టేట్ బ్యాంక్) అగ్రస్థానంలో ఉంది. ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ ఏకంగా రూ. 10,355 కోట్లను సమీకరించుకుంది. రూ. 6,480 కోట్లతో రెండో స్థానంలో గ్లాండ్ ఫార్మా నిలిచింది. ఇక రూ. 2,240 కోట్లతో సీఏఎంఎస్ మూడో స్థానంలో, రూ. 2,160 కోట్లతో యూటీఐ అస్సెట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ నాలుగో స్థానంలో నిలిచాయి.


 మిగిలిన కంపెనీలు ఇవే...

ఐపీఓల ద్వారా ఈ ఏడాది నిధులను సేకరించిన కంపెనీల జాబితాలో రొస్సారీ బయోటెక్, హ్యాపియెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్, రూట్ మొబైల్, కెమ్‌కామ్ స్పెషాలిటీస్ కెమికల్స్, ఏంజెల్ బ్రోకింగ్, ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, లిఖిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ ఉన్నాయి. కరోనా పరిస్థితుల్లోనూ స్టాక్ మార్కెట్ అత్యధిక లిస్టింగులను నమోదు చేసిందని, పెట్టుబడులను కొనసాగించడం వైపు మొగ్గు చూపడమే ఇందుకు కారణమని మై వెల్త్ గ్రోత్ డాట్ కామ్ సంస్థ సహ వ్యవస్థాపకుడు హర్షద్ చేతన్‌వాలా తెలిపారు.


ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరిన్ని..


ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరిన్ని...

వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి నాటికి ఎనిమిది నుంచి 10 ఐపీఓలు నమోదు కావచ్చని, వాటిని కూడా కలుపుకుంటే... ఈ ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించిన స్థాయిలో నిధులను సమీకరించినట్లవుతుందని అంచనా వేస్తున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కల్యాణ్ జ్యువెలర్స్, మిసెస్ బెక్టార్స్ ఫుడ్ స్పెషాలిటీస్ లిమిటెడ్, రైల్ టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు వచ్చే ఏడాది తొలి మూడు నెలల్లో పబ్లిక్ ఇష్యూకు వెళ్లొచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. దేశీయ ఆర్థిక పరస్థితులు కుదుటపడుతున్నాయనడానికి ఇవే నిదర్శనంగా తీసుకోవచ్చని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Updated Date - 2020-11-30T00:28:41+05:30 IST