‘ఉపాధి’ నిస్తోంది...

ABN , First Publish Date - 2020-05-15T10:40:05+05:30 IST

ఉపాధిహామీ పథకం కరోనా కట్టడిలో దినసరి కూలీలకు ఉపాధిని స్తోంది. కరోనా వైరస్‌ ప్రతీరంగాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ సమయంలో

‘ఉపాధి’ నిస్తోంది...

కూలీలకు ఆసరాగా ఉపాధిహామీ పథకం

ప్రతి రోజూ 30వేల మందికి పనులు

భౌతికదూరం పాటిస్తూ ఉపాధి పనుల గుర్తింపు


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): ఉపాధిహామీ పథకం కరోనా కట్టడిలో దినసరి కూలీలకు ఉపాధిని స్తోంది. కరోనా వైరస్‌ ప్రతీరంగాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ సమయంలో ఉపాధిహామీ పనులను ప్రారంభించడంతో కూలీలకు ఊరట లభించింది. ఉపాధి పనులపై కూలీలకు ఆసక్తి పెరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధి పనుల కల్పనలోను ముందుకు దూసుకు పోతోంది. లాక్‌డౌన్‌తో పట్టణాల్లో పనులు లేక పల్లెలకు చేరిన కూలీలు మళ్లీ ఉపాధి పనులు చేయడానికి ముందుకు వచ్చారు. ఉపాధిలేక అల్లాడుతున్న వారికి పనులు ఎంతో భరోసా నిచ్చాయి. 


నిత్యం 30వేల మంది కూలీలకు పనులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 92,039 మంది జాబ్‌కార్డు దారులుఉండగా 2,04,192 మంది ఉపాధికూలీల కింద నమోదు అయి ఉన్నారు. 5,563 శ్రమశక్తి సంఘాలు ఉండగా అందులో 1,05,070 మంది కూలీలు ఉన్నారు. 2020-21 లేబర్‌ బడ్జెట్‌లో 46.47 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 3.43 లక్షల పనిదినాలను కల్పించారు. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ప్రారంభమైన ఉపాధిహామీ పనుల్లో ప్రతి రోజు 30,387 మంది కూలీలు పనుల్లోకి వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు దినసరి కూలీ రూ. 237 నిర్ణయించగా జిల్లాలో కూలీలు సరాసరిగా రోజు రూ 189 పొందుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని కూలీలు రూ. 6.95 లక్షల కూలీని పొందారు. 


అన్ని పంచాయితీల్లోనూ పనులు

జిల్లాలో 255 గ్రామపంచాయతీలు ఉండగా అన్ని గ్రామపంచాయతీల్లో ఉపాధి పనులు ప్రారంభమయ్యాయి. చెరువుల పూడికతీత, కందకాలు తవ్వడం, వ్యవసాయ పొలాల వద్ద రోడ్లు, సోక్‌పిట్స్‌, నర్సరీ, ఫీడర్‌ కెనాల్‌ వంటి పనులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో రూ. 211 కూలీ ఇస్తుండగా ప్రస్తుతం రూ. 237కు పెంచింది. దీంతో పాటు వేసవి అలవెన్సు కూడా అదనంగా అందిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని బోయినిపల్లి మండలంలో 1,523 మంది, చందుర్తిలో 1,917 మంది, ఇల్లంతకుంటలో 3,231 మంది, గంభీరావుపేటలో 3,015 మంది, కోనరావుపేటలో 3,602 మంది, ముస్తాబాద్‌లో 3,177 మంది, రుద్రంగిలో 1,062 మంది, తంగళ్లపల్లిలో 3,322 మంది, వీర్నపల్లిలో 3,013 మంది, వేములవాడలో 335 మంది, వేములవాడ రూరలలో 1,452 మంది, ఎల్లారెడ్డిపేటలో 4,738 మంది ఉపాధి పొందుతున్నారు. 


ఉపాధిపనులపై ఆసక్తి చూపుతున్నారు: కౌటిల్యరెడ్డి, పీడీ డీఆర్‌డీవో

జిల్లాలో ఉపాధి పనులు అన్ని గ్రామపంచాయతీల్లో ప్రారంభమ య్యాయి. కూలీలు పనులు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పని ప్రదేశాల్లో భౌతికదూరం పాటించే విధంగా అన్ని చర్యలు చేపట్టాం. వేసవిలో అలవెన్సు కూడా ఇస్తున్నాం. 


Updated Date - 2020-05-15T10:40:05+05:30 IST