పర్యాటకం వెలవెల

ABN , First Publish Date - 2022-01-24T08:12:10+05:30 IST

కరోనాథర్డ్‌ వేవ్‌ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉండడంతో రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలు వెలవెలబోతున్నాయి.

పర్యాటకం వెలవెల

  • సందర్శకులు లేక బోసిపోయిన వైనం.. 
  • హైదరాబాద్‌ నుంచి వెళ్లే టూర్‌ బస్సుల రద్దు
  • కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలోనే.. 
  • మేడారానికి ఆదివారం 3 లక్షల మంది భక్తులు!
  • వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి..
  • యాదాద్రిలో కాస్త తగ్గిన రద్దీ


హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): కరోనాథర్డ్‌ వేవ్‌ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉండడంతో రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలు వెలవెలబోతున్నాయి. సంక్రాంతి పండగ సెలవుల వరకు కాస్త సందడిగా ఉన్న పర్యాటక కేంద్రాల్లో నాలుగైదు రోజులుగా సందర్శకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు వారాంతాల్లో విపరీతమైన రద్దీగా ఉండే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల తాకిడి తగ్గింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిఽధిలో సందర్శకుల రద్దీతో కళకళలాడే చార్మినార్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం, జూపార్క్‌, బిర్లా మందిర్‌, హుస్సేన్‌సాగర్‌ బోటింగ్‌, నెక్లెస్‌ రోడ్‌, గోల్కొండ కోట, కులీఖుతుబ్‌షాహి టూంబ్స్‌, తదితర ప్రాంతాలు బోసిపోయాయి. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే టూరిజం బస్సుల్లో అధిక శాతం షెడ్డుకే పరిమితమయ్యాయి. తిరుమల వెళ్లే బస్సులను నిలిపివేశారు.


ప్రతి వారం షిరిడీకి 4-5 బస్సుల వరకు వెళతాయి. డిమాండ్‌ లేకపోవడంతో వాటిని రద్దు చేశారు. ఇక కాళేశ్వరం, ధర్మపురి, వరంగల్‌, లక్కవరం, పాకాల, రామప్ప, వికారాబాద్‌, నాగార్జునసాగర్‌, సోమశిల, అలీసాగర్‌, కడియం, బాసర, తాడ్వాయ్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులను రద్దు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక స్థలాలను సందర్శించేందుకు ఏర్పాటు చేసిన సిటీటూర్‌ బస్సులనూ నిలిపివేశారు. విమానాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేయడంతో కొన్ని నెలలుగా అంతర్జాతీయ పర్యాటకులు తెలంగాణకు రావడం లేదు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన అత్యధిక శాతం కుటుంబాలు ఇంకా హైదరాబాద్‌కు చేరుకోలేదు. విద్యా సంస్థలకు నెలాఖరు వరకు సెలవులు ప్రకటించడంతో పాటు ఐటీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రంహోం కారణంగా అనేక మంది ఊళ్లలోనే ఉంటున్నారు. దీంతో రాజధానిలోని పలు ప్రధాన రహదారులు శని, ఆదివారాల్లో నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. ఇక బేగంపేట టూరిజం ప్లాజా, తారామతి బారాదరిలో బుకింగ్స్‌ సగానికి పైగా తగ్గిపోయినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న హరిత హోటళ్లు సైతం పర్యాటకులు లేక కొన్ని రోజులుగా వెలవెలబోతున్నాయి.  యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం సాధారణంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఉండేది. కరోనా రోజురోజుకూ విజృంభిస్తుండడంతో భక్తుల సంఖ్య తగ్గింది. ఆలయ ఆదాయం కూడా తగ్గిందని అధికారులు తెలిపారు.


కిక్కిరిసిన మేడారం

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రజలు వేలాదిగా తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. మహాజాతరకు ముందస్తు మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఒక్కరోజే 3 లక్షలకు పైగా భక్తులు మేడారం వచ్చారని అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడింది. మాస్కు లేని భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు. 

Updated Date - 2022-01-24T08:12:10+05:30 IST