మూసతో సాహిత్యానికి ముప్పు

ABN , First Publish Date - 2020-08-10T11:17:57+05:30 IST

సాహిత్యంలో పాత కొత్తల మేలు కలయిక కాకుండా గాలివాటంగా కొట్టుకుపోయే ధోరణి ఒకటి ఎప్పుడూ ఉంటుంది. ఏ కాలపు కవులు రచయితలకైనా తమకు ముందు కవులు రచయితలు ఉంటారు...

మూసతో సాహిత్యానికి ముప్పు

పూర్వకవుల ప్రతిభా విశేషాలను ఏమేరకు అవసరమో అంతమటుకే తీసుకుని కొత్త తోవలకు, శిఖరాలకు సాహిత్యాన్ని నడిపించకపోతే ఆ సాహిత్యం సమాజంలోని ఏ వర్గాలకూ ప్రేరణ కాదు కదా రసానుభూతిని సైతం ఇవ్వలేదు, పైపెచ్చు ఒక అనుకరణ సమూహం ఏర్పడి సాహిత్య విలక్షణతకు సాహిత్యంలో కాలిక చైతన్యానికి తీవ్ర అగాథం ఏర్పడుతుంది. దానితో ఆ కాలానికి ఆ స్థలానికి ఆ ప్రజాజీవితానికి సమకూరవలసిన సాహిత్య ప్రతిపత్తి లభించకుండా పోతుంది. అటువంటి కాలాన్ని శూన్యం యుగం అంటారు. ఏ నాలుగైదో తప్ప, మిగతావన్నీ శుష్క ప్రసంగాలుగా మిగిలిన శూన్యయుగం మన తెలుగు సాహిత్యానికి ఇదివరకే ఉంది. 


సాహిత్యంలో పాత కొత్తల మేలు కలయిక కాకుండా గాలివాటంగా కొట్టుకుపోయే ధోరణి ఒకటి ఎప్పుడూ ఉంటుంది. ఏ కాలపు కవులు రచయితలకైనా తమకు ముందు కవులు రచయితలు ఉంటారు. వాళ్లు ఏదో ఒక ధోరణిని అనుసరించి రాస్తారు. ఆ ధోరణిని ఆ కవులు రచయితలు అప్పటి రాజకీయ వాతావరణం నుంచో, సామాజిక అస్తిత్వ సంవేదనల నుంచో, ఆర్థిక స్థితిగతుల ఆరాటాల నుంచో, ఉత్పత్తి సంబంధాల్లోంచో, సాంస్కృతిక ఆదానప్రదానాల్లోంచో, వైయక్తిక జీవన సంఘర్షణల్లోంచో, ఆచారాలు సంప్రదాయాలు పరిపోషించే ఎత్తు పల్లాలపై సంకల్పించిన నిరసనల్లోంచో సృష్టిస్తారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా చేయబడిన సృజన కాబట్టి ఆ ధోరణికి జనామోదం, జనాదరణ ఉంటుంది. ఐతే తదనం తర కవులు రచయితలు అదే ధోరణిలో రాస్తే దాన్ని మూస ధోరణి (Routine Trend) అంటారు. కవిత్వం, కథ, నవల, నాటకం ప్రక్రియ ఏదైనా దానిలోకి కొత్త గొంతులు చేరి పలికినపుడే ఆ సాహిత్య రూపం పరిపుష్టం అవు తుంది. ఆ కొత్తగొంతులు వస్తుశిల్పాల నిర్దిష్ట లక్ష్యా లను విస్తృత పరచినప్పుడు, సమాజ చలన సూత్రాలను మార్చగలిగినపుడు లేదా మలుపు తిప్పగలిగినపుడు ఆ వస్తుశిల్పాలకు, ఆ నవ రచయితలకు ఆ ధోరణిలో భాగంగా వ్యాప్తి, ప్రమాణం రెండూ సమపాళ్లలో సిద్ధి స్తాయి. ఈ వ్యాప్తి ప్రమాణా లను దృష్టిలో ఉంచుకొని తాము కూడా అట్లా  రాస్తేనే గుర్తింపబడతాం అనే భ్రమలో గత వస్తుశిల్పాల్లో ఎక్కడా ఏ కొలతలు మార్చకుండా చేసే రచనలన్నీ మూసరచనలు అవుతాయి. అటు సమాజా నికీ సాహిత్యానికి ఏ ప్రయోజనం ఉండదు కాబట్టే ఈ రచనలను వృథా సాహిత్యం లేదా సాహిత్య వ్యర్థం (literary waste) అంటారు. ఈ కోవలోకి చేరే నిస్సారమైన పుస్తకాల వల్ల ముద్రణా సంస్థలకు తప్ప మరొకరెవ్వరికీ నయా పైసా లాభం ఉండదు. ఇంకా నిర్మొహమాటంగా చెప్పాలంటే పుస్త కాలకోసం చెట్లు నరకబడి అడవులు తరగి పోయి పర్యావరణానికి కీడు వాటిల్లుతుంది.  


అసలైన సృజనకు కావలసిన భావగత నేపథ్యం, లేఖనా సంబంధ అభ్యాసం రెండూ కొరవడినందు వల్లే రచయితలు మూస లేదా వృథా రచనలు చేస్తారు. హేతుబద్ధ సృజన, కాలస్పృహ, భావజాల పరిణతి ఎంత మాత్రం లేకుండా కేవలం రచయితలం అనిపించుకోవడానికి చేసే రచనలకు కూడా అద్భుతం, అపురూపం అని కొందరు పెద్దలు ముందుమాటలు ప్రవాహనిష్ఠగా రాస్తారు. ఇట్లా రాయడం దారితప్పినవాణ్ణి మరింత ద్రిమ్మరిని చెయ్యడం లాంటిది. వీటి ఆవిష్కరణలకూ పెద్దలు దూర దూరాల నుంచి వస్తారు. మిత్రులు చేయికొద్దీ సమీక్షించి గ్రంథాలను ఆకాశానికెత్తుతారు. ఇక సాహిత్య వ్యర్థాల ఉత్పాదకుల ప్రగల్భాలకు గంపలూ గరిసెలు సరిపోవు. రచయితల సంఖ్య పెరగాల్సిన అవసరానికి, రచనల ప్రతిపత్తి పెరగాల్సిన సందర్భానికి మూస సాహిత్యం పూర్తి విఘాతం కల్గిస్తుంది.


ఐతే వర్ధమాన రచయితలు, వర్ధమాన కవులు పూర్వ పండితులను అనుసరించకూడదా? అనే ప్రశ్న వస్తుంది. అనుసరిస్తే తప్పులేదు, అనుకరిస్తేనే తప్పు. టి.ఎస్‌.ఇలియట్‌ తన ‘Tradition of the individual talent (1919)’ వ్యాసంలో చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్య కవులకు రచయిత లకు అనుకరణ సందర్భంలో అవసరమైన మార్గదర్శనం కలిగిస్తుంది: ‘‘The literary past must be integrated into contemporary poetry. But the poetry must gaurd against excessive academic knowledge and distill only the most essential bits of the past into poem, thereby enlightening readers.’’ ఒక తరం వాదనలు, భావజాలం, వస్తు శిల్పాల ముద్రలు అనంతర తరంమీద అనివార్యంగా ఉంటాయి. కేవలం వాటి నెమరువేతకో, తిరిగి వాటినే చెప్పడానికో పరిమితమైతే రచనలకూ ఏ సార్థకత ఉండకపోగా, ఆ రచయితలు కనీసం ప్రాతినిధ్య రచయిత లుగా కూడా మిగల లేరు. పూర్వకవుల ప్రతిభా విశేషాలను ఏమేరకు అవసరమో అంతమటుకే తీసుకుని కొత్త తోవలకు, శిఖరాలకు సాహి త్యాన్ని నడిపించకపోతే ఆ సాహిత్యం సమాజంలోని ఏ వర్గాలకూ ప్రేరణ కాదు కదా రసానుభూతిని సైతం ఇవ్వలేదు, పైపెచ్చు ఒక అనుకరణ సమూహం ఏర్పడి సాహిత్య విలక్షణతకు సాహిత్యంలో కాలిక చైతన్యానికి తీవ్ర అగాథం ఏర్పడుతుంది. దానితో ఆ కాలానికి ఆ స్థలానికి ఆ ప్రజాజీవితానికి సమకూరవలసిన సాహిత్య ప్రతిపత్తి లభించకుండా పోతుంది. అటువంటి కాలాన్ని శూన్యం యుగం అంటారు. ఏ నాలుగైదో తప్ప, మిగతావన్నీ శుష్క ప్రసంగాలుగా మిగిలిన శూన్యయుగం మన తెలుగు సాహిత్యానికి ఇదివరకే ఉంది. 


సృజన నూతన పుంతలు తొక్కడానికి కవులకు రచయిత లకు ప్రధానంగా ఉండాల్సిన మూలధాతువులు ప్రాపంచిక అవగాహన, సాహిత్య అధ్యయనం. వీటికి ద్విముఖాలు. ఒకటి సిద్ధాంతపరమైంది (Theoritical), రెండోది ఆచర ణాత్మకమైంది (practical). కేవలం గ్రంథపఠనం చేయడం ద్వారా అబ్బేది సిద్ధాంతం. క్షేత్ర స్థాయికి వెళ్లడం ద్వారా సమకూరేది ఉత్పాదకతా సామర్థ్యం. చాలామంది రచయితలు ఈ రెండు పద్ధతుల్లో కనీసం మొదటిదైన సిద్ధాంతాన్నైనా అధ్యయనం చేయరు. లోకంలో వినికిడిలో ఉన్న సిద్ధాంతానికి కరణీకం చేస్తూ, సిద్ధాంత పరిణామాలను, మూల్యాంకనాలను సైతం పట్టించుకోకుండా సాంఘిక నియమాల (general moral)ను, సాధారణ నీతుల (principals)ను గేయాలుగానో, పద్యాలుగానో, కవితలుగానో, కథలుగానో కనీస శిల్పం లేకుండా అక్షరాలను పోగేస్తుంటారు. ఇవి మౌఖిక సాహిత్యంలోని సామెతలు పొడుపు కథల స్థాయికి కూడా సరిపోలవు. ఇట్లాకాకుండా ప్రాపంచిక విషయాలను ఆకళింపు చేసుకొని, స్థలకాలాల భావుకత భావజాలాలను అన్వయించుకొని తానున్న చోటగల ప్రజాజీవితంతో సృజన కార్యాన్ని సమన్వయం చేయగలిగితే మూస నుంచి, అనుకరణ నుంచి రచయితలు అలవోకగా బయటపడతారు. కానీ, కొందరు అపరిపక్వత వల్ల, అహం వల్ల, నేర్చుకోలేనితనం వల్ల తాము గిరిగీసుకున్న గీతలవద్దనే నిలబడి గుండం తిరుగుతారు. ఎప్పుడైతే ప్రపంచంలో ఆయా చోట్ల వెలుగు చూస్తున్న నూతన రచనలను చదు వరో, ఆ నవ్యత ఇచ్చిన స్ఫూర్తిని పుణికిపుచ్చుకోలేరో రచయితలు ఆగి పోతారు. ఆగిపోయిన రచయితలు సాహిత్యాన్ని ముందుకు నడిపించ లేరు. సాహిత్యం ముందుకు నడవక పోతే అక్కడి సమాజం కూడా ఆగిపోయిన రచయితలతో పాటు జడమయం అవుతుంది. ఎప్పుడైతే జడత్వం ఆవరిస్తుందో వెనువెంటనే తిరోగమన విలువలు ఆ క్షేత్రాలతో జతకడతాయి. విశృంఖలం చేయడానికి మళ్లీ వైతాళికులు పుట్టాలి.


చాలామంది అనుకున్నట్టుగా ఒక్క సంప్రదాయ ధోరణికే మూస రచయితలు ఉండరు, సామ్యవాద రచయితల్లోనూ మూసధోరణి ఉంటుంది. మూస ధోరణికి కారణాలను ప్రఖ్యాత సామాజిక విశ్లేషకులు కీ.శే. కె. బాలగోపాల్‌ ఇట్లా విడమరిచారు: ‘‘మన కళ్లముందు ఉండీ మనం చూడని, చూడజాలని విషయాలనేకం ఉంటాయి. కొన్ని భయం వల్ల చూడం. కొన్ని అభద్రత వల్ల చూడం. కొన్ని బలమైన భావ జాల ప్రభావంవల్ల మన ఎదుట ఉండీ మనకు కనిపిం చవు. ఒక్కొక్కసారి మనకు అలవడిన దృక్కోణం వల్లగానీ, మనం ఎంచుకున్న దృక్కోణం వల్ల గానీ, కొన్ని విషయాలు మన కళ్లముందే ఉండీ మనకు కనిపించవు. వీటిలో విడివిడి విషయాలే కావు, సామాజిక క్రమాలు ఉంటాయి. వీటిని మనకు చూపించడం సాహిత్యం చేసే పనులలో ఒకటి’’. ఈ వ్యాఖ్యానం ఒక్క తెలుగు సాహిత్యానికే కాదు యావత్ప్రపంచ సారస్వతాలకూ దిక్సూచి వంటిది. 


కొత్తగా రచనలు చేసేవాళ్లు ముఖ్యంగా నాలుగు అంశా లను గుర్తుంచుకోవాలి. ఏ ప్రక్రియలో రాస్తున్నాం అనేది మొదటిది, ఏ ఇతివృత్తం రాస్తున్నాం అనేది రెండోది, ఏ భావజాలం రాస్తున్నాం అనేది మూడోది, ఎవరిని లక్ష్యంగా ఏ ప్రయోజనాల కోసం రాస్తున్నాం అనేది నాల్గోది. ఈ నాల్గు అంశాల్లో చూపే వివేకం ఒక రచయితకు స్థాయిని కల్పి స్తుంది. ఎక్కడా ఎవరితోనూ దేనితోనూ పోలికలు లేని కొంగ్రొత్త తాజాతనం రచనలో సాక్షాత్కరిస్తే అది కలకాలం పాఠకుల మన్నన పొందగలుగుతుంది. కెనడాకు చెందిన మెక్‌ మాస్టర్‌ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు Phillipa K.Chong తన విమర్శా గ్రంథం ‘Inside the Critics Circle’లో పేర్కొన్నట్టు రచనకు సామాజిక దృక్పథం (socialogical perspective), విశేష రుచి (idiosyncratic taste) అనే రెండు గుణాలు తప్పనిసరిగా ఉన్నప్పుడు ఆ కృతి, తత్‌ కర్త ఆ ప్రక్రియలో మేలుబంతి వలె పరిమళిం చడం తథ్యం.  


వస్తు వైవిధ్యం, రూపం వైవిధ్యం, గుణ వైవిధ్యం  ఉన్న  రచనలకు పాఠకులూ ఉన్నారు, మార్కెట్టూ ఉంది, సాంకేతిక ఆధునికీకరణలో ఇతర భాషల్లోకి అనువాదాలకు నాజూకైన ద్వారాలూ తెరచి ఉన్నాయి. కావాల్సిందల్లా కవులు రచయితలు నూతన సృజనకు సర్వశక్తులతో పూనుకోవడమే. 

బెల్లి యాదయ్య

98483 92690


Updated Date - 2020-08-10T11:17:57+05:30 IST