శక్తికి మించిన అప్పులతో ముప్పు

ABN , First Publish Date - 2022-04-22T09:13:48+05:30 IST

కొన్ని రాష్ట్రాలు ఉచిత పథకాలను ప్రకటిస్తూ శక్తికి మించి అప్పులు చేస్తున్నాయని, ఇది రానున్న రోజుల్లో పెను ప్రభావం చూపుతుందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.

శక్తికి మించిన అప్పులతో ముప్పు

  • ఆర్థిక సామర్థ్యానికి మించి ఉచిత పథకాలు సరికాదు
  • దేశంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి
  • సివిల్‌ సర్వీసుల అధికారులు సవాళ్లను అధిగమించాలి
  • ‘సివిల్‌ సర్వీసెస్‌ డే’లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): కొన్ని రాష్ట్రాలు ఉచిత పథకాలను ప్రకటిస్తూ శక్తికి మించి అప్పులు చేస్తున్నాయని, ఇది రానున్న రోజుల్లో పెను ప్రభావం చూపుతుందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక శక్తికి మించి ఉచిత పథకాలను ప్రకటించడం సరికాదని, దీనివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ‘సివిల్‌ సర్వీసెస్‌ డే’ను పురస్కరించుకుని గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణార్థులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఆల్‌ ఇండియా సర్వీసె్‌స(ఏఐఎస్‌), సెంట్రల్‌ సివిల్‌ సర్వీసె్‌స(సీసీఎస్‌), మిలిటరీ ఇంజనీరింగ్‌ సర్వీసె్‌స(ఎంఈఎ్‌స)కు చెందిన 247 మంది అధికారులు ఎంసీహెచ్‌ఆర్‌డీలో మూడు నెలలుగా తీసుకుంటున్న శిక్షణ గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఇష్టాగోష్టిలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఇప్పటికే దేశంలో ప్రాంతీయ, సామాజిక, ఆర్థిక అసమానతలు ఉన్నాయని తెలిపారు.


భారత్‌లో 18ు-20ు నిరక్షరాస్యత, 20 శాతం పేదరికం ఉన్నాయని చెప్పారు. లింగ, కుల వివక్ష ఇంకా తొలగిపోలేదన్నారు. కొత్తగా ఉద్యోగంలోకి వచ్చే సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు ఇలాంటి సవాళ్లను అధిగమించాలని సూచించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి నిధుల విషయంలో స్పష్టంగా ముందుకు వెళ్లాలన్నారు. సామాజిక దురాచారాలను పూర్తిగా నిర్మూలించేందుకు విశేషమైన కృషి జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు తమ శక్తి సామర్థ్యాల మేర పని చేయకుండా ఆటంకాలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, అధికారుల మధ్య అనైతిక సంబంధాలు ఏర్పడటం ఆవేదన కలిగిస్తోందన్నారు. పనితీరు ఆధారంగానే అధికారులకు పదోన్నతులు రావాలనే విషయంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సివిల్‌ సర్వీసుల అధికారులు మాతృ భాషలను ప్రోత్సహించాలని కోరారు. సివిల్‌ సర్వీసెస్‌ డే సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన, తదితర పోటీల్లో ప్రతిభ కనబరచిన అధికారులకు బంగారు, వెండి, రజతక పథకాలు, నగదు బహుమతులు అందజేశారు.

Updated Date - 2022-04-22T09:13:48+05:30 IST