తుపాకీతో బెదిరించి కాల్పులు జరిపిన యువకుడిపై కేసు

ABN , First Publish Date - 2021-06-19T05:03:28+05:30 IST

యువతిని ఫోన్‌నెంబర్‌ అడగ్గా ఇవ్వలేదనే కోపంతో వారి కుటుంబీకులను ఓ యువకుడు తుపాకీతో బెదిరించి కాల్పులు జరిపిన సంఘటన కలకలం రేపింది.

తుపాకీతో బెదిరించి  కాల్పులు జరిపిన యువకుడిపై కేసు

బైరెడ్డిపల్లె, జూన్‌ 18 : యువతిని ఫోన్‌నెంబర్‌ అడగ్గా ఇవ్వలేదనే కోపంతో వారి కుటుంబీకులను ఓ యువకుడు తుపాకీతో బెదిరించి కాల్పులు జరిపిన సంఘటన  కలకలం రేపింది. ఈ సంఘటన బైరెడ్డిపల్లె మండలం కడపనత్తం గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ మునిస్వామి కథనం మేరకు.. కడపనత్తంగ్రామానికి షాను అనే యువకుడు అదేగ్రామానికి చెందినఓ యువతిని ఫోన్‌ నెంబర్‌ కావాలని అడిగాడు. ఇందుకు ఆమె తిరస్కరించి విషయాన్ని  తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో యువతి కుటుంబీకులు ఆ యువకుడిని తీవ్రంగా మందలించారు. దీంతో వీరిపై కక్షపెంచుకున్న యువకుడు షాను గురువారం రాత్రి తనవద్ద వున్న నాటుతుపాకీ తీసుకుని యువతి ఇంటివద్దకు వెళ్లాడు. ‘మీఅంతుచూస్తానంటూ’ బెదిరించడమే గాక కాల్పులు జరిపాడు. భయాందోళనకు గురైన యువతి కుటుంబీకులు ఇంట్లో నుంచి బయటకురాకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. జరిగిన సంఘటన గురించి బాధిత యువతి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2021-06-19T05:03:28+05:30 IST