ప్రియురాలి మెప్పు పొందాలని..

ABN , First Publish Date - 2021-08-11T04:52:38+05:30 IST

ప్రియురాలికి..

ప్రియురాలి మెప్పు పొందాలని..
కేసు వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ అమిత్‌ బర్దర్‌

బొమ్మ తుపాకీతో బెదిరించి బంగారు గొలుసులు చోరీ
పోలీసులకు పట్టుబడిన ఒడిశా యువకుడు


శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి: ప్రియురాలికి బంగారు ఆభరణాలు ఇచ్చి మెప్పు పొందాలని భావించాడా ప్రియుడు. కానీ తనకు అంత స్థోమత లేకపోవడంతో దొంగతనం చేయడానికి నిర్ణయించుకున్నాడు. బొమ్మ తుపాకీతో భయపెట్టి.. బంగారు గొలుసులు చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కాడు ఒడిశాకు చెందిన యువకుడు. ఇచ్ఛాపురంలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఎస్పీ అమిత్‌బర్దర్‌ మంగళవారం విలేకరులకు తెలిపిన వివరాలివీ...


ఒడిశాలోని రాయగడ జిల్లా గుణుపూర్‌ సమీపంలోని చలకంబకు చెందిన సూరజ్‌కుమార్‌ పదో తరగతి వరకూ చదువుకున్నాడు. విశాఖలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత ఏడాది అతని చిన్నాన్న అనారోగ్యానికి గురికావడంతో భువనేశ్వర్‌లోని ఓ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. చిన్నాన్నకు సపర్యలు చేయడానికి వెళ్లిన సూరజ్‌కుమార్‌ అక్కడే పనిచేస్తున్న యువతితో ప్రేమలో పడ్డాడు. గత ఏడాది లాక్‌డౌన్‌ నుంచి సూరజ్‌ ఖాళీగా ఇంటి వద్దే ఉంటున్నాడు. ప్రియురాలికి బంగారు ఆభరణాలు ఇస్తే.. ఆమె మెప్పు పొందవచ్చని భావించాడు. కానీ తన వద్ద అంత నగదు లేకపోవడంతో ఎక్కడైనా దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు.


ఇందుకుగాను బొమ్మ తుపాకీని రూ.2 వేలకు ఆన్‌లైన్‌లో బుక్‌చేశాడు. సోమవారం ఇచ్ఛాపురంలోని జీకే జ్యూయలర్స్‌కు వెళ్లాడు. మూడు బంగారు గొలుసులను ఎంపిక చేసుకొని ప్రియురాలికి ఫోన్‌లో ఫొటోలు పెట్టాడు. షాపు యజమాని మిథున్‌ చక్రవర్తితో మాటలు కలుపుతూ...ఎవరూ లేని సమయంలో జేబు నుంచి బొమ్మ తుపాకీని బయటకు తీసి భయపెట్టాడు. ఆ మూడు గొలుసులను పట్టుకొని పారిపోయాడు. వెంటనే వ్యాపారి పోలీసులకు సమాచారం అందించాడు. కొంత దూరం వెళ్లిన తరువాత సూరజ్‌ జేబులోంచి బొమ్మ తుపాకీ రోడ్డుపై పడిపోయింది. ఆ తరువాత కొద్దిసేపటికే సూరజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు రివాల్వర్‌తో పోలిన బొమ్మ తుపాకీలు కొనుగోలు చేయడం, వినియోగించడం నేరమని ఎస్పీ అమిత్‌ బర్దర్‌ స్పష్టం చేశారు. అటువంటి వాటికి పిల్లలను దూరంగా ఉంచే బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. త్వరితగతిన కేసును ఛేదించిన ఇచ్ఛాపురం సీఐ వినోద్‌బాబు, ఎస్‌ఐ సత్యనారాయణ, కానిస్టేబుల్‌ బషీర్‌లను ఎస్పీ అభినందించారు. విలేఖరుల సమావేశంలో ఎస్‌బీ డీఎస్పీ వీరకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-08-11T04:52:38+05:30 IST