Abn logo
Sep 27 2021 @ 23:18PM

ఫైనాన్స్‌ వ్యాపారి హత్య కేసులో... ముగ్గురు నిందితుల అరెస్టు

వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ ప్రసాదరావు

ప్రొద్దుటూరు క్రైం, సెప్టెంబరు 27 : దొరసానిపల్లెకు చెందిన ఫైనాన్స్‌ వ్యాపారి భూమిరెడ్డి తిరుమల్లేశ్వర్‌రెడ్డి హత్య కేసుకు సంబంధించి నిందితులు ముగ్గురిని రూరల్‌ సీఐ మధుసూదన్‌గౌడ్‌ నేతృత్వంలోఎస్‌ఐలు జె.శివశంకర్‌, అరుణ్‌రెడ్డిలు తమ సిబ్బందితో కలిసి అరెస్టు చేశారు. వీరి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు బంగారు చైను, ఉంగరం, పల్సర్‌ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ వై.ప్రసాదరావు వివరాలను వెల్లడించారు. ఈనెల 19న తిరుమల్లేశ్వర్‌రెడ్డి కన్పించడం లేదంటూ అతడి తండ్రి సోమేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు రూరల్‌ పీఎ్‌సలో అదృశ్యం కేసు నమోదైందన్నారు. అయితే కొత్తపేటకు చెందిన సుంగల హుస్సేన్‌వల్లికి అప్పుగా డబ్బులిచ్చినట్లు, ఆ లావాదేవీల సందర్భంలో హుస్సేన్‌వలి, అతడి కుటుంబసభ్యులతో తిరుమల్లేశ్వర్‌రెడ్డికి గొడవ జరిగినట్లు తెలుసుకున్న సోమేశ్వర్‌రెడ్డి కొత్తపేటలోని హుస్సేన్‌వలి ఇంటి వద్దకు వెళ్లగా ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. దీంతో ఇంట్లోకి వెళ్లి చూడగా, తిరుమల్లేశ్వర్‌రెడ్డి శవం బయటపడిందన్నారు. దర్యాప్తులో భాగంగా హుస్సేన్‌వలి, అతడి భార్య షమీమ్‌, కొత్తపేట గ్రామం వరదరాజులరెడ్డి కాలనీకి చెందిన నటరాజ్‌ అలియాస్‌ రాజులను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించినట్లు చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్‌ రిమాండుకు అదేశించినట్లు తెలిపారు. హత్య కేసును ఛేదించడంలో పోలీసు అధికారులతో పాటు విశేష కృషి చేసిన హెడ్‌ కానిస్టేబుల్‌ సాయిప్రసాద్‌, కానిస్టేబుళ్లు నాగ, లక్ష్మణ్‌, రాజశేఖర్‌లను డీఎస్పీ అభినందించి నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. సమావేశంలో సీఐ మధుసూదన్‌గౌడ్‌, ఎస్‌ఐలు శివశంకర్‌, అరుణ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.