HYD : వెండి ఉంగరాలపై Gold పూతపూసి.. బురిడీ కొట్టించి..

ABN , First Publish Date - 2021-10-09T16:15:43+05:30 IST

వెండి ఉంగరాలపై బంగారు పూత పూసి..

HYD : వెండి ఉంగరాలపై Gold పూతపూసి.. బురిడీ కొట్టించి..

హైదరాబాద్‌ సిటీ : వెండి ఉంగరాలపై బంగారు పూత పూసి.. పాన్‌ బ్రోకర్లను బురిడీ కొట్టించిన ముగ్గురిని ఎస్సార్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు 208 ఉంగరాలను తాకట్టు పెట్టి, భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈమేరకు పలువురు ఫిర్యాదు చేశారు. వెస్ట్‌జోన్‌ జా యింట్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ శుక్రవారం కేసు వివరాలు వెల్లడించారు.


బోరబండ మోతీనగర్‌కు చెందిన ఏడిగ భాస్కర్‌(51) స్వర్ణకారుడు. 2016లో ఓ చీటింగ్‌ కేసులో జైలుకెళ్లాడు. బయటకు వచ్చి, తన స్నేహితుడు జవహర్‌నగర్‌ మసీదు గడ్డ ప్రాంతానికి చెందిన మరో స్వర్ణకారుడు బొబ్బ వెంకట్‌రెడ్డి (59)తో కలిశాడు. వెంకట్‌రెడ్డి కూడా 2017లో చీటింగ్‌ కేసులో జైలుకెళ్లి వచ్చాడు. ఇద్దరూ కలిసి ఆ తర్వాత మోసాలు చేయడమే ప్రవృత్తిగా పెట్టుకున్నారు. వారిపై పలు పోలీస్‌స్టేషన్లలో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. తర్వాత వీరు వెండి ఉంగరాలకు బంగారు పూత పూసి మోసం చేయాలని నిర్ణయించుకున్నారు.


యూసుఫ్‌గుడా ప్రాంతానికి చెందిన స్వర్ణకారుడు ఎం. హరివర్ధన్‌ (32)ను కలిశారు. అతడు వెండితో 7 నుంచి 8 గ్రాముల ఉంగరాలను తయారు చేసి, వాటిపై బంగారు పూత పూసి ఇచ్చేవాడు. వాటిని రాజేంద్రకుమార్‌కు ఇవ్వగా, అతను తనకు పరిచమున్న వ్యాపారుల వద్దకు తీసుకెళ్లి, వాటిపై హాల్‌ మార్క్‌ వేయించేవాడు. వాటిని భాస్కర్‌, వెంకట్‌రెడ్డిలు పాన్‌ బ్రోకర్ల వద్ద తనఖా పెట్టి డబ్బులు తీసుకునే వారు. ఒక్కో ఉంగరం కుదువ పెట్టి రూ. 15 నుంచి, రూ. 25 వేల వరకు అప్పు తీసుకునేవారు. ఒక్కో వ్యాపారి వద్ద రెండు నుంచి మూడు ఉంగరాలను కుదువ పెట్టారు.


బోరబండకు చెందిన పాన్‌ బ్రోకర్‌ గణేశ్‌ చౌదరి వద్ద కూడా నిందితులు ఉంగరాలు తాకట్టు పెట్టారు. వెంకట్‌రెడ్డి  2019లో ఉంగరం తనఖా పెట్టి రూ.16 వేలు, 2020లో రూ.22వేలు, 2021 ఆగస్టులో 19 వేలు తీసుకున్నాడు. వాటిని విడిపించుకోలేదు. అనుమానించిన గణేశ్‌ చౌదరి తాకట్టు పెట్టిన ఉంగరాలను పరిశీలించగా, నకిలీవని తేలింది. దీంతో ఈ నెల 1న ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సార్‌నగర్‌ క్రైం టీమ్‌ సీసీ కెమెరాలు, నిందితులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఒకరి తర్వాత ఒకరిని గుర్తిస్తూ నిందితులు, భాస్కర్‌, వెంకట్‌రెడ్డి, హరివర్ధన్‌లను అరెస్ట్‌ చేశారు. హాల్‌మార్కింగ్‌కు సహకరించిన రాజేంద్రకుమార్‌ పరారీలో ఉన్నాడు. ఎలాంటి తనిఖీ చేయకుండా హాల్‌ మార్క్‌ ముద్రించిన వ్యాపారులను సైతం హెచ్చరించినట్లు జాయింట్‌ సీపీ తెలిపారు.

Updated Date - 2021-10-09T16:15:43+05:30 IST