కరోనాతో ముగ్గురి మృతి

ABN , First Publish Date - 2021-05-14T05:29:09+05:30 IST

కరోనాతో ముగ్గురి మృతి

కరోనాతో ముగ్గురి మృతి

పరిగి/కులకచర్ల/మోమిన్‌పేట : కరోనాతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం ముగ్గురు మృతిచెందారు. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం నస్కల్‌ గ్రామానికి చెందిన ఓ మహిళ(52)కు ఈనెల 10న కరోనా పాజిటివ్‌ వచ్చింది. వికారాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండగా గురువారం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి మృతిచెందింది. కులకచర్ల మండలం కులకచర్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గత ఆదివారం కరోనా పాజిటివ్‌ రావడంతో షాద్‌నగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.

  • కరోనాతో పోరాడి ఓడిన ప్రధానోపాధ్యాయుడు

గత 20 రోజులుగా కరోనాతో పోరాడి ఓ ప్రధానోపాధ్యాయుడు(39) మృతిచెందిన ఘటన వికారాబాద్‌ నియోజకవర్గంలోని మోమిన్‌పేట మండలంలో చోటుచేసుకుంది. అమ్రాదికలాన్‌ గ్రామానికి చెందిన ప్రధానోపాధ్యాయుడికి కొన్నిరోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రావడంతో 20రోజులుగా హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి రక్తం అవసరం పడగా స్నేహితులు ముందుకొచ్చారు. దీంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. కాగా గురువారం మధ్యాహ్నం పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, పిల్లలున్నారు. ఎన్కతల ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. చిన్నతనంలో ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి అందరి మన్ననలు పొందాడని, ఆయన మృతి తీరని లోటు అని పలువురు విద్యాధికారులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.

Updated Date - 2021-05-14T05:29:09+05:30 IST