అప్పుల బాధతో ముగ్గురు రైతుల ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-17T06:19:58+05:30 IST

జిల్లాలో వ్యవసాయం చేయడం భారంగా మారింది. అప్పుల బాధ రైతాంగాన్ని కుదేలు చేస్తోంది. వేర్వేరు గ్రామాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

అప్పుల బాధతో ముగ్గురు రైతుల ఆత్మహత్య

సీ.బెళగల్‌, అక్టోబరు 16: జిల్లాలో వ్యవసాయం చేయడం భారంగా మారింది. అప్పుల బాధ  రైతాంగాన్ని కుదేలు చేస్తోంది. వేర్వేరు గ్రామాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.  సీ. బెళగల్‌ మండలంలోని  మారందొడ్డి గ్రామానికి చెందిన ఉప్పరి నారాయణ (46) అనే కౌలు రైతు అప్పుల బాధ తాళలేక శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు.  కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాక  చికిత్స పొందుతూ  మృతి చెందాడు. నారాయణ ఆరేళ్ల నుంచి  ఆరెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి, ఉల్లి, మిరప, పంటలు సాగు చేసుకునేవాడు. తగిన దిగుబడి రాక, ధరలు లేక అప్పులపాలయ్యాడు. బాకీలు తీర్చే దారి కనిపించక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో   పురుగుల మందు తాగాడు. ఆయనకు భార్య సుంకులమ్మ,  ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య  ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శివాంజల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే అదే గ్రామానికి చెందిన ఉప్పరి వీరబాబు అనే రైతు తనకున్న ఎకరన్నర పొలంలో పత్తి, ఉల్లి, మిరప పంటలను సాగు చేస్తున్నాడు. మరొక మూడెకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగుచేస్తున్నాడు. అయితే పంటలు చేతికి రాక అప్పులు పెరిగి పోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నాడు. చికిత్స నిమ్మితం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 


ఉరి వేసుకుని యువ రైతు.. 


వెల్దుర్తి: మండలంలోని  రత్నపల్లె గ్రామానికి చెందిన రైతు నాయకంటి అయ్యస్వామి (27)   వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  అయ్యస్వామి నాలుగెకరాల పొలం తీసుకుని సేద్యం చేస్తున్నాడు. వర్షాభావం వల్ల పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. రూ.3 లక్షల మేర నష్టం వచ్చింది. ఈ విషయంపై శుక్రవారం రాత్రి ఇంట్లో చిన్న గొడవ జరిగింది.  శనివారం ఉదయం భార్య సులోచన   నిద్ర లేచి చూడగా..  అయ్యస్వామి కనిపించలేదు. అంతలోనే  రైతు ప్రతాప్‌రెడ్డి పొలంలోని వేపచెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడంటూ  స్థానికులు వచ్చి తెలిపారు.    సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసులు తెలిపారు. అయ్యస్వామికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.


బేతంచెర్ల: బేతంచెర్ల మండలం గూటుపల్లె గ్రామానికి చెందిన కోడెల శశికిరణ్‌ (24) ఆత్మహత్యాయత్నం చేసి, ఆస్పత్రిలో కోలుకోలేక మృతి చెందాడు. గ్రామానికి చెందిన కోడెల అయ్యన్న అనే రైతుకు ఆరెకరాల పొలం ఉంది. ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడుకు హరిబాబుకు మూడెకరాలు, చిన్న కుమారుడు శశికుమార్‌కు మూడెకరాల పొలాన్నిపంచి ఇచ్చాడు. అవివాహితుడైన శశికుమార్‌ తన మూడెకరాల్లో ఉల్లి, వరి, కంది పంటలు సాగు చేశాడు. గత ఏడాది అధిక వర్షాలకు పంట చేతికి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. ఈ ఏడాది మూడు బోర్లు వేస్తే ఒక్క బోరులో మాత్రమే నీరు పడింది. దీనికి, పంటలు సాగు చేయడానికి రూ.8లక్షల మేర అప్పు చేశాడు. అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి రావడంతో మనస్తాపానికి గురై  శశికిరణ్‌ గురువారం సాయంత్రం తన పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు.  కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  శుక్రవారం  మృతి చెందాడని హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2021-10-17T06:19:58+05:30 IST