Abn logo
Aug 4 2020 @ 11:11AM

11 మంది ఫ్రెండ్స్.. బీచ్‌లో సరదాగా గడిపి తిరిగొస్తుండగా ఘోరం..!

మరణంలోనూ వీడని స్నేహబంధం


పమిడిముక్కల (కృష్ణా) : స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సముద్ర తీరంలో ఆనందంగా గడిపి తిరిగి వస్తున్న ముగ్గురు మిత్రులను మృత్యువు కాటేసింది. తాడంకి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, మిగిలినవారు గాయాలతో బయటపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. విజయవాడలోని బీసెంట్‌ రోడ్డులో పూల డెకరేషన్‌, ఇతర వృత్తులు చేస్తున్న 11 మంది స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం మచిలీపట్నం బీచ్‌కు వెళ్లారు. రోజంతా ఆనందంగా గడిపి రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు.


తాడంకి సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో పక్కనున్న మైలురాయిని ఢీకొట్టారు. దీంతో వాహనం అదుపుతప్పి పల్టీకొట్టింది. వేగం కారణంగా డ్రైవర్‌ వాహనాన్ని కంట్రోల్‌ చేయలేకపోయాడు. ఈ ప్రమాదంలో ఆచంట అమలు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మహ్మద్‌ యూసఫ్‌, సత్యరాజు శివరాజ్‌ మచిలీపట్నం ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. వాహనం నడుపుతున్న డ్రైవర్‌ ఏసుబాబు సురక్షితంగా ఉన్నాడు. శంకర్‌ అనే యువకుడికి కాలు విరిగింది. కొల్లు సాయి, కర్రెల బాలసాయి, నాగార్జున, రిక్కా శ్రావణకుమార్‌, నారంశెట్టి సంతోష్‌, అరవింద్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు అప్పగించినట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement