మళ్లీ అలజడి

ABN , First Publish Date - 2020-09-24T06:46:10+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతాల్లో మరోసారి రక్తమోడాయి. జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఒకేరోజు రెండు

మళ్లీ అలజడి

భద్రాద్రి జిల్లాలో ఒకేరోజు రెండోచోట్ల ఎదురుకాల్పులు

చర్ల మండలంలో ముగ్గురు మావోయిస్టులు మృతి

పాల్వంచ ఘటనలో తప్పించుకున్న దళ సభ్యులు 

ఘటనా స్థలాల్లో మారణాయుధాలు, కిట్‌ బ్యాగ్‌లు స్వాధీనం 

ముమ్మరంగా స్పెషల్‌ పార్టీ బలగాల కూంబింగ్‌ 

వివరాలు వెల్లడించిన భద్రాద్రి ఎస్పీ సునీల్‌దత్‌

  

కొత్తగూడెం/చర్ల, సెప్టెంబరు 23: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతాల్లో మరోసారి రక్తమోడాయి. జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఒకేరోజు రెండు చోట్ల ఎదురు కాల్పులు జరిగాయి. చర్ల మ మండలంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. పాల్వంచ అటవీ ప్రాంతంలో జరిగిన ఘటనలో మావోయిస్టులు తప్పించుకున్నారు. ఈ ఘటనలను జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ ధ్రువీకరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం చర్ల మండలం చెన్నాపురం అటవీప్రాంతంలోని గుట్టల వద్ద బుధవారం రాత్రి 7గంటల సమయంలో భద్రాద్రి జిల్లా పోలీస్‌ బలగాలకు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.


అనంతరం సంఘటనా స్థలంలో తనిఖీ చేయగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. చనిపోయినవారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. మృతి చెందిన మావోయిస్టుల వివరాలు తెలియరాలేదు. కాల్పులు జరిగిన ప్రాంతంలో పోలీసులు ఒక 8ఎంఎం రైఫిల్‌, బ్లాస్టింగ్‌ సామగ్రి, ఒక కిట్‌బ్యాగు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎదురుకాల్పుల ఘటనలో మరి కొందరు మావోయిస్టులు తప్పించుకున్నారన్న సమాచారంతో అటవీప్రాంతంలో పోలీసు బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. 


మధ్యాహ్నం పాల్వంచ రిజర్వ్‌ ఫారెస్టులో..

పాల్వంచ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మధ్యాహ్నం 1:45నిమిషాల సమయంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టులు తప్పించుకున్నారు. ఫారెస్ట్‌ రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులకు మావోయిస్టులు తారసపడడంతో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం మావోయిస్టులు పారిపోయినట్లు ఎస్‌పీ సునీల్‌దత్‌ వివరించారు. కాల్పుల అనంతరం సంఘటనా స్థలంలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా 01ఎస్‌బీబీఎల్‌ తుపాకీతోపాటు కొన్ని కిట్‌ బ్యాగ్‌లు, సోలార్‌ చార్జింగ్‌ ప్లేట్‌తోపాటు ఇతర సామగ్రి లభించింది. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు  మల్లారం, మనుబోతులగూడెం, అటవీ ప్రాంతంలో ముమ్మరంగా గాలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. 


ముమ్మరంగా కూంబింగ్‌

ఎదురు కాల్పుల ఘటనలతో ఏజెన్సీ గ్రామాలు ఉలిక్కిపాడ్డాయి. గ్రేహౌండ్స్‌ బలగాలు, స్పెషల్‌ పార్టీ పోలీసులు కూంబింగ్‌, గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇల్లెందు, ఆళ్లపల్లి, గుండాల, కరకగూడెం, పినపాక, అశ్వాపురం, పాల్వంచ, తదితర ఏజెన్సీ ప్రాంతాల్లోని అడవులను జల్లెడ పడుతున్నారు. నెల రోజుల క్రితం గుండాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో ప్రత్యేక బలగాలు కూంబింగ్‌ నిర్వహించాయి. అప్పట్లోనూ మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగాయి. ఆ తర్వాత కొన్ని రోజులు అటవీ ప్రాంతం ప్రశాంతంగా ఉండగా మళ్లీ బుధవారం కాల్పుల మోతతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.  


మావోయిస్టులకు ఎదురుదెబ్బ 

సెప్టెంబరు 21 నుంచి 27 వరకు మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో చర్ల మండలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు దళ సభ్యులు మృతిచెందడంతో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల పూసుగుప్ప-వద్దిపేట గ్రామాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లోనూ ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ఈ రెండు ఘటనల్లో మావోయిస్టు పార్టీకి భారీగా నష్టం జరిగింది.

Updated Date - 2020-09-24T06:46:10+05:30 IST