Abn logo
Jun 16 2021 @ 03:32AM

నిత్య పెళ్లి కూతుళ్లు!

మూడు పెళ్లిళ్లు.. ఏడు మోసాలు.. మ్యాట్రిమోనీలో తప్పుడు వివరాలతో టోకరా

వివాహమయ్యాక డబ్బు, నగలతో పరార్‌

ప్రశ్నిస్తే వేధింపుల కేసులతో బెదిరింపులు

బెజవాడ శ్రీదివ్య నుంచి తిరుపతి సుహాసిని వరకూ ఇదే తంతు

యువకులు జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పెళ్లి సంబంధం కోసం వెతుకుతున్నారా? అందానికి తోడు మంచి ప్రొఫైల్‌ ఉన్న అమ్మాయి మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో కనిపించిందా? సంబంధం ఖాయం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారా? ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మ్యాట్రిమోనీ సైట్లలో ఇతరుల ఫొటోలు, నకిలీ పేర్లతో యువకులను బురిడీ కొట్టిస్తున్న కేసులు ఇటీవల ఎక్కువవుతున్నాయి. వలలో పడిన వాడిని మాయమాటలతో దోచుకోవడం లేదా, పెళ్లి చేసుకొని వేధింపుల పేరుతో కేసు పెట్టి లక్షలాది రూపాయలు గుంజడం, అదీ కుదరకుంటే ఇంట్లో ఉన్నదంతా దోచుకొని పారిపోవడం పరిపాటిగా మారింది. బెజవాడలో శ్రీదివ్య, తిరుపతిలో సుహాసిని, శ్రీకాళహస్తిలో పలు పేర్లు పెట్టుకున్న స్వప్న, గుంటూరుకు చెందిన దీప్తి, నెల్లూరు వాసి అర్చన, ప్రకాశం జిల్లా మౌనిక రెడ్డి ఇలా.. రాష్ట్రంలో మోసగత్తెల జాబితా చాంతాడంత ఉంది. ఏపీ, తెలంగాణల్లోనూ ఇలాంటి ఘటనలు ఎక్కువ అవడంతో మోసగత్తెల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మ్యాట్రిమోనీ సైట్లలోని వివరాల నుంచి సోషల్‌ మీడియాలో పరిచయస్తుల వరకూ కిలేడీలను అంత సులభంగా నమ్మవద్దని సూచిస్తున్నారు. 


ఆమెకు ఎన్‌ఆర్‌ఐలే టార్గెట్‌..

గుంటూరు జిల్లా బ్రాడీపేటకు చెందిన దీప్తి హైదరాబాద్‌లో ఉంటూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి భారత్‌ మ్యాట్రిమోనీ సైట్లో నకిలీ ఖాతాను సాయి ధన్య పేరుతో తెరిచింది. రకరకాల ఫొటోలతో ఎన్‌ఆర్‌ఐలను ఆకర్షిస్తూ పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. అమెరికాలో ఉంటున్న ధరనీ కుమార్‌ను ఇలాగే నమ్మించి తన ఖాతాలో డబ్బులు వేయించుకుని  మాయమైంది. మోసపోయానని గుర్తించిన బాధితుడు బెజవాడలోని పటమట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతంలో దీప్తి చేసిన పలు మోసాలు వెలుగులోకి వచ్చాయి. 


ఊరికో పేరుతో టోకరా

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన కిలాడీ స్వప్న ఊరికో పేరుతో యువకులను బురిడీ కొట్టించింది. హర్షిణి, కావ్య ఇలా పేర్లు మార్చి మగాళ్లను బోల్తా కొట్టించింది. మొదట మేనమామ, తర్వాత తిరుపతికి చెందిన వ్యక్తి, ఆ తర్వాత నెదర్లాండ్‌లో ఉండే కర్నూలు వాసి ఆమె మోసాలకు బలయ్యారు. పది లక్షల నుంచి పాతిక లక్షల దాకా వసూలు చేసింది. చివరికి ప్రకాశం జిల్లా దొనకొండకు చెందిన ఎన్‌ఆర్‌ఐ రామాంజినేయులు కేసు పెట్టడంతో విచారించగా, ఆమె స్నేహితురాళ్లను సైతం మోసం చేసి, వారి పేర్లతోనే చలామణి అవుతున్నట్లు తేలింది. 


నిత్యం బకరాల వేట..

విజయవాడకు చెందిన శ్రీదివ్వ ప్రేమ పేరుతో యువకులను మోసం చేస్తూ రూ.80 లక్షలు వసూలు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల బెజవాడ పోలీసులు ఆమెను అరెస్టు చేయగా, తమ్ముడి సహకారంతోనే ఆమె ఈ మోసాలకు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇదివరకే రెండు పెళ్లిళ్లు చేసుకున్న శ్రీదివ్వ నిత్యం పురుష బకరాల వేటలోనే ఉండేదని తేలింది. సోదరుడితోపాటు మరో వ్యక్తి కూడా ఆమెకు సహకరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 


పాతికేళ్లకే ఆరు పెళ్లిళ్లు..

ప్రకాశం జిల్లాకు చెందిన మౌనిక రెడ్డి పాతికేళ్లు నిండకుండానే ఆరు పెళ్లిళ్లు చేసుకుంది. కడప జిల్లాకు చెందిన శ్రీనివాస రెడ్డిని పెళ్లి చేసుకున్న రెండు నెలలు తిరక్కుండానే ఇంట్లోని డబ్బు, బంగారంతో మాయమైంది. బాధితుడు విషయాన్ని ఆమె తండ్రి అనంతరెడ్డికి చెప్పగా చాలా కూల్‌గా తీసుకున్నాడు. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా తండ్రి సహకారంతోనే ఆమె పెళ్లిళ్లు చేసుకుని, మోసాలు చేస్తోందని తేలింది.


వేధింపుల కేసులతో లక్షలు వసూలు..

గురజాలకు చెందిన అరుణ కుమారి అందంతో పురుషులకు ఎర వేయడం, సహజీవనం, తర్వాత పెళ్లి, కొన్నాళ్లకు వేధింపుల కేసు పెట్టి లక్షల్లో గుంజడం నిత్య కృత్యంగా చేసుకుంది. చివరికి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న నాలుగో భర్త నరసింహ వేణుగోపాల్‌పైనా వరకట్న వేధింపుల కేసు పెట్టింది. బాధితుడు ఆమె గత చరిత్రను తవ్వగా విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసి జైలుకు పంపాడు.  


తప్పుడు ప్రొఫైల్‌తో గాలం..

ఏడాదిన్నర క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అర్చన మోసం కేసు వీటిలో ప్రధానమైనది. నెల్లూరుకు చెందిన అర్చన హైదరాబాద్‌లో ఉంటూ విదేశాల్లో స్థిరపడిన తెలుగు యువకులకు వల వేసేంది. మ్యాట్రిమోనీ సైట్లలో అందమైన ఫొటోలు పెట్టి, తప్పుడు పేర్లతో ప్రొఫైల్‌ సృష్టించి అమెరికాలో ఉంటున్న ఎన్‌ఆర్‌ఐని బుట్టలో వేసుకుని లక్షలు గుంజింది. బాధితుడు అనుమానం వచ్చి ఆరా తీయగా, మ్యాట్రిమోనీలో ఏదో ఒక ఫొటోతో తప్పుడు పేర్లతో వివరాలు పెట్టి సంపన్న యువకులకు గాలం వేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. పంజాగుట్ట పోలీసులు ఎట్టకేలకు ఆమెను అరెస్టు చేసి విచారిస్తే అప్పటికే రెండు సార్లు జైలుకు వెళ్లొచ్చిన విషయం తేలింది. 


అనాథనంటూ లక్షలు పిండేసింది..

ఇక తిరుపతిలోని ఓ ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేసే సుహాసిని ప్రేమ పేరుతో యువకుడిని వలలో వేసుకుంది. గతంలోనే ఇద్దరిని పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లల్ని కని వదిలేసింది. మార్కెటింగ్‌ ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడికి ప్రేమ గాలం వేసి, తాను అనాథనని నమ్మించింది. దీంతో ఆ యువకుడు గతేడాది డిసెంబరులో కుటుంబసభ్యులను ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అనాథగా ఉన్న తనను ఆదుకున్న వారి రుణం తీర్చుకోవాలంటూ భర్త నుంచి నాలుగు లక్షలు పిండేసిన ఆమె మామ నుంచి కూడా మరో రెండు లక్షలు తీసుకుంది. విషయం తెలిసిన భర్త ఇదేంటని నిలదీయడంతో పెళ్లికి చేయించిన నగలతో పరారైంది.  ఆధార్‌ కార్డు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా, ఆమెకు గతంలోనే రెండు పెళ్లిళ్లయిన విషయం వెలుగులోకి వచ్చింది.   రెండో భర్త వినయ్‌ నుంచి కూడా రూ.15 లక్షలు కాజేసి నగలతో వెళ్లిపోయింది. ఆమెకు మొదటి భర్త వెంకటేశ్వర్లు సహకరిస్తున్నారని వినయ్‌ పోలీసులకు తెలిపారు.