భారత్‌లో ఆశ్రయం కోరిన మయన్మార్ పోలీసులు!

ABN , First Publish Date - 2021-03-04T22:38:00+05:30 IST

మయన్మార్‌కు చెందిన ముగ్గురు పోలీసు అధికారులు భారత్‌లో

భారత్‌లో ఆశ్రయం కోరిన మయన్మార్ పోలీసులు!

న్యూఢిల్లీ : మయన్మార్‌కు చెందిన ముగ్గురు పోలీసు అధికారులు భారత్‌లో ఆశ్రయం కోరారు. సైనిక ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయవలసిన పరిస్థితులను తప్పించుకోవడానికి వీరు మన దేశానికి వచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి ఏర్పడిన సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో కొందరు పోలీసులు కూడా పాల్గొంటున్నట్లు సోషల్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే పోలీసులు దేశం విడిచి పారిపోయిన సంఘటన బయటపడటం ఇదే తొలిసారి. 


ఈ ముగ్గురు మయన్మార్ పోలీసు అధికారులు మిజోరాంలోని సెర్చిప్ జిల్లాలో బుధవారం ప్రవేశించినట్లు జిల్లా పోలీసు అధికారులు గురువారం వెల్లడించారు. నార్త్ వన్‌లాఫాయ్‌ పట్టణంలో వీరు ప్రవేశించారని, వీరికి వైద్య పరీక్షలు చేయించామని తెలిపారు. తమకు సైనిక పాలకులు జారీ చేసిన ఆదేశాలను తాము అమలు చేయలేమని, అందుకే దేశం నుంచి పారిపోయి వచ్చామని మయన్మార్ పోలీసు అధికారులు చెప్పినట్లు తెలిపారు. మయన్మార్‌లో సైనిక పాలన సాగుతుండటంతో తమకు ఆశ్రయం ఇవ్వాలని కోరుతున్నారని చెప్పారు. 


ప్రజాస్వామిక ప్రభుత్వం కూల్చివేత

గత ఏడాది నవంబరులో జరిగిన ఎన్నికల్లో అంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ ఎన్నికలు మోసపూరితంగా జరిగాయని సైన్యం ఆరోపించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఈ ప్రభుత్వాన్ని సైన్యం కూల్చేసింది. అంగ్‌సాన్ సూకీని అరెస్టు చేసి, నిర్బంధించింది. దీంతో మయన్మార్‌ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసనలను సైనిక ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తోంది. ఇప్పటి వరకు 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 


మన దేశంలో ఇప్పటికే మయన్మార్ శరణార్థులు వేలాది మంది ఉన్నారు. సహజసిద్ధ స్థానికులైన చిన్ జాతివారు, రొహింగ్యాలు మన దేశానికి వచ్చారు. గతంలో జరిగిన హింసాకాండ నేపథ్యంలో వీరు తమ దేశాన్ని విడిచి, మన దేశంలో ఆశ్రయం పొందుతున్నారు.


Updated Date - 2021-03-04T22:38:00+05:30 IST