3 నెలల్లో 10 లక్ష్యాలు

ABN , First Publish Date - 2022-01-23T07:24:23+05:30 IST

నవ భారత నిర్మాణం అనే స్వప్నం గ్రామాలు, జిల్లాల నుంచే సాకారమవు తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పోషకాహార లోపం, ఆకలి చావులకు వ్యతిరేకంగా పోరాడడంతో జిల్లా కలెక్టర్లు పోటీ పడాలన్నారు...

3 నెలల్లో 10 లక్ష్యాలు

జిల్లాల్లో అభివృద్ధి పనులకు రెండేళ్ల విజన్‌

జిల్లాకు 10 పనులు.. 3 నెలల్లో పూర్తి చేయాలి

నవభారత నిర్మాణం గ్రామాల నుంచే! 

ప్రజల జీవన సౌలభ్యాలు పెరగాలి

అన్ని ఊర్లకు రోడ్లు, అర్హులకు పక్కా ఇళ్లు.. 

అందరికీ బీమా, ఆయుష్మాన్‌ కార్డులు ఉండాలి

జిల్లా కలెక్టర్లకు ప్రధాని మోదీ సూచన

కలెక్టర్లు, పలువురు సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌


న్యూఢిల్లీ, జనవరి 22: నవ భారత నిర్మాణం అనే స్వప్నం గ్రామాలు, జిల్లాల నుంచే సాకారమవు తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పోషకాహార లోపం, ఆకలి చావులకు వ్యతిరేకంగా పోరాడడంతో జిల్లా కలెక్టర్లు పోటీ  పడాలన్నారు. ప్రజల జీవన సౌలభ్యాలను పెంచడంలో నిర్ణీత సమయాన్ని నిర్దేశించుకొని పనిచేయాలని సూచించారు. ప్రజలకు సంతృప్తికర స్థాయి సేవలు, సౌకర్యాలు అందించడంలో పరిపూర్ణత సాధించాలనే లక్ష్యాన్ని మనదేశం నిర్దేశించుకుందని, ఈ దిశగా మనంసాధించింది కొంతేనని, ఇదో సుదీర్ఘ ప్రయాణమని చెప్పారు. ఇందులో భాగంగా దేశంలోని అన్ని గ్రామాలకు రహదారుల నిర్మాణం జరగాలని, అర్హులైన వారికి పక్కా ఇళ్లు, ప్రతి పౌరుడికి బీమా, ఆయుష్మాన్‌ కార్డులు, బ్యాంకు అకౌంట్లు, ప్రతి ఇంటికి వంట గ్యాస్‌ కనెక్షన్లు ఉండాలని ఆకాంక్షించారు.


మోదీ శనివారం దేశవ్యాప్తంగా విభిన్న జిల్లాలకు చెందిన కలెక్టర్లు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియోకన్ఫరెన్స్‌ నిర్వహించారు. పలు ప్రభుత్వ పథకాల అమలు, వివిధ కార్యక్రమాల్లో అభివృద్ధి... వాటి స్థితిగతులపై ఫీడ్‌బ్యాక్‌ తెలుసుకునేందుకు దీన్ని నిర్వహించారు.  స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ల సందర్భాన్ని ‘ఆజాదీకి అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట జరుపుకొంటున్న వేళ జిల్లా కలెక్టర్లు నూతన లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో రెండేళ్ల విజన్‌తో అభివృద్ధి పనులు జరగాలని సూచించారు. ఈ మేరకు ప్రతి జిల్లా కూడా తమ పరిధిలో 10 పనులను గుర్తించి.. వాటిని వచ్చే మూడు నెలల్లో పూర్తి చేసుకోవాలన్నారు. ఫలితంగా ప్రజల జీవన సౌలభ్యాలు పెరుగుతాయని వివరించారు. డిజిటల్‌ మౌలికసదుపాయాల ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతూ.. ఈ సేవలు ప్రతి గ్రామానికి చేరాలని.. అప్పుడు ప్రతి ముంగిట్లోకి సౌకర్యాలు, సేవలు చేరతాయని వివరించారు. అధికారులు, ప్రజల మధ్య ప్రత్యక్ష, భావావేశపూరిత సంబంధాలను ఉండాలని, పాలనలో ఉన్నత స్థాయి నుంచి కిందిస్థాయి వరకు, కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయివరకు దీన్ని పాటించాని చెప్పారు.


రాష్ట్రస్థాయి, స్థానిక పాలనా వ్యవహారాల్లో బృంద స్ఫూర్తి (టీమ్‌ వర్క్‌)తో పనిచేస్తూ మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. మానవాభివృద్ధి సూచీ ర్యాంకులో పెరుగుదల, పౌరుల జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు, చేపట్టేందుకుగాను 2018లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన 112 జిల్లాలను ఎంపిక చేసింది. వీటిని అత్యంత వేగంగా ఆకాంక్షిత జిల్లాలు (యాస్పిరేషనల్‌ డిస్ట్రిక్స్‌)గా మార్చేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ జిల్లాలు, దేశాభివృద్ధి బాటలో ఉన్న అడ్డంకులను అధిగమిస్తున్నాయని, ఇదంతా  ఆ జిల్లాల కలెక్టర్ల కృషి ఫలితమేనని కొనియాడారు. నిర్దేశించిన విజయ లక్ష్యాన్ని ఆకాంక్షిత జిల్లాలు చేరుకున్నాయని, ఇది చరిత్రాత్మక సందర్భమని, మరిన్ని లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆ జిల్లాల కలెక్టర్లతో మోదీ అన్నారు. వనరుల వినియోగంలో ఆచరణ, ఆదర్శంతో ప్రతిబంధకాలను అధిగమించడం ద్వారా ఈ జిల్లాల కలెక్టర్లు సమిష్టి శక్తిని చాటారని ప్రశంసించారు.


ఈ స్ఫూర్తి ఆకాంక్షిత జిల్లాల్లో  ఇక ముందూ కొనసాగాలని ఆకాంక్షించారు. ఆకాంక్షిత జిల్లాల్లో గత నాలుగేళ్లలో జన్‌ధన్‌ ఖాతాలు 4-5 రెట్లు పెరిగాయని, ఈ జిల్లాల్లోని దాదాపు అన్ని ఇళ్లకు మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని, ఈ జిల్లాల్లోని దాదాపు అన్ని గ్రామాలకు విద్యుత్తు సౌకర్యం ఏర్పడిందని.. ఫలితంగా అక్కడి ప్రజల్లో సరికొత్త శక్తి వచ్చిందని పేర్కొన్నారు. కాగా దేశవ్యాప్తంగా 142 జిల్లాలు అభివృద్ధి పరంగా అంతగా వెనుకబడలేదని, అయితే ఒకట్రెండు అంశాల్లో బలహీనంగా ఉన్నాయని పలువురు మంత్రులు, సంబంధిత శాఖలకు చెందిన అధికారులు ఓ జాబితా రూపొందించారని వెల్లడించారు. కాగా ఈ సందర్భంగా నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌.. యాస్ఫిరేషనల్‌ జిల్లాల్లో అమలవుతున్న అభివృద్ధి పనులను ప్రధానికి వివరించారు. వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేసే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ప్రధాని మంత్రి కార్యాలయం పేర్కొంది. ఈ సమావేశంలో గుజరాత్‌, ఛత్తీ్‌సగఢ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T07:24:23+05:30 IST