మరో మూడు అర్బన్‌ పార్కులు

ABN , First Publish Date - 2021-01-10T05:21:29+05:30 IST

మెదక్‌ జిల్లాలో మరో మూడు అర్బన్‌ పార్కులను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం మండల పరిధిలోని పోచారం పార్కు వద్ద నిర్మించిన ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.

మరో మూడు అర్బన్‌ పార్కులు
మూషిక జింకలను పోచారం అడవిలో విడుదల చేస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, పీసీసీఎఫ్‌ శోభారాణి

మనోహరాబాద్‌, పరికిబండ, వడియారంలో ఏర్పాటు

ఉమ్మడి జిల్లాలో మొత్తం 11 అర్బన్‌ పార్కులు

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు


హవేళీఘణపూర్‌, జనవరి 9 : మెదక్‌ జిల్లాలో మరో మూడు అర్బన్‌ పార్కులను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం మండల పరిధిలోని పోచారం పార్కు వద్ద నిర్మించిన ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మొత్తం 11 అర్బన్‌ ఫారెస్టు పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతేడాది నర్సాపూర్‌లో ఒకటి సీఎం ప్రారంభించారని గుర్తుచేశారు. మెదక్‌ జిల్లాలో అటవీశాఖ పరిధిలో మనోహరాబాద్‌, పరికిబండ, వడియారంలో పార్కులు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. పర్యావరణం, అడవులు, జంతువులపై పిల్లలకు  అవగాహన కల్పించేందుకు ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌ ఉపయోగపడుతుందని చెప్పారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 58 వేల హెక్టార్ల అటవీభూమి ఉండగా 29 వేల ఎకరాలను ఇప్పటికా అటవీపునరుద్ధరణ కింద అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది మరో 8 వేల హెక్టార్లు పూర్తవుతుందని తెలిపారు. అరుదైన జాతి అయిన మూషిక జింకలను పోచారం అభయారణ్యంలో విడుదల చేశామని తెలిపారు. జంగల్‌ బచావో, జంగల్‌ బడావో నినాదంతో అడవిని కాపాడుకోవడం అందరి కర్తవ్యమన్నారు. అనంతరం హవేళీఘణపూర్‌లో 99 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్‌ శోభారాణి, సీసీఎఫ్‌ శర్వణన్‌, జడ్పీటీసీ సుజాత, ఎంపీపీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


రైతు వేదికలతో అన్నదాతలు సంఘటితం

చిన్నశంకరంపేట, జనవరి 9 : రాష్ట్రంలో అన్ని కులాలకు, వర్గాలకు సంఘాలు ఉన్నాయని కానీ అన్నదాతలకు మాత్రం లేవని, వారిని సంఘటితం చేసేందుకే రైతు వేదికలను నిర్మించామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు గవ్వలపల్లి గ్రామంలోని రైతు వేదిక భవనాలను, కామారం, మీర్జాపల్లి గ్రామాల్లోని డబుల్‌ బెడ్రూం ఇళ్లను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతులు కాడెడ్ల బండిపై మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిని చిన్నశంకరంపేట బస్టాండ్‌ నుంచి రైతు వేదిక వరకు ర్యాలీగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మెదక్‌ నియోజకర్గానికి వచ్చే రోహిణి కార్తె వరకు కాళేశ్వరం నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో అన్నదాతలు రెండు పంటలు పండించుకోవచ్చని తెలిపారు. నియోజకవర్గంలో 74,671 మంది రైతులకు రూ.63.25 కోట్లను పెట్టుబడి సాయం కింద అందిచామని చెప్పారు. రాష్ట్రంలో గూడు లేని పేదలకు అన్ని వసతులతో కూడిన ఇళ్లును నిర్మించి ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. సాంకేతిక లోపంతో పింఛన్లను కోల్పోయిన వారి సమస్యను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకురాగా 400 మంది బీడీ కార్మికులకు పింఛన్‌ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. చిన్నశంకరంపేట నుంచి నార్సింగి మండలానికి వెళ్లే రహదారి పనులు కొనసాగుతుండగా డబుల్‌ రోడ్డుగా విస్తరించాలని కోరడంతో రూ.11 కోట్లను మంజూరు చేసినట్లు మంత్రి ప్రకటించారు. 

 మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్గీకి చెందిన చిన్నశంకరంపేట సర్పంచ్‌ రాజిరెడ్డి, మాజీ సర్పంచ్‌ ఎడ్ల కిష్టయ్య, ఉపసర్పంచ్‌ జీవన్‌, ఏఎంసీ చైర్మన్‌ రాధాకిషన్‌, మాలుపల్లి సర్పంచ్‌ చిటుకుల లక్ష్మి, సంకాపూర్‌ సర్పంచ్‌ సుజాత వార్డు సభ్యులు టీఆర్‌ఎ్‌సలో చేరారు.



అన్ని రంగాల్లో మెదక్‌ జిల్లా అభివృద్ధికి సహకారం 

మెదక్‌ మున్సిపాలిటీ, జనవరి 9 : అన్ని రంగాల్లో మెదక్‌ జిల్లా అభివృద్ధికి సహకారం అందిస్తానని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మెదక్‌ పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి శనివారం కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పటికీ పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఏలోటు రానివ్వలేదని పేర్కొన్నారు. స్థలం కలిగి ఉన్నవారికి ఉగాది తర్వాత డబుల్‌బెడ్రూమ్‌ ఇల్లు కట్టించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పట్టణ శివారులో నిర్మిస్తున్న వెయ్యి డబుల్‌బెడ్రూమ్‌ నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయిస్తామని చెప్పారు. అదేవిధంగా మెదక్‌-అక్కన్నపేట రైల్వేలైన్‌ పనులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.20 కోట్లను విడుదల చేశామని తెలిపారు. అనంతరం 86 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. 


‘భగీరథ’ను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలి

మెదక్‌ రూరల్‌, జనవరి 9 : మెదక్‌ పట్టణంలో మిషన్‌ భగీరథ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో పట్టణ ప్రగతి, మిషన్‌ భగీరథ, కొత్త కలెక్టరేట్‌ నిర్మాణం, పరిశ్రమల స్థాపన, వాటి భూసేకరణ, కాళేశ్వరం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాల్వ, దాని భూసేకరణ అంశాలపై మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదక్‌ పట్టణంలో వార్డు ఇన్‌చార్జి, అధికారులు వార్డువారీగా మ్యాప్‌ రూపొందించి పది రోజులు ఇంటింటికి తిరిగి పైపులైన్‌  వేసారా.. కుళాయికనెక్షన్‌ ఇచ్చారా.. నీళ్లు వస్తున్నాయా వంటి సమగ్ర వివరాలు తెలపాల ఆదేశించారు. తూప్రాన్‌ మున్సిపాలిటీలో డంపుయార్డు, మున్సిపల్‌ భవన నిర్మాణం, విద్యుత్‌స్తంభాల ఏర్పాటు, మార్కెట్‌యార్డు, డబుల్‌ బెడ్రూం పనులను వేగవంతం చేయాలని ఆదే శించారు. రామాయంపేట మున్సిపాలిటీలో నీటి ఇబ్బంది లేకుండా అన్నిచర్యలు చేపట్టాలన్నారు. నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్‌ భవనాన్ని మే మాసంలో ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. కాళెశ్వరం ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాల్వల కోసం భూసేకరణ చేపట్టాలన్నారు. అదేవిధంగా జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పేందుకు భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-10T05:21:29+05:30 IST