Abn logo
Jun 14 2021 @ 13:33PM

హైదరాబాద్ : వారం రోజుల్లో మూడు హత్యలు

  • సీపీ వీడియో ద్వారా సమీక్ష
  • రౌడీలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు

హైదరాబాద్‌ సిటీ : వారం వ్యవధిలో పాతబస్తీలో మూడు హత్యలు జరిగాయి. హత్యకు గురైన ముగ్గురూ 25 ఏళ్లలోపు ఉన్న వారే. హత్య చేసిన వారు ప్రొఫెషనల్‌ క్రిమినల్స్‌, రౌడీషీటర్లు కూడా కాదు. చిన్న చిన్న కారణాలకే ఈ హత్యలు జరిగాయి. మూడు హత్య కేసుల్లో పాల్గొన్న నిందితులలో ఇద్దరు మైనర్‌లు  ఉండటం గమనార్హం. నేరాలు తగ్గుతున్నాయని భావిస్తున్న తరుణంలో ఏకంగా హత్యలే జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీపీ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు పాతబస్తీపై దృష్టి సారించారు. 


ఈ నెల 6న ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో షారుక్‌ అనే యువకుడిని అతని మామ (రెండో భార్య తండ్రి) హత్య చేశాడు. తన కూతురికి మాయమాటలు చెప్పి, పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో అతని ద్విచక్రవాహనంపైనే కూర్చుని వెనుక నుంచి పొడిచి చంపేశాడు. మధ్యాహ్నం లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేసేందుకు పోలీసులు  సిద్ధమవుతున్న సమయంలో ఇంజన్‌బౌలి పోలీసుల చెక్‌పోస్టుకు 100 మీటర్ల దూరంలో ఈ హత్య జరిగింది. అదేరోజు రాత్రి డబీర్‌పురా పీఎస్‌ పరిధిలో 20ఏళ్ల లోపు యువకుల మధ్య జరిగిన స్ట్రీట్‌ ఫైట్‌లో ఇరువర్గాలు చేతులతోనే కొట్టుకున్నాయి. ఈ ఘటనలో అద్నాన్‌ (19) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. పగ, ప్రతీకారం లేకున్నా, చిన్నపాటి వివాదానికి యువకుడు బలయ్యాడు. ఇద్దరు మైనర్లతో సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం మరో హత్య జరిగింది. హుసేనీఆలం పోలీస్‌స్టేషన్‌ పరిఽధిలో ఖిల్వత్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ జుబేర్‌ అలీ (23) హత్యకు గురయ్యాడు. స్నేహితులను కలిసేందుకు శాలిబండకు వచ్చిన అతను దారుణంగా హత్యకు గురయ్యాడు. జుబేర్‌ అలీని స్నేహితులే హత్య చేసి ఉంటారని భావించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 


పోలీసులు అలర్ట్‌

వారం రోజుల వ్యవధిలో మూడు హత్యలు జరగడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు.  మూడు రోజుల క్రితం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సౌత్‌జోన్‌ డీసీపీ, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్‌లతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించారు. పాతబస్తీలో నేరాలపై సమీక్షించారు. ఏసీపీలు సైతం తమ పరిఽధుల్లో ఉన్న రౌడీ షీటర్లను పిలిచి, కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఇక ఇన్‌స్పెక్టర్లు తమ పరిఽధుల్లో విజిబుల్‌ పోలీసింగ్‌ పెంచేందుకు కృషి చేస్తున్నారు.