మరో ముగ్గురికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-05-29T11:24:35+05:30 IST

జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో కువైత్‌, వలస కూలీల రూపంలో

మరో ముగ్గురికి పాజిటివ్‌

వారిలో ఇద్దరు కువైత్‌, చెన్నై నుంచి వచ్చిన వారు

ప్రొద్దుటూరుకు చెందిన మరొకరికి పాజిటివ్‌

జిల్లాలో 130కి చేరిన కరోనా బాధితులు

ముగ్గురు డిశ్చార్జ్‌


కడప, మే 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో కువైత్‌, వలస కూలీల రూపంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. గురువారం మరో ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కువైత్‌ నుంచి జిల్లాకు వచ్చిన ప్రవాసాంధ్రుల్లో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. చెన్నై నుంచి జిల్లాకు వచ్చిన మరో వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. ఈ ఇద్దరు కూడా క్వారంటైన్‌లో ఉంటూ పరీక్షలు చేయగా పాజిటివ్‌ రావడంతో చికిత్స కోసం కడప ఫాతిమా మెడికల్‌ కాలేజీ కోవిడ్‌-19 జిల్లా ఆసుపత్రికి తరలించారు.


ప్రొద్దుటూరుకు చెందిన కూరగాయల వ్యాపారి ఒకరికి పాజిటివ్‌ రావడంతో పట్టణంలో కలకలం రేగింది. ఈ మూడు కేసులతో కలిపి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 130కి చేరింది. గత ఐదారురోజులుగా కువైత్‌, వలస కూలీలు తప్ప జిల్లాలో ఉన్న వారికి కరోనా పాజిటివ్‌ రాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకోగా.. ప్రొద్దుటూరులో డోర్‌ డె లివరీ చేస్తున్న కూరగాయల వ్యాపారికి పాజిటివ్‌ రావడంతో అఽధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే మేలుకుని పాజిటివ్‌ బాధితుడి ప్రైమరీ కాంటాక్ట్సు గుర్తించడంలో నిమగ్నమయ్యారు.


ముగ్గురు డిశ్చార్జ్‌

కడప ఫాతిమా మెడికల్‌ కాలేజీ కోవిడ్‌-19 జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కడపకు చెందిన ఒకరు, సంబేపల్లె మండలానికి చెందిన ఒకరు, జమ్మలమడుగు మండలం గండికోటకు చెందిన ఒకరు కోవిడ్‌-19 ఆస్పత్రి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. వీరికి కోవిడ్‌-19 నిబంధనల ప్రకారం ఒక్కొక్కరికి రూ.2 వేలు అందజేశారు. బుధవారం కూడా నలుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. వీరితో కలిపితే జిల్లాలో కోలుకున్న వారి సంఖ్య 102కు చేరింది.


స్వచ్ఛందంగా కరోనా టెస్టులు చేయించుకోవాలి..సి.హరికిరణ్‌, కలెక్టర్‌, కడప

ప్రొద్దుటూరులో కూరగాయలు డోర్‌ డెలివరీ చేస్తున్న వ్యాపారి ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆ పట్టణంలో నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలు, ఇతర వస్తువులు డోర్‌ డెలివరీ చేస్తున్న చిరు వ్యాపారులు స్వచ్ఛందంగా కరోనా టెస్టులు చేయించుకోవాలి. అంతేకాకుండా పాజిటివ్‌ వచ్చిన వ్యాపారితో సన్నిహితంగా మెలిగిన వారు కరోనా టెస్టులు చేయించుకుని సహకరించాలి. డోరు డెలివరీ వ్యాపారులందరికీ కరోనా శ్వాబ్‌ టెస్టు చేయించే బాధ్యతలను మున్సిపల్‌ కమిషనరు చూస్తారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.


కరోనా పరీక్షల్లో రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్నాం. ఇప్పటికే 30 వేల మందికి పైగా కరోనా టెస్టులు చేస్తే 29,625 రిజల్ట్స్‌ వచ్చాయి. అందులో 29,495 నెగటివ్‌ రాగా, 130 మందికి మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. అందులో 102 మంది కరోనాను జయించి ఇంటికి చేరుకున్నారు. జిల్లాలో కోవిడ్‌-19 నిబంధనల ప్రకారం కొన్ని సడలింపులు ఉన్నా కంటైన్మెంటు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అంక్షలు యదావిధిగా కొనసాగుతాయి.

Updated Date - 2020-05-29T11:24:35+05:30 IST