ముగ్గురిని బలిగొన్న ట్రాక్టర్‌

ABN , First Publish Date - 2020-12-03T05:48:12+05:30 IST

కూలి పనులకు వెళ్లి పొట్ట పోసుకునే పేద కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది.

ముగ్గురిని బలిగొన్న ట్రాక్టర్‌
రోదిస్తున్న కుటుంబ సభ్యులు

  1. అన్నా చెల్లెళ్లు వెళుతున్న బైక్‌ను ఢీ కొట్టిన వైనం
  2. బ్రాహ్మణదొడ్డికి చెందిన అన్న, ఇద్దరు చెల్లెళ్లు మృతి
  3. కానాలలో పత్తి పొలం పనికి వెళుతుండగా ప్రమాదం
  4. సీసీ ఫుటేజీ ద్వారా ట్రాక్టర్‌ను గుర్తించిన పోలీసులు


గూడూరు/సి.బెళగల్‌, డిసెంబరు 2: కూలి పనులకు వెళ్లి పొట్ట పోసుకునే పేద కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. వేకువజామునే లేచి.. ఇద్దరు చెల్లెళ్లతో కలిసి బైక్‌పై పత్తి పొలంలో పనులకు వెళుతుండగా ముగ్గురినీ మృత్యువు కబళించింది. ట్రాక్టర్‌ రూపంలో దూసుకువచ్చి.. వీరి బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీ బెళగల్‌ మండలం బ్రాహ్మణదొడ్డి గ్రామానికి చెందిన బాలకృష్ణ (28), అతని చెల్లెళ్లు గజ్జలమ్మ (23), జానకమ్మ (16) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం గూడూరు సమీపంలోని దాల్‌మిల్‌ వద్ద బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో చోటు చేసుకుంది. 


రోడ్డుపై బైఠాయించిన బంధువులు

ప్రమాద స్థలంలో బైకు, మృత దేహాలు తప్ప వేరే వాహనం కనిపించలేదు. దీంతో పోలీసులు గుర్తించేపనిని ప్రారంభించారు. ఈ లోగా అక్కడికి చేరుకున్న మృతుల కుటుంబీకులు, బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించాలని, బాధ్యులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఉదయం 10 గంటల వరకు ప్రమాద స్థలంలో ఆందోళన చేపట్టారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కోడుమూరు సీఐ పార్థసారథిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో చర్చించారు. ప్రమాదానికి కారకులను గుర్తించి అరెస్టు చేస్తామని చెప్పినా వారు శాంతించలేదు. చివరకు కుల సంఘాల నాయకులు, పెద్దలతో పోలీసులు చర్చించారు. మరోసారి మృతుల బంధువులతో మాట్లాడారు. దీంతో వారు ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాలను కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


పని దొరికిందని..

సి.బెళగల్‌ మండలం బ్రాహ్మణ దొడ్డి గ్రామానికి చెందిన బాలకృష్ణ, గజ్జలమ్మ, జానకమ్మ రోజూ కలిసి కూలి పనులకు వెళతారు. గూడూరు మండలం ఆర్‌.కానాపురం గ్రామంలో పత్తి పొలంలో కూలి పనులు ఉండ టంతో ముగ్గురూ కలిసి తెల్లవారు జామునే బైక్‌పై బయలుదేరారు. గూడూరు సమీపంలో దాల్‌మిల్‌ వద్దకు రాగానే ఓ ట్రాక్టర్‌ వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నాగార్జున సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 


సీసీ ఫుటేజీ ద్వారా..

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతికి కారణమైన ట్రాక్టర్‌ను సీసీ ఫుటేజీ ఆధారంగా బుధవారం మధ్యాహ్నానికి పోలీసులు గుర్తించారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ మద్దిలేటిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని ఎస్‌ఐ నాగార్జున తెలిపారు. ప్రమదంలో మరణించిన బాలకృష్ణకు భార్య రామలింగమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. గజ్జల మ్మకు వివాహమైంది. జానకమ్మకు ఇటీవలే నిశ్చితార్థం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాద స్థలంలో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. ఆ ప్రాంతంలో తీవ్ర విషాద వాతావరణం కనిపించింది. 



Updated Date - 2020-12-03T05:48:12+05:30 IST