కరోనా సోకిన మహిళకు వైద్యం.. ముగ్గురు ప్రైవేట్ వైద్యులపై వేటు.. మూడు ఆస్పత్రులు సీజ్‌

ABN , First Publish Date - 2020-04-05T16:38:10+05:30 IST

రంగారెడ్డి జిల్లాలో కరోనా సోకి 55 ఏళ్ల మహిళ మృతి చెందిన ఘటనకు సంబంధించి ముగ్గురు ప్రైయివేటు వైద్యులపై అధికారులు కేసులు నమోదు చేశారు

కరోనా సోకిన మహిళకు వైద్యం.. ముగ్గురు ప్రైవేట్ వైద్యులపై వేటు.. మూడు ఆస్పత్రులు సీజ్‌

వైద్యులపై కేసు నమోదు 

కరోనా సోకి మహిళ మృతితో చర్యలు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : రంగారెడ్డి జిల్లాలో కరోనా సోకి 55 ఏళ్ల మహిళ మృతి చెందిన ఘటనకు సంబంధించి ముగ్గురు  ప్రైయివేటు వైద్యులపై అధికారులు కేసులు నమోదు చేశారు. అలాగే వారు నిర్వహించే ఆసుపత్రులను అధికారులు సీజ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూర్‌లో కరోనాతో మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి చెందిన తరువాత కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో అధికార యంత్రాంగం, ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆగమేఘాలపై గ్రామంలో ప్రజలను, మృతురాలి బంధువులను క్వారంటైన్‌కు తరలించారు. అలాగే  మృతురాలికి ప్రాథమిక వైద్యం చేసిన ప్రైవేటు డాక్టర్లను గుర్తించారు. కరోనా లక్షణాలు ఉన్న ఆమెకు నిబంధనలకు విరుద్ధంగా చికిత్స అందించినందుకు వారిపై చర్యలు తీసుకున్నారు. దీనిపై డిప్యూటీ డీఎంఅండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ చందునాయక్‌ మాట్లాడుతూ చేగూరు గ్రామానికి చెందిన మహిళ తీవ్ర అనారోగ్యంతో మొదట గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యుడు ప్రతాప్‌రెడ్డి వద్ద ప్రాథమిక చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. 


ఆ తరువాత ఆరోగ్యం బాగు పడకపోవడంతో నందిగామ పోలీస్‌ అనుమతితో షాద్‌నగర్‌కు వైద్యం కోసం వచ్చి స్థానిక కేశంపేట చౌరస్తాలో  ఉన్న శ్రీనివాస దంత వైద్యశాలలో ఉండే ఆర్‌ఎంపీ వైద్యుడు విఠల్‌ వద్దకు వెళ్లారని అయితే డాక్టర్‌  ఆమెకు కరోనా లక్షణాలు గుర్తించకుండా చికిత్సచేశారని తెలిపారు. తరువాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మహబూబ్‌నగర్‌ పట్టణంలోని అనిల్‌ సర్జికల్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ డాక్టర్‌ అనిల్‌ ఆమెకు నిబంధనలకు విరు ద్ధంగా ట్రీట్‌మెంట్‌ చేసినట్లు డీఎంఅండ్‌ హెచ్‌వో తెలిపారు. మృతురాలు డయాబెటీస్‌ రోగి కావడంతో  ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో  ఆమెను డాక్టర్‌ అనిల్‌ పాలమూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఉస్మానియాకు రిఫర్‌ చేశారు. అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో తీవ్ర గొంతునొప్పి జర్వం ఎక్కువై మహిళ మృతి చెందినట్టు వైద్యులు దృవీకరించారని చందునాయక్‌ తెలిపారు. 


ఆ తర్వాత వైద్య పరీక్షల రిపోర్టు రావడంతో ఆమెకు  కరోనా పాజిటివ్‌ అని తేలిందని దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్త మైందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు వైద్యం చేసిన షాద్‌నగర్ వైద్యుడు  విఠల్‌, చేగూరు వైద్యుడు ప్రతా్‌పరెడ్డి, మహబూబ్‌నగర్‌ డాక్టర్‌ అనిల్‌లపై వైద్యశాఖ ఫిర్యాదు మేరకు షాద్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ ముగ్గురిని హైదరాబాద్‌ క్వారంటైన్‌కు తరలించినట్లు తెలిపారు. అదే విధంగా వీరు నిర్వహిస్తున్న ఆసుపత్రులను కూడా సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఆసుపత్రులపై ఒక డాక్టర్‌ పేరు ఉండి మరొకరు వైద్యం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అదే విధంగా మెడికల్‌ షాపులో వైద్యం చేయడం కూడా నేరమని తెలిపారు. వీరందరిపై చట్టరిత్యా చర్య తీసుకుంటామన్నారు. ఆర్‌ఎంపీ వైద్యులు ఎలాంటి పరిజ్ఞానం లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించమని చర్యలు తీసుకుంటామని షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ హెచ్చరించారు. వైద్య, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో అర్హతలేని వైద్యులను గుర్తిస్తామన్నారు. కరోనా పేరిట సొంత వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - 2020-04-05T16:38:10+05:30 IST