Abn logo
Sep 27 2021 @ 23:19PM

ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న ఎస్పీ

10 దుంగలు, 3 వాహనాలు, 6 వేటకొడవళ్లు స్వాధీనం 

పరారీలో మరో ముగ్గురు  : వివరాలు వెల్లడించిన ఎస్పీ అన్బురాజన్‌

కడప(క్రైం), సెప్టెంబరు 27 : ప్రొద్దుటూరు మండలం మడూరు క్రాస్‌ వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌, ఓఎ్‌సడీ దేవప్రసాద్‌, ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాద్‌రావు, సీఐ మధుసూదన్‌గౌడ్‌లు సోమవారం విలేకరు సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు తమకు సమాచారం రావడంతో ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు రూరల్‌ సీఐ మధుసూదన్‌గౌడ్‌, ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి వాహనాలు తనిఖీ చేస్తుండగా స్మగ్లర్లు తప్పించుకోడానికి రాళ్లు, కట్టెలతో దాడి చేసి పారిపోతుండగా ముగ్గురిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారయ్యారని తెలిపారు. చాపాడు మండలం ఖాదర్‌పల్లి గ్రామానికి చెందిన సింపతి చాంద్‌బాష, అదే గ్రామానికి చెందిన సింపతి షంషీర్‌, పెద్దముడియం మండలం గంగాళపల్లె గ్రామానికి చెందిన బూచుపల్లి మహబూబ్‌బాషలు ఎర్రచందనం దుంగలను మూడు వాహనాల్లో తరలిస్తుండగా ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 258 కేజీల బరువు ఉన్న 10 ఎర్రచందనం దుంగలు, 6 వేటకొడవళ్లు, 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారైన మరో ముగ్గరు స్మగ్లర్ల కోసం ప్రత్యేక టీమ్‌లతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పరారైన పట్టుబడిన స్మగ్లర్లపై కడప, కర్నూలు, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లోని వివిధ పోలీ్‌సస్టేషన్లలో ఎర్రచందనం కేసులు ఉన్నాయని వీరిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సింపతి చాంద్‌బాషతో పాటు పరారైన ముగ్గురికి కలిపి 12 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని వాటిని జప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్మగ్లర్లను అరెస్టు చేసిన సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

పట్టుబడిన ఎర్రచందనం స్మగ్లర్లు