చెర్వుగట్టుపై మూడుగుండ్లు

ABN , First Publish Date - 2021-01-14T05:43:25+05:30 IST

భక్తుల దర్శన ఇబ్బందులను తీర్చేలా, ఆలయ నిర్వహణపరంగా గుర్తించిన లోపాల దిద్దుబాటు చర్యలపై మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం దృష్టిసారించింది.

చెర్వుగట్టుపై మూడుగుండ్లు
మూడుగుండ్లపై భక్తులు(ఫైల్‌)

ఇక ‘దర్శన’ భాగ్యమే

అభిషేకానికి అవకాశం లేదు 

లింగాకారానికి జాలి ఫెన్సింగ్‌

భక్తుల ఫిర్యాదు మేరకు దేవస్థానం చర్యలు

చెర్వుగట్టు (నార్కట్‌పల్లి), జనవరి 13: భక్తుల దర్శన ఇబ్బందులను తీర్చేలా, ఆలయ నిర్వహణపరంగా గుర్తించిన లోపాల దిద్దుబాటు చర్యలపై మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం దృష్టిసారించింది. చెర్వుగట్టు దేవస్థానం గుట్టపై ఉన్న దర్శనీయ స్థలాల్లో మూలవిరాట్టు ఉన్న గర్భాలయం తర్వాత అంతటి ప్రత్యేకత ఉన్నది మూడుగుండ్ల ప్రదేశానిదే. చెర్వుగట్టు సందర్శనకు వచ్చే భక్తుల్లో చాలామంది మూడుగుండ్లపై ఉన్న లింగాకారాన్ని దర్శించుకుని క్షీరాభిషేకం చేస్తారు. ఇందుకుగాను పూర్వం రెండు పెద్ద బండరాళ్ల మధ్య ఉన్న ఇరుకు స్థలంనుంచి మాత్రమే చేరుకోవాల్సి వచ్చేది. స్వామిపై నిజమైన భక్తి విశ్వాసాలు ఉన్నవారు మాత్రమే వెళ్లగలరనే ప్రతీతి కూడా ఉంది. అయితే కాలక్రమంలో క్షేత్రానికి పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా సులువుగా పైకి వెళ్లడానికి, మళ్లీ కిందకు దిగడానికి వేర్వేరుగా ఇనుపరాడ్లతో మెట్లను నిర్మించి లింగాకారం వద్ద నిల్చునే స్థలాన్ని ఏర్పాటు చేశారు. దీంతో మూడుగుండ్ల పైకి వెళ్లిన భక్తులు క్షీరాభిషేకం, జలాభిషేకం చేస్తుండగా పట్టే సమయంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు అసహనానికి గురవుతున్నారు. అమావాస్య, జాతర సమయాల్లో తొక్కిసలాటలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన దేవస్థాన సిబ్బంది మూడుగుండ్లపై అభిషేకాలకు బదులు కేవలం దర్శనం మాత్రమే చేసుకునేలా లింగాకారం చుట్టూ జాలీ ఫెన్సింగ్‌ వేయించారు. దీంతో భక్తులు ఇక దర్శనం మాత్రమే చేసుకోగలుగుతారని, పైగా గంటలకొద్దీ ఇనుప మెట్లపై పెద్దసంఖ్యలో భక్తులు వేచి ఉండటం వల్ల జరిగే ప్రమాదాలను నివారించవచ్చని దేవస్థాన సిబ్బంది భావిస్తున్నారు.  



ఘనంగా లక్ష పుష్పార్చన

నార్కట్‌పల్లి, జనవరి 13: చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారంరాత్రి లక్ష పుష్పార్చన ఉత్సవం వైభవంగా నిర్వహించారు. వేడుకకు ముందు ఉత్సవమూర్తులను ప్రధానాలయం నుంచి మంగళవాయిద్యాల నడుమ మహా మండపానికి పల్లకిసేవలో తీసుకువచ్చారు. భక్తుల శివనామస్మరణలు, ఆలయ ప్రఽధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ లక్ష పుష్పార్చన వేడుక జరిగింది. ఉత్సవంలో  దేవస్థాన చైర్మన్‌ మేకల అరుణారాజిరెడ్డి, ధర్మకర్తలు, ఈవో అన్నెపర్తి సులోచన పాల్గొన్నారు. ఇదిలా ఉంటే రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో జాతర తొలి ఘట్టం ప్రారంభమైంది. రథసప్తమి రోజున జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకుగాను గుట్ట కింద ఉన్న పార్వతీ అమ్మవారిని గుట్టపైకి తీసుకెళ్తారు. బ్రహ్మోత్సవాల పరిసమాప్తి అనంతరం తిరిగి గుట్ట కింద ఆలయంలోకి చేర్చడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే బుధవారం భోగి రోజున పల్లకిసేవతో అమ్మవారిని గుట్టపైకి తీసుకొచ్చారు.  

 

Updated Date - 2021-01-14T05:43:25+05:30 IST