Abn logo
Oct 30 2020 @ 16:15PM

అడవుల రక్షణ, కలప స్మగ్లింగ్ నివారణ పై రాష్ట్రాల మధ్య సమన్వయం

జయశంకర్ భూపాలపల్లి: గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అడవులు, వన్యప్రాణుల రక్షణ, కలప స్మగ్లింగ్ నివారణ ధ్యేయంగా కలిసి పనిచేయాలని మూడు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం చెల్పూర్  జెన్ కో కార్యాలయంలో మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ రాష్ట్రాల పాలన, పోలీస్, అటవీ అధికారుల ఒక రోజు వర్క్ షాప్ జరిగింది. సుమారు రెండు దశాబ్దాల విరామం తర్వాత ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలో పెద్ద పులి సంచారం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్త మైంది. గోదావరి వెంట మూడు రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉన్న అడవులను కాపాడటం, కలప స్మగ్లింగ్ నివారణ, వన్యప్రాణుల రక్షణ, వృధ్దికి పరస్పరం 


సహకరించుకోవాలని నిర్ణయించారు. తడోబా (మహారాష్ట్ర), ఇంద్రావతి (ఛత్తీస్ ఘడ్), కవ్వాల్ (తెలంగాణ) పులుల సంరక్షణ కేంద్రాల్లో ఇప్పటికే తీసుకుంటున్న చర్యలు, ఆయా అడవుల్లో పులుల సంఖ్య పెరగటం వల్ల ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండటంతో అక్కడ తీసుకోవాల్సిన చర్యలు, సమన్వయంపై ప్రధానంగా చర్చ జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో రెండు వైపులా కంట్రోల్ రూమ్ ల ఏర్పాటు ద్వారా భద్రతను పటిష్టం చేయాలని నిర్ణయించారు. అలాగే జాయింట్ పెట్రోలింగ్ ద్వారా నిఘాను పెంచటం, పోలీస్ శాఖతో సమన్యయం, మూడు రాష్ట్రాల క్షేత్ర స్థాయి అధికారులతో సహా, ఉన్నతాధికారులు కూడా తరుచుగా సమావేశం కానున్నారు.


ఉమ్మడి అధికారులతో వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేయటం ద్వారా సమాచార మార్పిడి చేసుకోనున్నారు.  వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాల్లో బేస్ క్యాంపుల ఏర్పాటు ద్వారా కలప అక్రమ రవాణాపై గట్టి నిఘా పెట్టడంతో పాటు, అడవుల్లోకి స్మగ్లర్ల ప్రవేశాన్ని నియంత్రించనున్నారు. పీసీసీఎఫ్ ఆర్. శోభ మాట్లాడుతూ, సరిహద్దు రాష్ట్రాల సమన్వయ సమావేశాల ద్వారా అటవీ ఆవాసాలను రక్షించటం, ప్రణాళికాబద్ధంగా అటవీ అధికారులకు అవగాహన పెంచటంతో నిరంతర నిఘా సాధ్యమౌతుందన్నారు. జాతీయ పులుల సంరక్షణ సంస్థ (ఎన్టిసిఏ) తరపున పాల్గొన్నఎస్.ఎన్.మురళి మాట్లాడుతూ అడవుల సంరక్షణలో తెలంగాణ చొరవను అభినందించారు. పులుల సంరక్షణకు మరిన్ని నిధులను మంజూరు చేస్తామని ప్రకటించారు.


తాజాగా ములుగు, భూపాలపల్లి,  పెద్దపల్లి లలో పెద్దపులి సంచరిస్తున్నందున అడవి అభివృద్ధికి అవకాశం ఉందన్నారు. మహారాష్ట్ర  గడ్చిరోలి, చంద్రాపూర్ చీఫ్ కన్జర్వేటర్ ఎన్.ఆర్. ప్రవీణ్,  ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం జగదల్ పూర్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ మహమ్మద్ షాహిద్ లు కూడా తమ ప్రాంతాల్లో అటవీ అభివృద్దికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. అడవిని రక్షించేందుకు, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణకు పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని రామగుండం కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. 


ఈ సమావేశానికి వరంగల్ రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ ఎం.జె. అక్చర్ అధ్యక్షత వహించారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, భూపాలపల్లి కలెక్టర్ అబ్దుల్ అజీమ్, మూడు రాష్ట్రాలకు చెందిన గోదావరి పరీవాహక ప్రాంతం జిల్లాల పాలన, పోలీస్, అటవీ అధికారులు, తడోబా, ఇంద్రావతి, కవ్వాల్  టైగర్ రిజర్వ్ ప్రొజెక్టు డైరెక్టర్లు,  13 జిల్లాల అటవీ అధికారులు ఈ వర్క్ షాపులో పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement